.
ఒకప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇళ్లలో “ద్రౌపది”గా అడుగుపెట్టిన మహిళ… ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయి పోరాటస్ఫూర్తితో నిలబడుతోంది. తెరపై మహాభారతంలోని అవమానాన్ని, ఆవేదనను జీవించిన ఆమె… నిజ జీవితంలోనూ తక్కువ కష్టాలేమీ చూడలేదు. కానీ ప్రతి దెబ్బ తర్వాత తిరిగి లేచింది. అందుకే ఇప్పుడు రూపా గంగూలీ కథను చాలామంది “ధైర్యంగా నిలబడిన ద్రౌపది”గా చూస్తున్నారు.
Roopa Ganguly పేరు వినగానే ఇప్పటికీ చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మహాభారతంలోని ద్రౌపది పాత్రే. 1980ల చివరలో ప్రసారమైన Mahabharat సీరియల్ ఆమెను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. హిందీ మాత్రమే కాదు, బెంగాలీ సినిమాల్లోనూ ఆమె మంచి నటిగా పేరు సంపాదించింది. కానీ తెరపై కనిపించిన ఆత్మవిశ్వాసం వెనుక నిజ జీవితంలో మాత్రం తీవ్రమైన ఒత్తిడి, ఒంటరితనం, మానసిక వేదన దాగి ఉండేది.
1992లో మెకానికల్ ఇంజనీర్ ధ్రుబో ముఖర్జీని వివాహం చేసుకున్న రూపా గంగూలీ, పెళ్లి తర్వాత నటనకు దూరమై కోల్‌కతాకు వెళ్లింది. వారికి కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఆ తర్వాత వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగాయి. ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆమె స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదని, ఆ పరిస్థితుల్లో మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. నిద్రమాత్రలు మింగానని, ప్రతి సారి దేవుడే తనను కాపాడాడని ఆమె భావోద్వేగంగా చెప్పింది.
Ads
సుమారు 14 ఏళ్ల వివాహబంధం తర్వాత భర్తతో విడిపోయిన రూపా గంగూలీ, తర్వాత అధికారికంగా విడాకులు తీసుకుంది. ఆ సమయంలో తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన గాయకుడు దిబ్యేందుతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న విషయాన్ని కూడా ఆమె దాచిపెట్టలేదు. జీవితంలో తీసుకున్న నిర్ణయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడలేదు. విమర్శలు వచ్చినా, తన అనుభవాలను దాచకుండా చెప్పడం రూపా గంగూలీ వ్యక్తిత్వంలోని మరో కోణం.
కానీ ఆమె కథ అక్కడితో ఆగిపోలేదు. నటిగా కీర్తి సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, Bharatiya Janata Partyలో కీలక మహిళా నేతగా ఎదిగింది. ముఖ్యంగా West Bengalలో Mamata Banerjee ఆధిపత్య, రౌడీ రాజకీయాల మధ్య BJP తరఫున గట్టిగా నిలబడిన నేతల్లో ఆమె కూడా ఉంది. పార్టీ బలహీనంగా ఉన్న రోజుల్లో కూడా వెనక్కి తగ్గలేదు. వీధి పోరాటాల్లో పాల్గొంది. రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేసింది.
ఇప్పుడు అదే పోరాటస్ఫూర్తి ఆమెకు రాజకీయ ఫలితాన్ని కూడా ఇచ్చింది. 2026 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో Sonarpur Dakshin నియోజకవర్గం నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసిన రూపా గంగూలీ ఘన విజయం సాధించింది. ఈ గెలుపును చాలామంది కేవలం ఓ సినీ నటికి వచ్చిన ప్రజాదరణగా కాకుండా, ఎన్నో సంవత్సరాల పట్టుదలకి వచ్చిన గుర్తింపుగా చూస్తున్నారు.
సువేందు అధికారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తారని ఊహించారు చాలామంది… బహుశా మంచి గుర్తింపే లభించొచ్చు… మమత రౌడీ రాజ్యంలో చాలామంది తోపులే రాష్ట్రం వదిలేసి పారిపోయినా ఈ ద్రౌపది మాత్రం వెన్నుచూపలేదు…
తెరపై ద్రౌపది అవమానాన్ని తట్టుకుని నిలబడింది. నిజ జీవితంలో రూపా గంగూలీ కూడా కష్టాలు, విమర్శలు, వ్యక్తిగత విరామాలు, రాజకీయ ఒత్తిడులన్నింటినీ ఎదుర్కొని మళ్లీ నిలబడింది. అందుకే ఇప్పుడు ఆమె ప్రయాణాన్ని చూస్తున్న చాలామందికి ఒక్క మాటే గుర్తొస్తోంది — “ధైర్యంగా నిలబడిన ద్రౌపది.”
Share this Article