.
ఆఖరి బాల్‌కు సిక్స్ కొడితే వచ్చే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుంది… తెలంగాణ పోలీసులు ఏకంగా మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిని, కీలక నేతలను లొంగిపోయేలా చేయడం..! ఆ సిక్స్ కొట్టిన బ్యాటర్ డీజీపీ శివధర్ రెడ్డి..!
నిజానికి ఏదో సరదాగా ఇలా చెప్పుకున్నంత సులభమేమీ కాదు, టాప్ కేడర్ నక్సలైట్లను లొంగుబాటలోకి తీసుకురావడం..! రక్తపు చుక్క కిందపడకుండా, ఒక్క బుల్లెట్ పేలకుండా… టాప్ కేడర్ నమ్మకాన్ని కూడా తెలిచి, జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం ఇది… చాలా సంక్లిష్టంగా ఉంటుంది టాస్క్… అన్నింటికన్నా ముందు లొంగిపోవాలనుకునే నక్సలైట్లకు ఓ భరోసా అవసరం… అది ప్రాణాలకు రక్షణ..!
Ads
ఒకప్పుడు కణకణమండిన, ప్రతి పల్లెకూ సెగ తగిలిన మావోయిజంతో… ఇక వచ్చేదేమీ, సాధించేదేమీ లేదనీ, తామెప్పుడో దారితప్పామని టాప్ కేడర్ నక్సలైట్లే తీర్మానించేసుకుని, ఆత్మచింతనతో కొందరు సాయుధంగా లొంగిపోతే, మరికొందరు ఆయుధాలను అప్పగించేసి వచ్చి లొంగిపోయారు… వెరసి మొత్తంగా మావోయిస్టు పార్టీయే ఆయుధాన్ని కిందపడేసింది… కారణాల విశ్లేషణ చాలా పెద్ద సబ్జెక్టు…
పురుగు కూడా జొరబడలేని మావోయిస్టు అడ్డాల్లోకి కూడా పోలీసు బలగాలు సైలెంటుగా ప్రవేశించి కేంద్ర కమిటీ సభ్యులను కూడా ఖతం చేసే పరిస్థితి రావడానికి కారణం… అగ్రనేతల సమాచారం కూడా అలా వచ్చి చేరుతోంది ప్రత్యేక బలగాల వద్దకు… లొంగిపోతే ప్రాణం ఉంటుంది, లేకపోతే ఎగిరిపోతుంది… ఇదీ సిట్యుయేషన్… మార్చి నెలాఖరుకల్లా నక్సలిజాన్ని రూపుమాపుతామని అమిత్ షా చేసిన ప్రకటన వెనుక అదే ధీమా…
ఓవైపు ప్రాణభయం, మరోవైపు ఆత్మచింతన… లొంగిపోదాం, కానీ ఎక్కడ..? ఎలా..? తీరా వెళ్లాక మాటతప్పి, ప్రాణాలు గాలిలో కలిపేస్తే..? ఇక్కడ నక్సలైట్లు సేఫ్ ప్యాసేజీ ఇవ్వగల ప్రభుత్వం వైపు, పోలీస్ యంత్రాంగం వైపు చూడసాగారు… హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత ఏపీ పోలీసులు ఆ క్రెడిబులిటీ కోల్పోయారు… (హిడ్మా కూడా తెలంగాణకు లొంగుబాటు కోసం వస్తూ ఏపీ పోలీసులకు దొరికి ప్రాణాలు కోల్పోయాడా..?)
