సినిమా బాగుందని చాలామంది రివ్యూలు రాశారు… పోస్టులు పెట్టారు… కానీ పుష్ప ధాటికి తట్టుకోలేదు… నిజంగా పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది సినిమా… థియేటర్లలో ఎప్పుడో విడుదలైనా రీసెంటుగా నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు… వాస్తవంగా సినిమా థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను సాధించలేదు… క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావించే దేశం అదే క్రికెట్ వరల్డ్ కప్ మీద తీసిన 83 సినిమాను ఎందుకు పెద్దగా ఆదరించలేదు..? ఎక్కడుంది లోపం…?
బేసిక్‌గా 83 అనే టైటిల్ ఓ అబ్సర్డ్… రాసుకున్న కథలో గానీ, ఎంచుకున్న సీన్లలో గానీ ప్రేక్షకుడిని కట్టిపడేసేవి లేవు… దర్శకుడు కబీర్ ఖాన్ ఫెయిల్యూరే అది… దీపిక పడుకోణ్ కూడా డబ్బులు పెట్టిన ఈ సినిమాకు రిలయెన్స్, సాజిద్ నదియావాలా తదితరులు చాలామంది సపోర్ట్ చేశారు… దర్శకుడు కూడా కొన్ని డబ్బులు పెట్టాడు… మరి ఇంత సాధనసంపత్తి ఉన్నప్పుడు ఎంత మంచి కథను ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత బాగా తీయాలి..?
నిజానికి ఏ ఆట నేపథ్యాన్ని తీసుకున్నా సరే… బేసిక్‌గా పూలదండలో దారం వంటి ఒక ప్రధాన కథ ఉండాలి, అది ఆటగాడి బయోపిక్ కావచ్చు, లేదా ఇంకేదైనా సబ్జెక్టు కావచ్చు… 83 సినిమా మొత్తం కపిల్ దేవ్ కోణంలో నడుస్తుంది… తనను హీరోగా ప్రొజెక్ట్ చేస్తుంది… 83 వరల్డ్ కప్ గెలుపు సమయంలో కపిల్ కెప్టెన్, తనదీ ప్రధాన పాత్రే… కానీ గెలిచింది ఒక టీం… ఆ టీంను ప్రొజెక్ట్ చేయలేకపోయాడు దర్శకుడు… అదంతా కపిల్ పుణ్యమే అన్నట్టుగా తీశారు…
Ads
పోనీ, కపిల్ దేవ్ కోణంలోనే తీయాలనుకుంటే… తను క్రికెట్‌లోకి అడుగు పెట్టడం, ఇండియాలో ఫాస్ట్ బౌలరా అనే వెక్కరింపులు, చివరకు కోచింగ్ సెంటర్‌లో రోజుకు రెండు రొట్టెలే ఇవ్వడం, అవి సరిపోవని వాదించడం, టీంలోకి ఎంపిక, గవాస్కర్‌తో విభేదాలు… ఎన్ని లేవు..? ఇందులో ఏవీ లేవు… డ్రెస్సింగు రూంలో డిస్కషన్స్, సరదాలు వంటివీ సరిగ్గా తీయబడలేదు… కేవలం లీగ్ మ్యాచుల నుంచి ఫైనల్స్ దాకా మళ్లీ మ్యాచుల్ని చూడటం కోసం ప్రత్యేకంగా సినిమా దేనికి..? ఎన్ని వీడియోలు లేవు..? జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్ తప్ప మిగతా వీడియోలన్నీ అందుబాటులో ఉన్నవే కదా…
