.
బహుశా దాదాపు 17 వేల ఎన్‌కౌంటర్లు దాటిపోయాయి యూపీలో… మాఫియా, గూండా రాజ్ వెన్ను విరిచాడు యోగీ… కానీ చాలామంది నేరగాళ్లు పోలీసులకు అర్జెంటుగా లొంగిపోయారు… ఆ విషపర్పాల కోరలు అలాగే ఉన్నాయి… తాత్కాలికంగా సద్దుమణిగాయి, అంతే… మరి లీగల్ ప్రొసీజర్ కూడా ఇలాగే దూకుడుగా, వేగంగా సాగుతూ నేరగాళ్లకు శిక్షలు పడుతున్నాయా..?
ఈ ప్రశ్నకు సమాధానం మొన్నటివరకూ లేదు అని..! కానీ ఒక్కడొచ్చాడు… ఆ జడ్జి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది… ఆయన ముజఫర్‌నగర్ జడ్జి రవికుమార్ దివాకర్…
Ads
ఒక జడ్జి తీర్పు ఇస్తారు. మరో జడ్జి తీర్పు ఇస్తారు. కానీ ఒకే కోర్టులో, ఒకే జడ్జి… కేవలం కొన్ని నెలల్లో 23 మందికి మరణశిక్ష విధిస్తే? అది సాధారణ వార్త కాదు. న్యాయవ్యవస్థలోనే చర్చకు దారితీసే విషయం.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు-3 అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ ఇప్పుడు అలాంటి చర్చకు కేంద్రంగా మారారు. 2026లో దాదాపు ఐదు నెలల వ్యవధిలో 11 కేసుల్లో 23 మందికి మరణశిక్ష విధించారు. తాజా కేసులో భార్యను కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన నదీమ్‌కు ఉరిశిక్ష విధించడంతో ఆ సంఖ్య 23కు చేరింది. అయితే ఈ మరణశిక్షలు ఇంకా తుది శిక్షలు కావు. చట్ట ప్రకారం హైకోర్టు వాటిని పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
మన న్యాయవ్యవస్థ సంగతి తెలుసు కదా… కోర్టు, పైకోర్టు, ఆపైకోర్టు… ఆ నేరగాళ్లు అలా బతికేస్తూనే ఉంటారు… ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక జడ్జి… 23 ఉరిశిక్షలు! మరణశిక్ష అనేది సాధారణ శిక్ష కాదు. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేంతటి తీవ్రమైన నిర్ణయం. అందుకే సుప్రీంకోర్టు అభివృద్ధి చేసిన “rarest of rare” సూత్రం కింద అత్యంత తీవ్రమైన కేసుల్లోనే మరణశిక్ష విధించాలి.
అలాంటి శిక్షను ఒక జడ్జి వరుసగా 23 కేసుల్లో విధించడం సహజంగానే ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇది న్యాయవ్యవస్థకు కావాల్సిన దృఢత్వమా? లేక శిక్ష విధించడంలో అసాధారణమైన దూకుడా? ఈ రెండు ప్రశ్నలు ఒకేసారి అడగాల్సిందే.
ఎందుకంటే జడ్జి ధైర్యంగా ఉండాలి. కానీ అదే సమయంలో ప్రతి మరణశిక్ష వెనుక ఉన్న సాక్ష్యాలను, పరిస్థితులను, నిందితుడి హక్కులను కూడా అంతే కఠినంగా పరిశీలించాలి. అదే న్యాయం. అయితే దివాకర్ ఎందుకు వార్తల్లోకి వచ్చారు? మరణశిక్షల సంఖ్య మాత్రమే కాదు. ఆయన కోర్టు నుంచి 97 తీవ్రమైన క్రిమినల్ కేసుల ఫైళ్లను వెనక్కి తీసుకోవడం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఆగస్టు 18న ముజఫర్‌నగర్ జిల్లా, సెషన్స్ జడ్జి పరిపాలనా ఉత్తర్వులతో ఈ కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు. అందులో హత్య, మరణశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉన్న కేసులు ఉన్నాయి. ఇది జరిగిన వెంటనే “23 మరణశిక్షలు ఇచ్చినందుకే కేసులు లాక్కున్నారా?” అనే ప్రశ్న మొదలైంది.
జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఇలాంటి కేసుల్లో మరణశిక్ష పడుతుందేమోనన్న న్యాయవాదులు, పిటిషనర్ల ఆందోళనల నేపథ్యంలో కేసుల బదిలీ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది మాత్రం మరణశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉన్న కేసులను జిల్లా జడ్జి కోర్టుకు మార్చినట్లు తెలిపారు.
అంటే… కేసులు బదిలీ అయ్యాయి—ఇది నిజం. మాఫియాను కాపాడటానికే బదిలీ చేశారన్నది— జడ్జి చేసిన ఆరోపణ. అక్కడే దివాకర్ మరోసారి సంచలనం సృష్టించారు. తాజా నదీమ్ కేసులో తీర్పు రాస్తూ దివాకర్ ఈ వ్యవహారంపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.
తన కోర్టు నుంచి కేసులు తొలగించిన తర్వాత పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ మధ్యవర్తి ద్వారా తనకు హెచ్చరిక పంపినట్లు ఆయన తీర్పులో పేర్కొన్నారు.
“ఇప్పటివరకు ఫైళ్లు మాత్రమే తీసుకున్నారు. మా వెంట పడితే… మీ కోర్టును మార్చిస్తాం, మిమ్మల్ని జిల్లా నుంచి బదిలీ చేయిస్తాం” అనే తరహా హెచ్చరిక వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ యూపీలో కొంతమంది గ్యాంగ్‌స్టర్లకు కుల, రాజకీయ అండ ఉందని కూడా ఆయన ఆరోపించారు.
“పిరికి న్యాయమూర్తి అని పిలిపించుకోవడం కంటే నేను చావడానికే ఇష్టపడతాను.” ఇది సినిమా డైలాగ్ కాదు. ఒక జడ్జి తన తీర్పులో రాసిన మాట. “భయపడితే రాజీనామా చేస్తాను…” దివాకర్ తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తనకు దేవుడికి తప్ప మరెవరికి భయపడకూడదని నేర్పారని చెప్పారు.
మాఫియా, బాహుబలులు, నేరస్థుల ఒత్తిడికి భయపడి తీర్పులు ఇవ్వాల్సి వస్తే న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి వస్తే న్యాయవ్యవస్థలో కొనసాగడం కంటే రాజీనామా చేయడమే మంచిదని అన్నారు.
ఈ జడ్జికి ఇదే మొదటి వివాదాస్పద కేసు కాదు… 2022లో వారణాసిలో సివిల్ జడ్జిగా ఉన్న సమయంలో జ్ఞానవాపి ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వేకు అనుమతించిన జడ్జి కూడా రవికుమార్ దివాకరే. ఆ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. తన భద్రతను తగ్గించారని కూడా ఆయన ఆరోపించారు.
అంటే ఈరోజు ముజఫర్‌నగర్‌లో ఆయన రాసిన “భయపడను” అనే మాట వెనుక ఒక నేపథ్యం ఉంది. అది అంగీకరించాలా? విమర్శించాలా? అది పక్కన పెడితే… ఒత్తిడికి భయపడకుండా తీర్పు రాయాలనే ధైర్యం మాత్రం ఒక న్యాయమూర్తికి ఉండాల్సిందే.
తాజా కేసులో అసలు సంచలనం ఏమిటి? 23వ మరణశిక్ష నదీమ్‌కు పడింది. 2018లో తన 23 ఏళ్ల భార్య షెహజాదీని కిరోసిన్ పోసి తగలబెట్టిన కేసులో అతడిని దోషిగా తేల్చారు. కోర్టు ఈ హత్య విధానాన్ని అత్యంత క్రూరమైనదిగా పేర్కొని “rarest of rare” కేటగిరీలోకి తీసుకుంది. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం ఉంది.
ప్రాసిక్యూషన్‌కు చెందిన 11 మంది సాక్షులు hostile అయ్యారని NDTV నివేదించింది. అయినా బాధితురాలు మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని— dying declaration—కోర్టు కీలక సాక్ష్యంగా పరిగణించింది. ఇదే న్యాయమూర్తి పాత్ర.
ఇక్కడ ఓ పే-ద్ద ప్రశ్న... మాఫియా రాజ్ నడుం విరగ్గొట్టిన యోగీ ఈ జడ్జికి అండగా ఎందుకు నిలబడలేకపోయాడు..?!
Share this Article