.
Ramu Suravajjula …. సంజూ వ్యధ: ఒక వీర యోధుడి విజయ గాధ! అహ్మదాబాద్ లో మొన్న (ఆదివారం, మర్చి 8, 2026) జరిగిన టీ-20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్ లోకి భారత దేశం ప్రవేశించడానికి, న్యూజిలాండ్ మీద తుది పోరులో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకుడు సంజు శాంసన్. క్రికెట్ వీరాభిమానుల అడ్డా అయిన భారత్ ఈ విజయంతో ఆనంద పరవశంలో మునిగేలా చేసిన ముఖ్యుడు సంజూ.
భారత జట్టుకు ఎంపికైనా…. కొన్నేళ్ళుగా బెంచ్ కు పరిమితమై కన్నీళ్లు గుడ్లలో కుక్కుకుని, మైదానంలో ఆడేవారికి కేవలం నీళ్లు అందించడానికి మాత్రమే పరిమితమైన ఈ కేరళ కుర్రోడి ది సినిమా గాథ. టోర్నమెంట్ లో కేవలం ఐదు మ్యాచ్ లు ఆడి విలువైన 321 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు.
Ads
వెస్ట్ ఇండీస్ (97), ఇంగ్లండ్ (89) జట్ల మీదనే కాకుండా ఫైనల్స్ లో కూడా శక్తిమంతమైన న్యూజిలాండ్ మీద కూడా చెలరేగి 89 పరుగులు చేసి సత్తా చాటాడు. మాటల తూటాలతో ఒకప్పుడు సంజూను కించపరిచిన వారే ఇప్పుడు వావ్ వావ్ అని పొగుడుతున్నారు. పొగడక తప్పని పరిస్థితి సంజూ బ్యాట్ కల్పించింది.
ఫుట్ బాల్ క్రీడాకారుడైన నాన్న ప్రోత్సాహంతో కేవలం నాలుగేళ్ల ప్రాయంలోనే అన్నతో కలిసి బ్యాట్ పట్టిన సంజూ (ఇప్పుడు 31 ఏళ్లు)కు కెరీర్ లో ఎన్నో అవమానాలు, అవాంతరాలు ఎదురయ్యాయి. ఆట అంటే కేవలం విజయం మాత్రమే అని నమ్మే వెర్రి క్రీడాభిమానులున్న దేశంలో సంజూ మీద సెటైర్లు వేసే వారే ఎక్కువ ఉండేవారు.
పుట్టిన ప్రాంతం (సౌత్), మతం (క్రిస్టియానిటీ) కూడా సంజూకు కలిసిరాలేదని నాకు అనిపించింది. కుమారుల క్రికెట్ కెరీర్ కోసం దేశ రాజధాని ఢిల్లీ మకాం మార్చిన సంజూ తండ్రి అక్కడ అవకాశాలు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి తిరువనంతపురం చేరుకున్నారు. ఆ తర్వాత సంజూ కెరీర్ ఒక గాడిలో పడినా అద్భుతమైన అవకాశాలు రాకుండా పోయి సంజూలో నిరాశ నిస్పృహలు నింపాయి.
న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఘోరంగా విఫలమైన సంజూ కల చెదిరి, కన్నీళ్ల పర్యంతం అయిన సమయంలో ఆయనకు తోడు ఉన్నది అమ్మా, నాన్న, భార్య… సంజూను టీ 20 ప్రపంచ కప్ పోటీలలో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయకూడదన్న ప్రచారం చేసే ఉన్మాద సెక్షన్ కూడా పోగయ్యింది. ఆ సమయంలో భార్య చారులత రమేష్ అండగా నిలిచింది. కలిసిరాని కాలాన్ని ఒక్కోసారి అంగీకరించి ముందుకు సాగాలని ఆమె తన ఇంస్టాలో ఈ కింది విధంగా రాసింది…

- “When all is done, and answers fade, just bow your head and let life be. Because sometimes have to be accepted, not explained…”
సంజూకు ఎదురైనా పరాభవాలను ప్రస్తావిస్తూనే… అబ్బాయి ఆట కోసం తాను త్యాగం చేశానని అనడాన్ని తాను అంగీకరించబోనని, ఒక తండ్రిగా తన బాధ్యత తాను నెరవేర్చానని ఆయన తండ్రి శాంసన్ విశ్వనాథ్ చెప్పారు. మాజీ కెప్టెన్లు ఎం ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ తన కొడుకు పదేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్ నాశనం చేసారని అయన 2024 నవంబర్ లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పి సంచలనం సృష్టించారు.
వాళ్లు ఎంత బాధిస్తే, సంజూ అంత రాటు దేలాడని కూడా అయన చెప్పారు. ‘నాన్నా… నా వల్ల కావట్లేదు’ అని సంజూ ఫోన్ లో చెబితే వెంటనే వెళ్లి కలిసి తండ్రి ఊరటనిచ్చాడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? పనిగట్టుకుని ఎంతకాలమని ప్రతిభను పాతెయ్యగలరు? కమాన్ సంజూ… we wish to see you as Indian team captain soon…
-
అంతర్మత వివాహం..: సంజూ శాంసన్ క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, చారులత హిందూ మతస్థురాలు…
-
వివాహ తేదీ…: వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, 2018 డిసెంబరు 22న కేరళలోని కోవలంలో వివాహం చేసుకున్నారు….
-
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్…: వీరిద్దరివీ వేర్వేరు మతాలు కావడంతో, వీరు ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ (Special Marriage Act) కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు…
-
నేపథ్యం…: వీరిద్దరూ తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో కలిసి చదువుకున్నారు… చారులత తండ్రి బి. రమేష్ కుమార్ ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఎడిటర్‌గా పనిచేశారు…
Share this Article