.
బిస్లరీ బ్రాండ్ మార్కెట్లో చాలా పాపులర్ డ్రింకింగ్ వాటర్… దాని అనుకరించే ఫేక్ బ్రాండ్లే పదీ ఇరవై ఉంటాయి మార్కెట్లో… అలాంటిది ఏకంగా బిస్లరీ ఒరిజినల్ బ్రాండ్ నీరే సురక్షితం కాదనేది ఇప్పుడు చర్చ… నిన్నంతా రచ్చ… ఆ నీటిని నిషేధించారని… మీడియా గగ్గోలు… అసలు ఏం జరుగుతోందో చెప్పుకుందాం…
ఆ బ్రాండ్ కంపెనీ ఏమీ శుద్ధపూస కాదు, తన తాజా వివరణలోనూ అవసరమైన కొన్ని క్లారిటీలను కావాలని అవాయిడ్ చేసింది… సరే, నిషేధం విధించలేదు దీనిపై… అది నిజం… కానీ ఈ తాగునీరు అరక్షితమంటూ FSSAI ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది..! 14 నెలల క్రితం సేకరించిన ఓ శాంపిల్ ఇప్పుడు ఇంత పెద్ద వివాదంగా ఎందుకు మారింది? బిస్లరీ వాదనలో నిజమెంత? ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉందా?
Ads
మంచినీళ్ల బాటిల్ కొనాలంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చే పేరు బిస్లరీ… రైల్వే స్టేషన్ల నుంచి విమానాశ్రయాల వరకు, హోటళ్ల నుంచి కిరాణా దుకాణాల వరకు ఆ బ్రాండ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది… తాగునీటి విషయంలో నమ్మకానికి పర్యాయపదంగా మారిన ఈ బ్రాండ్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది… బిస్లరీ నీరు తాగడానికి సురక్షితం కాదని, అందులో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని వార్తలు రావడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది…
నిషేధం కాదు.. ప్రాసిక్యూషన్‌కు అనుమతి! భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) బిస్లరీ ఇంటర్నేషనల్పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది… సంస్థకు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అరక్షితమైనదిగా తేలిందని రెగ్యులేటర్ ప్రకటించింది…
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇది దేశవ్యాప్తంగా బిస్లరీ వాటర్ అమ్మకాలపై నిషేధం కాదు… మార్కెట్లో ఉన్న ప్రతి బాటిల్లోనూ కలుషితాలు ఉన్నాయని కూడా దీని అర్థం కాదు… ఒక శాంపిల్‌కు సంబంధించిన పరీక్షా ఫలితాల ఆధారంగా కంపెనీపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు… ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం అంటే న్యాయస్థానంలో నేరం నిరూపితమైనట్టు కూడా కాదు…

ఏమిటా ప్రమాదకర రసాయనాలు? ఈ వివాదంలో రెండు రకాల రసాయనాలు ప్రస్తావనకు వచ్చాయి… మొదటిది బ్రోమేట్ (Bromate)… నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో, ముఖ్యంగా ఓజోన్ను క్రిమిసంహారకంగా ఉపయోగించినప్పుడు, నీటిలో సహజంగా ఉండే బ్రోమైడ్తో రసాయన చర్య జరిగి బ్రోమేట్ ఏర్పడే అవకాశం ఉంటుంది…
తాగునీటిలో బ్రోమేట్ పరిమాణం పెరగడం ఆరోగ్యానికి ఆందోళనకరమే… దీర్ఘకాలం అధిక మోతాదులో శరీరంలోకి చేరితే మూత్రపిండాలు సహా కొన్ని అవయవాలపై ప్రభావం చూపవచ్చు… క్యాన్సర్‌కు సంబంధించి కూడా దీనిపై పరిశోధనలు ఉన్నాయి… అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాగునీటిలో బ్రోమేట్‌కు లీటరుకు 10 మైక్రోగ్రాముల పరిమితిని సూచించింది…
రెండోది పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs)… ఇవి ఒకే రసాయనం కాదు… అనేక రకాల రసాయన సమ్మేళనాల సమూహం… ఇంధనాలు, కలప వంటి పదార్థాలు పూర్తిగా మండకపోవడం, పారిశ్రామిక కాలుష్యం వంటి కారణాలతో ఇవి పర్యావరణంలోకి చేరతాయి… కొన్ని రకాల PAHs క్యాన్సర్ కారకాలుగా గుర్తింపు పొందాయి… అయితే ఈ సమూహంలోని ప్రతి రసాయనానికీ ఒకే స్థాయి ప్రమాదం ఉండదు… ఏ సమ్మేళనం ఎంత పరిమాణంలో ఉందన్నది కీలకం…
అంటే ఈ రెండు రసాయనాల పేర్లు వినగానే భయపడాల్సిన అవసరం లేకపోయినా, తాగునీటిలో అవి నిర్ణీత పరిమితులకు మించి ఉన్నాయా లేదా అన్నది మాత్రం చాలా కీలకమైన విషయం…
