.
Subramanyam Dogiparthi ….. భారతీయ ప్రాచీన సాహిత్యంలో చతుష్షష్టి (64) కళలు వాత్స్యాయనుడు వ్రాసిన కామసూత్రములో ప్రస్తావించబడ్డాయి . ఆ 64 కళల్లో చోర కళ కూడా ఒకటి . పురాణాలలో , చరిత్రలో రాజకుమారులు గురువుల వద్ద నేర్చుకున్న 64 కళల్లో చోర కళ కూడా ఉండేది . చరిత్రలో కొన్ని కులాల వారికి చౌర్యమే వృత్తి . అలాంటి కులాలు మన దేశంలో అన్ని ప్రాంతాలలో ఉండేవి . వాటిల్లో ఒకటి బాపట్ల- చీరాల మధ్య ఉన్న స్టువార్ట్ పురం గ్రామం .
ఈ గ్రామంలో ఎరుకుల కులం వారికి చౌర్యం , దారి దోపిడీలు వృత్తి . ఎక్కడ దొంగతనం జరిగినా ఆ గ్రామంలో వెతకటం ఒకప్పుడు సాధారణంగా ఉండేది . ఆ గ్రామస్తులు దొంగతనం చేయకపోయినా వాళ్ళ మీద నేరం మోపి జైలు శిక్షలకు గురిచేసే వారు పెద్దలు అని చెప్పబడే బడా నేరస్తులు , పోలీసులు . ఆ దౌర్భాగ్యం నుండి వారిని కాపాడటానికి ఎందరో సంఘ సంస్కర్తలు , సామాజికవేత్తలు అవిరళ కృషి చేసారు . వారిలో ముందుగా చెప్పుకోవలసింది గుర్రం జాషువా గారి కుమార్తె , గోరా గారి కోడలు , లవణం గారి భార్య హేమలతా లవణం గారు . సంస్కార్ అనే సంస్థ ద్వారా ఆ గ్రామస్తులను జన జీవన స్రవంతి లోకి చాలా వరకు తెచ్చారు .
Ads
ఈ అంశాలతో యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన స్టువార్ట్ పురం పోలీస్ స్టేషన్ నవలను నవ సాహితి బుక్ హౌస్ వారు పబ్లిష్ చేసారు . బాగా పాపులరయింది . క్రియేటివ్ కమర్షియల్స్ బేనరుపై కె యస్ రామారావు గారు చిరంజీవి హీరోగా ఈ సినిమాను నిర్మించారు . యండమూరి వీరేంద్రనాథుని రికమెండ్ చేసి ఈ సినిమా వైఫల్యానికి ఒక విధంగా నేనే కారణం ఏమో అని ఓ వేదిక మీద ఈమధ్య కాలంలో చిరంజీవే అన్నారు .
సినిమా ఫెయిల్ అయినా స్టువార్ట్ పురం వాసుల కష్టాల గురించి చాలామందికి తెలిసింది . 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు కూడా ఈ గ్రామవాసుల గురించే . హేమలతా లవణం వంటి సంఘ సంస్కర్తల పుణ్యం , స్వతంత్ర భారతంలో షెడ్యూల్డ్ ట్రైబుల పురోగతికి ఏర్పరిచిన సంక్షేమ , సంస్కార పథకాల వలన కానివ్వండి ఈ చోర వృత్తి నుండి చాలా మంది బయటపడ్డారు .
సినిమాకొస్తే : దొంగ కొడుకు పోలీసు దొర కావాలనే తండ్రి ఆకాంక్షను సఫలం చేస్తాడు హీరో చిరంజీవి (పాత్ర పేరు రాణా ప్రతాప్) . తన గ్రామస్తుల చేత చేయని నేరాలను ఒప్పించి దొపిడీలను చేసే మాఫియా నాయకుడు శరత్ కుమార్ , అతనికి కొమ్ము కాసే హోం మినిస్టర్ దేవదాస్ కనకాల , MLA కోట శ్రీనివాసరావు , MP గొల్లపూడి మారుతీరావు , ఓ ఆకు రౌడీ మోహన్ రాజ్ .
ఉరి తీయబడే ముందు తండ్రి కోరిక ప్రకారం తన గ్రామానికే సర్కిల్ ఇనస్పెక్టరుగా వచ్చి మాఫియా నేరాలను బయటపెట్టి , మాఫియా నాయకుడు శరత్ కుమార్ని తుద ముట్టించటంతో సినిమా శుభాంతం అవుతుంది . అన్ని సినిమాల్లోలాగానే దుష్టశిక్షణను , స్టువార్ట్ పురం గ్రామస్తుల సాంప్రదాయక వెతలను కలిపి నేసిన కధ .
ఈ కధకు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లేని తయారు చేస్తే యం వి యస్ హరనాధరావు డైలాగులను వ్రాసారు . అక్కడక్కడా పదునైన డైలాగులు ఉంటాయి .
బ్రోకర్ కొడుకు హోం మినిస్టర్ కానిది దొంగ కొడుకు పోలీస్ ఇనస్పెక్టర్ కాకూడదా ; దొంగలు లేకపోతే పోలీసోళ్ళకు పైసలెట్టా వస్తాయి వంటి డైలాగులు . ఈ దొంగతనాలు , దోపిడీలు ఎంత వ్యవస్థీకృతం చేసారంటే పోలీసోళ్ళ కుమ్మక్కు అందరికీ తెలిసిందే . పర్సెంటేజి బేసిస్ మీద ఆ కేసుల్ని వాదించే లాయర్లు నాకు తెలుసు .
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు . విజయశాంతి (పాత్ర పేరు అలకనంద . యండమూరి హీరోయిన్లకు భలే పేర్లు పెడతారు) , నిరోషా . 2+1 అన్న మాట . సంతోషం ఏంటంటే ఎవర్నీ లేపేయలేదు . ఆఖర్లో ఇద్దరూ సర్దుకుంటారు .
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . 2+1 పాట ఇద్దరతివల దెబ్బకు మద్దెల వలె మధ్య నిలబడి చివరకు మర్డరయితి సరదాగా ఉంటుంది . జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ , ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా , భలేగా ఉందిరా ఇదేమి ముద్దురా , చీకటింటి చిన్నదాని సిగ్గు సుందరం అంటూ సాగుతాయి పాటలు . బాగానే ఉంటాయి . సుందరం , ప్రభుదేవా డాన్సుల్ని కంపోజ్ చేసారు .
ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , అన్నపూర్ణమ్మ , పి యల్ నారాయణ , నారాయణరావు , జ్యోతి , సుధాకర్ , బ్రహ్మానందం , బాబూమోహన్ , తదితరులు నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే చిరంజీవి అభిమానులు చూడవచ్చు .
Share this Article