.
నో డౌట్… గుణశేఖర్ మంచి ప్రతిభ కలిగిన దర్శకుడే… భారీ సెట్లకు ప్రసిద్ధి… కానీ కొన్నాళ్లుగా తను ఫెయిల్యూర్ జాబితాలో ఉండిపోయాడు… తన పంథా మార్చాడు… వర్తమాన యువత పోకడలపై ఓ మంచి కథను, ఓ రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా రాసుకున్నాడు…
దానికితోడు చాన్నాళ్ల తరువాత భూమిక తెర మీద… పైగా సారా అర్జున్ సరేసరి… పెద్ద స్టార్ల జోలికి పోకుండా, ఎలివేషన్ల జాడ్యంలోకి ప్రవేశించకుండా… పూర్తిగా కథ చెప్పడం మీదే కాన్సంట్రేట్ చేశాడు, అందుకే ఈ సినిమా అంటే కొంత ఆసక్తి ఏర్పడిన మాట నిజం…
Ads
కానీ వర్తమాన రియాలిటీ కథల్లోకి ట్రాన్స్‌ఫామ్ కావడంలో గుణశేఖర్ పూర్తిగా సక్సెస్ కాలేదనిపించింది… సినిమా ఇతివృత్తం బాగాలేదని కాదు… బాగుంది, తీసుకున్న టాపిక్ గుడ్… కానీ స్పాట్ వార్త వేరు- కాల్పనిక కథ వేరు… ఫీచర్ ఫిలిమ్ వేరు- డాక్యుమెంటరీ వేరు… ఒక రియల్ స్టోరీకి కాస్త క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని, కథను బలంగా ప్రజెంట్ చేయడంలో గుణశేఖర్ తడబడినట్టు… పాత గుణశేఖర్‌ను తను ఎక్కడో కోల్పోయినట్టు అనిపించింది…

ఐతే వర్తమానంలో యువత ఎటువైపు..? డ్రగ్స్, అత్యాచారాలు, పెడపోకడల ఫలితాల్ని, తల్లిదండ్రుల క్షోభను చర్చించే కథ ఎంపిక బాగుంది… ఫస్టాఫ్ మొత్తం పాత్రధారుల నిజతత్వాల ప్రదర్శన వరకూ వోకే… సెకండాఫ్ దర్యాప్తు మొదలయ్యాక డాక్యుమెంటరీ స్టార్టయింది… పోక్సో కేసును హైలైట్ చేయడం దాకా బాగుంది, క్లైమాక్స్ దాకా వోెకే…
కానీ ఓ తల్లిగా భూమిక పాత్ర తీసుకున్న నిర్ణయాల్ని గుణశేఖర్ సరిగ్గా, అంటే కన్విన్సింగుగా, సహజంగా చెప్పలేకపోయాడేమో అనిపించింది… కథేమిటంటే..? చైత్ర (సారా అర్జున్) ఒక మెరిట్ స్టూడెంట్… ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో చదువుతుంటుంది… ఒక సరదా పబ్ పార్టీ ఆమె జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది…

అక్కడ పరిచయమైన వికాస్ (విఘ్నేశ్ గవిరెడ్డి) తన మిత్రులతో కలిసి డ్రగ్స్ మత్తులో చైత్రపై సామూహిక అత్యాచారానికి పాల్పడతాడు… ఈ ఘాతుకం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది… ఈ కేసును సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఎలా డీల్ చేశాడు..? పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల పిల్లలను చట్టం ముందు ఎలా నిలబెట్టాడు..?
తన కొడుకు చేసిన నేరానికి తల్లిగా వింధ్య వేములపల్లి (భూమిక) తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఏంటి..? చివరికి ‘ఆపరేషన్ యుఫోరియా’ ద్వారా ఈ ముఠాకు పడ్డ శిక్ష ఏంటి..? అనేదే మిగిలిన కథ… జూబ్లీహిల్స్ పబ్ ఘటన వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రాసుకోవడం వల్ల ప్రేక్షకులకు ఇది చాలా దగ్గరగా అనిపిస్తుంది…

ఫస్టాఫ్ అసలు కథేమిటో అర్థమైపోయింది… మరి సెకండాఫ్..? జైలు, కోర్టు… భూమిక అనుభవించే క్షోభ… నిజంగా తన కొడుకును ఆమె సంస్కరించగలదా..? ఇక్కడే గుణశేఖర్ తడబాటు… ఐతే కొంత మేలు ఏమిటంటే..?
భూమిక బాగా నటించింది… ఆమె ఆ పాత్రను ఎలివేట్ చేసింది… సినిమాకు బలం ఆమే… బాధితురాలిగా సారా అర్జున్ కూడా..! గౌతమ్ మేనన్ సరేసరి… కాలభైరవ బీజీఎం కూడా వోకే… గుణశేఖర్ మారాలనుకున్నాడు… ప్రయత్నించాడు… పూర్తిగా మారలేకపోయాడు… ఐనా సామాజిక ఇతివృత్తాల వైపు తన మార్పు ఆహ్వానించదగిందే..!!
Share this Article