.
అనూజ్ అగ్నిహోత్రి..! శెభాష్ తాజా యూపీఎస్సీ ర్యాంకర్లలో టాపర్… గ్రేట్… భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావించే UPSC సివిల్ సర్వీసెస్ – 2025 ఫలితాల్లో AIR- 1 సాధించిన అనూజ్ అగ్నిహోత్రి సక్సెస్ స్టోరీ నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం… ఒక డాక్టర్‌గా ఉండి, ఐఏఎస్ (IAS) కావాలనే లక్ష్యంతో ఆయన సాగించిన ప్రయాణం విశేషమైనది…
ఆయన విజయగాథలోని ముఖ్యమైన ఘట్టాలు… అనూజ్ అగ్నిహోత్రి రాజస్థాన్‌లోని రావత్‌భటాకు చెందినవారు… ఆయన AIIMS జోధ్‌పూర్ నుండి MBBS పూర్తి చేశారు… డాక్టర్‌గా రోగులకు సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ, పాలనా విభాగంలో ఉండి సమాజంలో మరింత విస్తృతమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన యూపీఎస్సీని ఎంచుకున్నారు…
Ads
అనూజ్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించలేదు… గతంలో ఆయన మెయిన్స్ వరకు వెళ్లినా, తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు… గత ఏడాది ఆయన రిజర్వ్ లిస్టులో ఉండి, ప్రస్తుతం DANICS (Delhi, Andaman & Nicobar Islands Civil Service) కేడర్‌లో శిక్షణ పొందుతున్నారు… పట్టు వదలకుండా చేసిన మూడవ ప్రయత్నంలో ఏకంగా దేశంలోనే నంబర్ వన్ (AIR 1) ర్యాంకును కైవసం చేసుకున్నారు…
అనూజ్ అగ్నిహోత్రి ఈ విజయాన్ని ఎటువంటి భారీ కోచింగ్ సెంటర్ల సహాయం లేకుండానే సాధించడం విశేషం… ఆయన రోజుకు సుమారు 13 గంటలు సొంతంగా చదువుకునేవారు… ప్రిపరేషన్ సమయంలో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు… ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లకుండా, తన ఇంట్లోనే ఉండి క్రమబద్ధమైన ప్రణాళికతో చదివారు…
చాలా మంది స్కోరింగ్ కోసం వేరే సబ్జెక్టులు తీసుకుంటారు, కానీ అనూజ్ తన సొంత బ్యాక్‌గ్రౌండ్ అయిన మెడికల్ సైన్స్ (Medical Science) నే ఆప్షనల్‌గా ఎంచుకున్నారు… తన వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు…
ఆయన తండ్రి రావత్‌భటాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు… మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అనూజ్, తన తండ్రి కష్టాన్ని చూసి స్ఫూర్తి పొందారు… “మెడిసిన్ చదవడం కంటే యూపీఎస్సీ సిలబస్ పూర్తి చేయడం కష్టమనిపించింది, కానీ నిరంతర కృషి (Consistency) ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు” అని అనూజ్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు…
………. ఇదీ చాలామంది రాసిన సక్సెస్ స్టోరీ… కానీ ఎందుకో ఎక్కడో కలుక్కుమంది… చాాలామందికి ఈ కోణం నచ్చకపోవచ్చు… కానీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ అంటే లక్షల మందికి ఓ కల… ప్రిస్టేజియస్ సీట్… దేశంలో ఇంజనీర్లు, లాయర్లకు, ఇతరత్రా వృత్తి నిపుణులకు కొదవ లేదు, కానీ డాక్టర్లకు కొరత ఉంది… పైగా ఎయిమ్స్‌లో ఓ డాక్టరీ కోర్సుకు ప్రభుత్వం లక్షల రూపాయల సబ్సిడీ, అంటే ప్రభుత్వం ప్రజాధనం వెచ్చిస్తోంది… (సేమ్, ఐఐటీయన్స్)…
తను అది వదిలేసి సివిల్స్‌కు వెళ్తే… మరిక ఎయిమ్స్ డాక్టర్ డిగ్రీ విలువ ఎంత..? పోనీ, అప్పుడే తను వదిలేసి ఉంటే, ఆ సీట్లోకి మరో మెరిటోరియస్ స్టూడెంట్ వచ్చేవాడు కదా… ఈ దేశంలోని వైద్యరంగానికి ఎంతోకొంత సేవ చేసేవాడు కదా… ప్చ్… ఎవరో అన్‌నోన్ ప్రతిభావంతుడికి అన్యాయం జరిగింది… దీనికి భిన్నమైన కథనాలు కూడా వినిపించేవారు కోట్లల్లో ఉంటారు… కానీ నిజం మాత్రం చేదుగానే ఉంది..!!
పోనీ, DANICS ఏమైనా దిక్కుమాలిన సర్వీసా..? దాన్నెందుకు కొనసాగించలేకపోయాడు… అది స్టేటస్ కాదా..? అది సర్వీస్ కాదా..? నిజానికి సివిల్ సర్వీస్ ఇప్పుడు దేశంలో పెద్ద క్రెడిబులిటీ ఉన్న సర్వీస్ ఏమీ కాదు… భ్రష్టుపట్టించారు బోలెడు మంది… కానీ ఒక డాక్టర్‌గా ఆయన నాలుగు ప్రాణాలు కాపాడినా సరే… ఆ జీవితానికి ఎంత విలువ..? ప్చ్, అదీ బాధనిపించింది..!!
Share this Article