Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …

June 8, 2026 by M S R

.

“సాహెబ్… ముందు మీరు నా ప్రాణం కాపాడారు, తర్వాత నేను మీ ప్రాణం కాపాడాను!”

ఆ రోజు మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇల్లంతా హడావుడి. పనిమనుషులు కొత్త యూనిఫారాలు వేసుకుని తిరుగుతున్నారు. అమ్మ వంటగదిలో తలమునకలై ఉంది. నాన్న ముఖంలో ఆనందం ఉన్నా, ఆ ఆనందాన్ని మించిన టెన్షన్ కనిపిస్తోంది.

Ads

కారణం చిన్నది కాదు. మరికొన్ని రోజుల్లో భారత సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టబోతున్న లెఫ్టినెంట్ జనరల్ సామ్ మానెక్‌షా ఆ సాయంత్రం మా ఇంటికి భోజనానికి రానున్నారు. అది వారం రోజుల క్రితం మొదలైంది.

కలకత్తాలో కల్నల్‌గా పనిచేస్తున్న మా నాన్న ఒకరోజు అధికారిక పనిమీద సామ్ మానెక్‌షాను కలిశారు. సమావేశం ముగిసిన తర్వాత ధైర్యం చేసి ఒక మాట అడిగారు. “సర్… ఒకసారి మా ఇంటికి డిన్నర్‌కు వస్తే మాకు గౌరవంగా ఉంటుంది.”

అది అడిగేటప్పుడు ఆయనకే పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే సామ్ మానెక్‌షా వ్యక్తిగత ఆహ్వానాలు అంగీకరించరని సైన్యంలో పేరుంది. కానీ సామ్ నవ్వుతూ వెంటనే ఒప్పుకున్నారు. ఆ మాటతోనే మా ఇంట్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు మొదలయ్యాయి.

సామ్‌కు అత్యంత సన్నిహితుడైన కల్నల్ మెహతా వచ్చి ప్రత్యేక సూచనలు ఇచ్చాడు. “ఇంటి పెయింటింగ్ చేయించండి. బాత్‌రూమ్‌ల నుంచి వంటగది వరకు అన్నీ శుభ్రంగా ఉంచండి. సామ్ డ్రాయింగ్‌రూమ్‌లో కూర్చునే వ్యక్తి కాదు. ఇంటి మూలమూల తిరుగుతాడు. సేవకులతో మాట్లాడతాడు. వాళ్ల కుటుంబాల గురించి అడుగుతాడు.”

అన్నీ చెప్పాక ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చాడు. “మరొకటి… డిన్నర్‌కు ఒక్క ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండకూడదు…” అంతే…

పెయింటర్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు ఇంటిని ముట్టడించారు. పనిమనుషులకు కొత్త యూనిఫారాలు. టాలీగంజ్ క్లబ్ నుంచి ప్రత్యేక వంటమనిషి. కమాండ్ మెస్ నుంచి బార్టెండర్. తెలిసిన పౌరులను వెతికి అతిథులుగా ఆహ్వానించడం…

వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా ఏడున్నర గంటలకు సామ్ మానెక్‌షా మా ఇంటి గుమ్మం తొక్కారు. మెహతా చెప్పినట్టే ముందుగా ఇంటిని పరిశీలించారు. ప్రతి గదిలోకి వెళ్లారు. వంటగది చూశారు. పనిమనుషులతో మాట్లాడారు. వారి పిల్లల గురించి అడిగారు.

ఆ తర్వాత స్కాచ్ గ్లాసు చేతిలో పట్టుకుని కూర్చున్నారు. కొద్దిసేపటికే అక్కడున్న అందరినీ తన మాటల మాయలోకి లాగేశారు. మమ్మల్ని కూడా పిలిచి దగ్గర కూర్చోబెట్టారు. అలా మాటలు సాగుతుండగా యుద్ధకాలపు అనుభవాలపై చర్చ మొదలైంది.

అప్పటికే అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యంపై దాడి చేస్తూ సామ్ మానెక్‌షా శరీరంలోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయినా ఆయన బతికిపోయారు. అక్కడున్న ఒక నేత్ర వైద్యుడు ఆశ్చర్యంగా అడిగాడు.

“జనరల్ గారూ… తొమ్మిది బుల్లెట్లు తగిలి కూడా మీరు ఎలా బతికారు?”

సామ్ గ్లాసులోని విస్కీని ఒకసారి తిప్పి చూశారు. “డాక్టర్… ఆ కథ 1942లో కాదు… 1934లో మొదలైంది,” అన్నారు. అంతే. అందరూ ముందుకు వంగి కూర్చున్నారు.