14 నెలల నాటి శాంపిల్.. ఇప్పుడు వివాదం! బిస్లరీ విడుదల చేసిన వివరణ ప్రకారం ఈ వ్యవహారం 2025 సెప్టెంబర్ నాటిది… గోవాలోని తమ తయారీ కేంద్రంలో సెప్టెంబర్ 30న FSSAI ఆరు శాంపిళ్లు సేకరించిందని, వాటిలో ఐదు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ చెబుతోంది… ఆరో శాంపిల్‌లో మాత్రం లీటరుకు 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ నమోదైందని, అనుమతించిన పరిమితి 10 మైక్రోగ్రాములేనని అంగీకరించింది…
దీనిపై 2025 నవంబర్ 22న అప్పీల్ చేయడంతో ఆ శాంపిల్‌ను రిఫరల్ ల్యాబ్‌కు పంపించారు… అక్కడ బ్రోమేట్ పరిమాణం నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్టు తేలిందని, అయితే అదే పరీక్షలో PAHs ఉన్నట్టు గుర్తించారని బిస్లరీ వివరిస్తోంది…
- ఈ రెండు ఫలితాల మధ్య తేడాలపై స్పష్టత అవసరమని భావించి, అదే శాంపిల్‌ను FSSAI ఆమోదించిన మరో స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షించామని, అక్కడ కూడా బ్రోమేట్ పరిమితిలోనే ఉన్నట్టు తేలిందని కంపెనీ చెబుతోంది… ఆ తర్వాత FSSAI నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, తమకు ఎలాంటి నోటీసు అందలేదని, వెబ్సైట్లో కూడా సంబంధిత నోటీసును గుర్తించలేకపోయామని పేర్కొంది…
అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న మిగిలే ఉంది… బ్రోమేట్ విషయంలో కంపెనీ చూపిస్తున్న స్వతంత్ర పరీక్ష ఫలితం ఒకటైతే, రిఫరల్ ల్యాబ్ గుర్తించిన PAHs సంగతేంటి? వాటి పరిమాణం ఎంత? ఏయే రసాయన సమ్మేళనాలు గుర్తించారు? అవి నిర్దేశిత ప్రమాణాలను ఎంతమేర ఉల్లంఘించాయి? ఈ వివరాలను బిస్లరీ కూడా స్పష్టంగా వెల్లడించలేదు…
అసలు ప్రమాదం ఎంత? వినియోగదారులు ఏం చేయాలి? ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి… బ్రోమేట్, PAHs రెండూ ఆరోగ్యపరంగా ఆందోళన కలిగించే రసాయనాలే అయినప్పటికీ, వాటి పరిమాణం, తీసుకున్న మోతాదు, ఎంతకాలం శరీరంలోకి చేరుతున్నాయన్న అంశాలను బట్టి ప్రభావం ఉంటుంది… ఒక శాంపిల్‌లో వీటి ఉనికి గుర్తించినంత మాత్రాన బిస్లరీ నీరు తాగిన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని అర్థం కాదు…
అలాగే నీళ్లు చూడటానికి స్వచ్ఛంగా ఉన్నాయా, రుచి బాగుందా, వాసన వస్తోందా అన్నదానితో ఈ రసాయనాల ఉనికిని గుర్తించలేం… అందుకే ప్రయోగశాల పరీక్షలే కీలకం…
- మరోవైపు, బిస్లరీ ఒక్కటే కాదు… దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ మొత్తం నాణ్యతా ప్రమాణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది… 2023-24లో ప్యాకేజ్డ్ వాటర్‌పై నిర్వహించిన 1,300 అమలు పరీక్షల్లో 333 నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది… అంటే ఇది ఒక బ్రాండ్‌కు మాత్రమే సంబంధించిన సమస్యగా చూడలేం…
ఇప్పుడు FSSAI ఏం చెప్పాలి? ఈ వివాదంలో FSSAI నుంచి మరింత సమగ్రమైన వివరణ రావాలి… ఏ బ్యాచ్‌కు చెందిన నీటి నమూనా ఇది? గోవా ప్లాంట్‌లో తయారైన ఏ ఉత్పత్తికి సంబంధించినది? బ్రోమేట్ పరిమాణం ఎంత? PAHsలో ఏ సమ్మేళనాలు గుర్తించారు? వాటి పరిమాణాలు ఎంత? కంపెనీ సమర్పించిన స్వతంత్ర పరీక్ష నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? మార్కెట్లోని ఇతర బ్యాచ్‌లపైనా పరీక్షలు నిర్వహించారా?
అదే సమయంలో బిస్లరీ కూడా తన నాణ్యతా పరీక్షల నివేదికలను, ముఖ్యంగా వివాదాస్పద శాంపిల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి… పది దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పడం మంచిదే… కానీ ఆ పరీక్షలున్నప్పటికీ ఒక శాంపిల్‌లో రసాయనాలపై వివాదం ఎందుకు తలెత్తిందో వివరించాల్సిన బాధ్యత కంపెనీపై కూడా ఉంది…
బిస్లరీ సురక్షితమేనా? ప్రమాదకరమా? అన్న ప్రశ్నకు ఇప్పుడే తుది సమాధానం చెప్పలేం… కానీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత నుంచి కంపెనీ తప్పించుకోలేదు… ఆ నాణ్యతను నిర్ధారించి, ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత నుంచి FSSAI కూడా తప్పించుకోలేదు…
Share this Article