.
Subramanyam Dogiparthi …. మొగుడు , దొంగ మొగుడు , ఘరానా మొగుడు . తెలుగులో మొగుడు టైటిల్‌కు బాగా వాల్యూ… సరే, ఇది అత్తింట్లో అద్దె మొగుడు . 1991 లో వచ్చిన ఈ కుటుంబ కధాచిత్రం హిందీలో ఘర్ హై తో ఐసా అనే సినిమాకు రీమేక్ . హిందీలో అనిల్ కపూర్ , మీనాక్షి శేషాద్రి లీడ్ రోల్సులో నటించారు . అక్కడే కాదు ; ఇక్కడా బాగానే ఆడింది .
అత్తలు , ఆడపడుచులు నోరు లేని కోడళ్ళను రాచిరంపాన పెట్టే సినిమాలు మనకు చాలానే ఉన్నాయి . ఈ సినిమా కూడా ఆ కేటగిరీ లోనిదే . వయ్యారాల వై. విజయ పరమ గయ్యాళి అత్త . ఆమె మొగుడు గారు సుత్తి వేలు నోరు లేని పెళ్ళాం చాటు మొగుడు . వాళ్ళ పెద్ద కొడుకు ఆహుతి ప్రసాద్ , అతని భార్య వైష్ణవి . ఓ నంగనాచి కూతురు , ఆ కూతురికో పనికిరాని ఇల్లరికం మొగుడు మల్లికార్జున రావు . రెండో కొడుకు మన హీరో రాజేంద్రప్రసాద్ .
Ads
పెద్ద కోడల్ని అత్త , ఆడపడుచు , మొగుడు గారు 1950s , 1960s సినిమాల్లోలాగా రాచిరంపాన పెడుతుంటారు . ఆ కోడలు మాత్రం నోరెత్తకుండా అన్ని కష్టాలు పడుతూ చాకిరి చేస్తూ ఉంటుంది . హీరోయిన్ నిరోషా . మొండి ఘటం , పొగరుబోతు . తండ్రి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ . ఆమెను దారిలో పెట్టేందుకు హీరోకి మేనేజర్ ఉద్యోగం ఇస్తాడు .
ముందు నిరసించినా క్రమంగా ప్రేమలో పడుతుంది . ఈలోపు వదిన కూతురితోసహా ఆత్మహత్య చేసుకుందని తెలిసిన హీరో , హీరోయిన్ , ఆమె తండ్రి కలిసి ఓ నాటకాన్ని రచిస్తారు . తాత మనవడు సినిమాలో రాజబాబు , విజయనిర్మల లాగా దండలతో ప్రత్యక్షమవుతారు .
ఇంట్లో అత్తామామల్ని , పెద్ద కొడుకుని , ఆడపడుచుని దారిలోకి తెస్తారు . చివర్లో పెద్ద కోడలు , ఆమె కూతురు వచ్చి అత్తమామల్ని క్షమించేయడంతో హీరో హీరోయిన్లు ఒకటి కావటం , సినిమా శుభాంతం కావటం జరిగిపోతాయి .
ఈ సినిమాలో గొప్ప ఎట్రాక్షన్ ఏంటంటే బట్టల సత్యం తుమ్మితే దగ్గర్లో ఉన్న ఆడవాళ్ళ కుచ్చెళ్ళు , మగవాళ్ళ పంచెలు ఊడిపడతాయి . కొంచెం ముతకగా అనిపించినా సినిమాలో బాగానే చూపారు దర్శకుడు రేలంగి నరసింహారావు .
ఈ సినిమా టైంకే మాంచి ఫాంలో ఉన్న రాజేంద్రప్రసాద్ , నిరోషాలు చాలా హుషారుగా నటించారు . అత్త ఆడపడుచు ఆరళ్ళను భరించే పెద్ద కోడలిదే ప్రధాన పాత్ర . వైష్ణవి బాగా నటించింది . ఇల్లరికం అల్లుడిగా బట్టల సత్యం , పెద్ద కొడుకుగా ఆహుతి ప్రసాద్ . Spartex Ceremics సినిమా ఓనరుగా గొల్లపూడి మారుతీరావు , వయ్యారాల వై విజయ భర్తగా వేలు , ఆడపడుచుగా కాంచన (హీరోయిన్ కాంచన కాదు) , ఆహుతి ప్రసాదుకి బుధ్ధి చెప్పేవారిగా డిస్కో శాంతి , వంకాయల , డబ్బింగ్ జానకి తదితరులు నటించారు .
డైలాగులను మా గుంటూరు వారు , మిత్రులు Divakara Babu Madabhushi గారు చాలా బాగా వ్రాసారు . కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటల్ని వ్రాసారు . ఒక్క పాటను మాత్రం కీరవాణి వ్రాసారు . బాలసుబ్రమణ్యం , చిత్ర , రమణ పాడారు .
చలాకీ పాలపిట్ట , బాత్ రూమ్ అంటూ సాగే రెండు డ్యూయెట్లు చాలా హాటుగా ఉంటాయి . నిరోషాని టీజ్ చేసే గ్రూప్ డాన్స్ హుషారుగా ఉంటుంది . డిస్కో శాంతి అందగాడా అందుకోరా గొల్లభామ చేతిలోని పాలకుండ బాగా వచ్చింది . రాజేంద్రప్రసాద్ , నిరోషా , బట్టల సత్యం కలిసి అత్తమామల్ని , ఆడపడుచుని డిసిప్లిన్ చేసే భజగోవిందం పాట హుషారుగా ఉంటుంది .
వెరశి సినిమా బాగుంటుంది . It’s a good entertainer . చూడబులే . యూట్యూబులో ఉంది .
Share this Article