యువ అధికారి సామ్ మానెక్‌షా అప్పట్లో పంజాబ్‌లోని ఖాసా అనే ప్రాంతంలో పోస్టింగ్‌లో ఉన్నారు.  ఒక సాయంత్రం కొందరు సిక్కు సైనికులు ఆందోళనగా ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లతో పాటు షేర్ సింగ్ అనే సిపాయి ఉన్నాడు.

ఊరిలో జరిగిన భూవివాద ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కేసులో షేర్ సింగ్ పేరును కూడా చేర్చారు. “సాహెబ్, నేను ఎవరినీ కొట్టలేదు,” అని అతడు ప్రమాణం చేశాడు. సామ్ అతని కళ్లలోకి చూశాడు. అతడు నిజమే చెబుతున్నాడని వెంటనే అర్థమైంది. కానీ పోలీసుల ముందు అది ఎలా నిరూపించాలి?

అప్పుడే ఆయన మెదడులో ఒక పథకం మెరిసింది. అది ప్రమాదకరమైనది. కానీ షేర్ సింగ్‌ను కాపాడగలిగేది అదే. ఓ ప్లాన్.

ఆ రాత్రి సామ్ తన స్నేహితుడైన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్ట్‌రైట్‌ను క్లబ్‌లో కలిశాడు. మద్యం తాగుతూ ఉండగా ఒక్కసారిగా గడియారం చూసి లేచిపోయాడు.

“అయ్యో… ఈరోజు క్వార్టర్ గార్డ్ తనిఖీ నా బాధ్యత.”

“నా జీప్‌లో తీసుకెళ్తాను,” అన్నాడు కార్ట్‌రైట్.

సామ్ ఎదురుచూసింది అదే. ఇద్దరూ కలిసి శిబిరానికి వెళ్లారు. అక్కడ గార్డుగా నిలబడి ఉన్నవాడు షేర్ సింగ్. “ఎప్పటి నుంచి డ్యూటీలో ఉన్నావు? నీ దగ్గర మందు వాసన వస్తుందేం..? తాగి డ్యూటీ చేస్తున్నావా..”

“సాయంత్రం నాలుగు గంటల నుంచి డ్యూటీలో ఉన్నాను సాహెబ్….” అన్నాడు షేర్ సింగ్… ఎస్పీ కార్ట్‌రైట్ కూడా అది విన్నాడు. రిజిస్టర్‌లో నమోదు అయింది. అంతేకాదు, సామ్ ఉద్దేశపూర్వకంగా షేర్ సింగ్ మద్యం తాగాడని ఆరోపించి, క్వార్టర్ గార్డ్ సెల్‌లో నిర్బంధించమని ఆదేశించాడు.

మరుసటి రోజు పోలీసులు హత్య కేసుతో వచ్చినప్పుడు… రిజిస్టర్, సాక్షులు, జిల్లా ఎస్పీ కార్ట్‌రైట్— అందరూ షేర్ సింగ్ ఆ సమయంలో సైనిక శిబిరంలోనే ఉన్నాడని చెప్పారు. కేసు కూలిపోయింది. షేర్ సింగ్ బయటపడ్డాడు. “కానీ కథ అక్కడితో ముగియలేదు,” అని సామ్ చిరునవ్వుతో చెప్పారు.

“అది కేవలం మొదటి భాగం మాత్రమే.” 

బర్మా అడవులు… జపాన్ సైన్యంతో భీకర యుద్ధం. సామ్ తన సైనికులను ముందుండి నడిపిస్తూ శత్రు మెషిన్ గన్ స్థావరంపై దాడి చేశారు. అప్పుడే బుల్లెట్ల వర్షం కురిసింది.

ఒకటి కాదు.

రెండు కాదు.

తొమ్మిది బుల్లెట్లు.

ఛాతీ, పొట్ట, శరీరంలోని పలు భాగాల్లోకి దూసుకెళ్లాయి.

సామ్ నేలపై కుప్పకూలిపోయారు.

వెనక్కి వెళ్లే ఆదేశాలు వచ్చాయి.

గాయపడిన వారిని మోసుకెళ్లడం అసాధ్యం.

దాదాపు అందరూ ఆయన ఇక బతకరని భావించారు.

అప్పుడు ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

షేర్ సింగ్…


ఎన్నేళ్ల క్రితమో తనను ఓ కేసు నుంచి కాపాడిన అదే అధికారి ఇప్పుడు మరణంతో పోరాడుతున్నాడు. “సాహెబ్‌ను నేను వదిలిపెట్టను,” అన్నాడు.

సామ్‌ను భుజాలపై ఎత్తుకున్నాడు. అడవులు దాటాడు. కాల్పుల మధ్య నడిచాడు. చివరకు ఫీల్డ్ హాస్పిటల్‌కు చేర్చాడు. అక్కడి వైద్యుడు ఒకసారి సామ్‌ను చూసి తల ఊపాడు. ఇంత గాయాలతో బతికే అవకాశం చాలా తక్కువ. అయినా ఒక ప్రశ్న అడిగాడు.