ఒక ఎమోషన్ లేదు ఎక్కడా… ఒక్క సీన్ కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు… ఒకటీఅరా… చిన్నచిన్నవి… తమ పట్ల నెగెటివ్ ధోరణితో వార్తలు రాయబడిన పత్రికల్ని నలిపేసి కపిల్ బూట్లను శుభ్రం చేసుకోవడం… మొహిందర్ అమరనాథ్ తండ్రి నా ఆయుష్షు పదేళ్లు పెంచారు అనడం… పిక్చర్ క్లారిటీ కోసం పదే పదే ఇల్లు ఎక్కి యాంటెన్నాను అటూఇటూ తిప్పుకోవడం… రోమీని స్టేడియంలోకి రానివ్వకపోవడం… ఇలాంటివి కొన్ని… ఎలాగూ జిమ్మీ తండ్రి పాత్రలో తనే కనిపించాడు కదా, పదేళ్ల ఆయుష్షు పెంచావు మై సన్ అనే డైలాగ్‌ను తనతోనే చెప్పిస్తే ఎంత బాగుండేది… చివరకు ఓ ఆటగాడి పెళ్లి రద్దయ్యే సందర్భాన్ని కూడా ఆ పాత్ర ద్వారా చెప్పించారు తప్ప సీన్ చిత్రీకరించ లేదు…
నిజానికి క్రికెటర్‌కు పిల్లనివ్వకపోవడం అనేది ఎప్పుడూ లేదు… క్రికెటర్ అంటే 1983 ముందు కూడా క్రేజ్ ఉన్నదే… సినిమా స్టార్లే ఎగబడేవాళ్లు కదా… పైగా మతకలహాలకు ఈ మ్యాచులను విరుగుడుగా చూపించాలనే ఇందిర వ్యూహం మరీ అతి… ఫైనల్ రోజున సహృదయంతో పాక్ జవాన్లు కాల్పులు ఆపేయడం మరో అతి… ఇలాంటి అబ్సర్డ్ సీన్లు కూడా ఆకట్టుకునేలా తీయలేకపోయాడు దర్శకుడు…
కపిల్ పాత్రలోకి రణబీర్ కపూర్ ఒదిగిపోవడానికి బాగా ప్రయత్నించాడు… కొంతమేరకు సక్సెసయ్యాడు… కానీ ఆమధ్య ధోనీ పాత్రలోకి సుశాంత్ పరకాయ ప్రవేశం చేసిన తీరుతో మాత్రం అస్సలు పోల్చుకోకూడదు… మిగతా క్రికెటర్ల పాత్రలకు ఎవరూ పెద్దగా సూట్ కాలేదు… శ్రీకాంత్ పాత్రలో జీవా మాత్రం కాస్త బాగున్నాడు… ఇక వివియన్ రిచర్డ్స్ పాత్రధారి అస్సలు సూట్ కాలేదు… అసలు రిచర్డ్స్ క్రీజులో నిలబడే తీరు, పెవిలియన్ నుంచి నడిచివచ్చే తీరు , ఆ గ్రేస్ దర్శకుడు సరిగ్గా పట్టుకోలేదు… నోట్లో బబుల్ గమ్ వేసుకుని కసకసా నమిలితే రిచర్డ్స్, కంటికి అద్దాలు పెడితే క్లయివ్ లాయిడ్ కనిపించరు కబీర్ ఖాన్… కాకపోతే ఒక్కటి మెచ్చుకోవచ్చు… యాక్టర్లు బౌలింగ్, బ్యాటింగ్ యాక్షన్లను బాగా ప్రాక్టీస్ చేశారు…
రోమీ పాత్రలో దీపిక ఉండీలేనట్లు, ఏ ప్రాధాన్యం లేదు ఆ పాత్రకు… సినిమా బాగా లేదా అంటే… బాగా లేదని కాదు… కానీ ఓ వరల్డ్ కప్ రేంజులో లేదు… కాదు, కాదు, ఓ లీగ్ మ్యాచ్ స్థాయిలో కూడా లేదు… ఆ వరల్డ్ కప్ తరువాత మనకు విజయాలు బాగా అలవాటయ్యాయి… కానీ దేశంలో క్రికెట్ అంటే పిచ్చి పెరిగింది మాత్రం ఈ వరల్డ్ కప్ తరువాతే… అలాంటప్పుడు ఆ కప్ నేపథ్యంలో సినిమా తీస్తే… అదెలా ఉండాలి..? 83 సినిమాలా మాత్రం కాదు…!!
చిన్నపిల్లాడిలా ఉన్న సచిన్ టెండూల్కర్ పాత్రను ఒకటీరెండుసార్లు చూపించడం అనవసరం, అసందర్భం, అప్రస్తుతం…! ఒరిజినల్ కపిల్ దేవ్‌ను ఓచోట ప్రేక్షకుల్లో కూర్చోబెట్టి చూపించడం కూడా వేస్టున్నర..!! కపిల్ శర్మ తన కామెడీ షో కోసం ఓసారి 83 వరల్డ్ కప్ హీరోలను పిలిచాడు, నిజానికి అది సినిమా ప్రమోషనే… కానీ ఆ షో చాలా లైవ్‌గా, సరదాగా సాగింది, ఎక్కడో ఉన్న గవాస్కర్ కూడా ఆన్‌లైన్‌లో ఈ భేటీకి కలిశాడు… 83 సినిమాకన్నా ఆ షో బాగుంది… పాపం శమించుగాక…!!
Share this Article