ఇక్కడ తెలంగాణ కనిపింంచింది మావోయిస్టులకు… ఒకవైపు సైద్ధాంతిక యుద్ధం (Ideological warfare)లో మావోయిస్టుల పంథా తప్పు అనేది ఎరుకపరుస్తోంది… మరోవైపు తన గూఢచార (ఇంటలిజెన్స్) వ్యవస్థపై పట్టు (యుక్తి, వ్యూహం), ఇంకోవైపు మావోయిస్టు సిద్ధాంతాలను సమర్థవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం…. ఈ రెండూ కలిస్తే మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగానే కాకుండా, వారి అగ్ర నాయకుల మనసులను కూడా గెలవవచ్చని తెలంగాణ నిరూపించింది…
ఛత్తీస్‌గఢ్ (CG) లాగా తెలంగాణ కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే పనిచేయలేదని కాదు… కానీ, సైనిక బలగాలను ఉపయోగించి నిర్మూలించడం కంటే, ‘యుక్తి’తో పనిని పూర్తి చేయడం ఎందుకు ముఖ్యమనే విషయంలో మన నాయకత్వంలో విజ్ఞత కనిపించింది…
వందలాది గ్రేహౌండ్స్ బలగాలను మోహరించినప్పటికీ, ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా మొత్తం పి.ఎల్.జి.ఏ (PLGA) బృందాన్ని లొంగిపోయేలా చేసిన ఆసిఫాబాద్ ఆపరేషన్, నక్సలిజం చరిత్రలో ఒక విశిష్ట గాధగా నిలిచిపోతుంది… ‘రక్తం చిందించని’ క్లాసిక్ ఆపరేషన్ అది… దానికి తెలంగాణ పోలీసులు పెట్టిన పేరు… ‘ఆపరేషన్ అమ్నెస్టీ’ (Operation Amnesty)“…
సరే… ఒకప్పుడు నక్సలైట్ల ఏరివేతలో పోటీలుపడిన చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర పోలీసులు ఇప్పుడు లొంగుబాట్లలోనూ పోటీలుపడ్డారు… ‘‘క్రెడిట్స్ ప్రామాణికం’’ మారిపోయింది… మావోయిస్ట్ పార్టీ టాప్ కేడర్‌లో చాలామంది తెలంగాణ వాళ్లే కదా, మీరు రండి, మీ ప్రాణాలకు నాదీ భద్రత అని డీజీపీ శివధర్ రెడ్డి పలుసార్లు ప్రకటన చేయడం, అవసరమైన ‘లింక్స్’ ద్వారా ఆ సమాచారం టాప్ కేడర్ దాకా చేరవేయడం… లొంగుబాట్లను పక్కాగా ఆర్గనైజ్ చేయడం ఫలించింది… (తను గతంలో ఎస్ఐబీలో పనిచేయడం కూడా ఉపకరించింది)…
పైగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కూడా ఓ కారణమే… 20 ఏళ్ల క్రితం నక్సలైట్లతో చర్చలు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే… మొన్నమొన్నటివరకూ నక్సలైట్లు ప్రతిపాదించిన ‘కాల్పలు విరమణ- శాంతి చర్చ’ల పట్ల సానుకూలంగా ఉన్నదీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే… శృతి, విద్యాసాగర్ వంటి నక్సలైట్లను హతమార్చిన కేసీయార్ గద్దె దిగిపోయి, కొత్తగా ప్రజా ప్రభుత్వం రావడం కూడా ‘‘లొంగుబాట్లకు తెలంగాణ సేఫ్’’ అనే భావనకు తావిచ్చింది…
తెలంగాణ తప్ప మిగతా అన్ని నక్సల్స్ రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వాలే… తెలంగాణలో మాత్రమే నాన్ ఎన్డీయే ప్రభుత్వం ఉంది… ఇప్పుడు దేవ్‌జీ, సంగ్రామ్ తదితర కీలక నేతలు ఇక్కడ లొంగిపోవడానికి ఇలా పరిస్థితులు అనుకూలించాయేమో… అనారోగ్యం, వయోభారంతో ఉన్న గణపతి బహుశా విదేశాలకు వెళ్లి ఉండవచ్చు… ఇంకా ఒకరిద్దరు టాప్ కేడర్ కూడా లొంగిపోతే… ఇక మావోయిస్టు పార్టీ సాయుధపోరుకి ఫుల్ స్టాప్ పడినట్టే…
బస్తర్ అడవుల్లోని మావోలు చత్తీస్‌గఢ్ సీఎంకు ఓ సందేశం పంపించారట… మాకు భద్రత కల్పిస్తే అందరమూ సామూహికంగా వచ్చి లొంగిపోతాం, ఈమేరకు రేడియోలో ఓ ప్రకటన ఇవ్వండి అని… సో, ఇక మార్చి డెడ్‌లైన్‌లోపే ‘ఆపరేషన్’ పూర్తయిపోనుంది… ఆల్రెడీ పోలీసు క్యాంపులోనే ఉన్న దేవ్‌జీ తదితరుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించడానికి ‘ముందస్తు కసరత్తు’ సాగుతున్నట్టుంది..!
చివరగా… ఆయుధాల్ని, డబ్బును, బంగారాన్ని, డంపులను వదిలేసి అందరూ వచ్చేస్తే… వాటికి కేర్ టేకర్లు ఎవరు అడవుల్లో…!?
Share this Article