“ఏం జరిగింది?”

అప్పటికే రక్తస్రావంతో అర్థచేతన స్థితిలో ఉన్న సామ్ ఒక్కసారిగా కళ్లు తెరిచారు.

ఆ పరిస్థితిలో కూడా ఆయన హాస్యాన్ని వదల్లేదు.

“నన్ను… ఒక గాడిద తన్నింది డాక్టర్…” అన్నారు.

వైద్యుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.

ఆ తర్వాత నవ్వేశాడు.

“ఈ పరిస్థితిలో కూడా జోక్ వేయగలుగుతున్నావంటే… నిన్ను కాపాడటానికి ప్రయత్నించడం విలువైన పని,” అన్నాడు.


శస్త్రచికిత్స జరిగింది. చికిత్స కొనసాగింది. అద్భుతంగా సామ్ బతికి బయటపడ్డారు. “మానెక్‌ షాలు అంత తేలికగా చనిపోరు,” అని సామ్ నవ్వుతూ చెప్పారు.

ఈ కథ ముగిసిందనుకునేలోపు మరో అతిథి అడిగాడు. “ఆ షేర్ సింగ్ తర్వాత ఏమయ్యాడు?”

సామ్ గట్టిగా నవ్వారు. “ఆ పాత రాస్కెలా?”…

విభజన తర్వాత సరిహద్దు ప్రాంతంలో ఉండిపోయాడు.

రిటైర్ అయ్యాక బంగారం స్మగ్లింగ్‌లోకి దిగాడు.

ఎప్పటిలాగే ఒకరోజు పోలీసులకు దొరికిపోయాడు.

అప్పుడు తన కొడుకులతో ఒక మాట చెప్పాడు.

“మానెక్ సాహెబ్‌ను వెతకండి. ఆయన నన్ను కాపాడతాడు.”

వాళ్లు నిజంగానే నన్ను వెతుక్కుంటూ వచ్చారు.


నేను అప్పటికి ఈస్టర్న్ కమాండ్ ఆర్మీ కమాండర్‌ను.

ఏం చేస్తాను?

నా ప్రాణం కాపాడిన మనిషి కదా.

కొన్ని పరిచయాలు ఉపయోగించాను. కొందరికి ఫోన్లు చేశాను. అతడు విడుదలయ్యాడు.

నన్ను కలవడానికి వచ్చిన షేర్ సింగ్ చివర్లో నవ్వుతూ ఒక మాట చెప్పాడు.

“సాహెబ్… ముందు మీరు నా ప్రాణం కాపాడారు. తర్వాత నేను మీ ప్రాణం కాపాడాను. ఇప్పుడు మళ్లీ మీరు నా ప్రాణం కాపాడారు.”

కొద్దిసేపు ఆగి మరింత ఉత్సాహంగా అన్నాడు.

“ఇక మీరు ఏదైనా కష్టంలో పడండి సాహెబ్. మీ వంతు అయిపోయింది. ఇక మిమ్మల్ని కాపాడేది నేను!”

ఆ మాటతో గది మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. ఇప్పుడు నాకు ఓ కష్టం కావాలి, అదొస్తే షేర్  సింగ్ తప్పక వస్తాడు అంటూ సామ్ కూడా నవ్వారు…


“వద్దురా బాబూ… ఈ వయసులో ఇక నీ సహాయం అవసరం రాకూడదు,” అన్నారు మానెక్ . అతడికి రైలు టికెట్ కొనిపెట్టి, సురక్షితంగా ఇంటికి చేరేలా ఒక సైనిక ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేశారు.

ఆ రాత్రి మా ఇంట్లో విన్నది కేవలం ఒక యుద్ధ కథ కాదు. అది ఒక అధికారి తన సైనికుడిని కాపాడిన కథ. ఒక సైనికుడు జీవితాంతం ఆ ఋణాన్ని మర్చిపోకుండా తిరిగి తీర్చిన కథ. మరి అన్నిటికంటే ముఖ్యంగా…

పదవులు, పతకాలు, యుద్ధ విజయాల కంటే మనిషి విలువ గొప్పదని సామ్ మానెక్‌షా తన జీవితంతో చెప్పిన కథ.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!
  • గ్రేట్ నికోబార్… దేశరక్షణ అవసరమే… కానీ ఏ మూల్యానికి..? (రెండో పార్ట్)…
  • గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు… రుతుపవనాల తీరునూ దెబ్బ తీయబోతోందా…
  • నో, నో… అన్నా మలై బుద్దిలేని బొద్దింక కాదు… తన రూటే సపరేట్…
  • ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions