.
Subramanyam Dogiparthi … గ్లామర్ నటి విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబ్ బిరుదులతో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఫైట్లు చేయగలమని నిరూపించుకుని, తక్కువ టైంలో హీరోల కన్నా ఎక్కువ పారితోషికం పొందేలా చేసిన సినిమా 1990 జూన్ 29వ తేదీన రిలీజయిన ఈ కర్తవ్యం సినిమా .
ఈ సినిమాకన్నా ముందే ప్రతిఘటన , భారతనారి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ప్రేక్షకులలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ఆమె . జ్యోతిలక్ష్మి , విజయనిర్మల , విజయలలిత వంటి హీరోయిన్లు ఈమె కన్నా ముందే ఫైట్లు చేసినా విజయశాంతి పోలీస్ ఆఫీసరుగా మంచి పేరు తెచ్చుకున్న సినిమా ఇది .
Ads
ఈ సినిమా టైంకు దేశంలో ఖరోడా IPS ఆఫీసరుగా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడీని స్ఫూర్తిగా తీసుకుని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ సినిమా కధను తయారు చేసారు పరుచూరి బ్రదర్స్ . అప్పటికే మన రాజకీయ సామాజిక రంగాలు ఘోరంగా కలుషితం అయిఉన్నాయి .
వాటన్నింటినీ కవర్ చేస్తూ ఓ రాజకీయ నాయకుడితో విధి నిర్వహణలో రాజీ పడకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఘర్షణ పడే ఆఫీసరుగా మోహన్ గాంధీ స్క్రీన్ ప్లేని , పరుచూరి బ్రదర్స్ డైలాగులను బిర్రుగా తయారు చేసుకున్నారు .
విజయశాంతి తర్వాత ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర యన్టీఆర్ బంధువు , నిర్మాత పుండరీకాక్షయ్యది . సినిమాలో పేరు ముద్దు కృష్ణయ్య . భలే పేరు . రావు గోపాలరావు , కోట శ్రీనివాసరావు , గొల్లపూడి , సత్యనారాయణ వంటి నటులను కాకుండా తెరకు పూర్తిగా కొత్త విలన్ని తెచ్చి సక్సస్ అయ్యారు . ఆయన కూడా అద్భుతంగా నటించారు . డైలాగులను బాగా డెలివర్ చేసారు .
ఇతర ప్రధాన పాత్రల్లో వినోద్ కుమార్ , చరణ్ రాజ్ , నూతన్ ప్రసాద్ , బాబూమోహన్ , నర్రా , పి యల్ నారాయణ , నిర్మలమ్మ , తాతినేని రాజేశ్వరి , సాయికుమార్ , సాక్షి రంగారావు , కాకరాల , రమణమూర్తి తదితరులు నటించారు . బేబీ మీనా కుమారి మీనా అయింది . రవితేజ గుర్తింపు లేని పాత్రలో మొదటిసారిగా తెర మీద తళుక్కుమన్నాడు .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రమణ్యం , జానకమ్మ వేటూరి , వంగపండు వ్రాసిన పాటల్ని పాడారు . వినోద్ కుమార్ పాత్ర పాడే కొట్టు కొట్టు కొట్టు పాట , విజయశాంతి మెడికల్ టెస్టుకు ప్రిపేర్ అయ్యే క్రమంలో వచ్చే పాట సమరం సమరం మనదే విజయం బాగా గుర్తుండిపోయిన పాటలు . ఇంకో పాట అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మేస్త్రీ పాట ఉంది .
70 లక్షల రూపాయల పెట్టుబడితో మద్రాస్ , విశాఖపట్టణంలలో నిర్మించబడిన ఈ సూపర్ హిట్ సినిమాకు మూడు కోట్ల కలెక్షనుతోపాటు అవార్డుల వర్షం కూడా కురిసింది . విజయశాంతికి జాతీయ స్థాయిలో , రాష్ట్ర స్థాయిలో , ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి . మద్రాసులో జరిగిన వంద రోజుల ఫంక్షనుకు కిరణ్ బేడీ , బాలకృష్ణ ముఖ్య అతిధులుగా వచ్చారు .
బహుశా ఈ సినిమా చూడనివారు ఉండరేమో ! సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు , విజయశాంతి అభిమానులు మరలా కూడా చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు

- ఢైలాగుల్లో బాగా ఫేమస్…, మీ ఇంట్లో ఉప్మా తిన్నాను, ఉపకారం చేయించుకో, అపకారం కాదు… నీ జీవితం మీద నాకు విరక్తి వచ్చింది… ఢిల్లీ వెళ్లాను, టికెట్ మీద నా పేరే ఉంది… ఈ సినిమా విజయానికి విజయశాంతితోపాటు సినిమాలు పేలిన డైలాగ్స్ కూడా ఓ కారణమే, ప్రత్యేకించి పుండరీకాక్షయ్య పోషించిన పాత్ర..! ఆయన దాన్ని పండించిన తీరు..!
Share this Article