…. By….. Imran Baig Mughal….. నేను అప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఏమో, మా కడప జిల్లాకు SP గా వచ్చారు ఉమేష్ చంద్ర, 1995 లో… కడపలో కొన్ని రహదారులు ఉండేటివి, ఆడవారు, కాలేజ్ అమ్మాయిలు ఆ దారుల వెంట వెళ్ళడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిoచే వాళ్ళు. ఈవ్ టీజర్స్ కందరికి అది అడ్డా, ఈవ్ టీజింగ్ కంటే కూడా కాస్త ఎక్కువగా శృతిమించి ఉండేటివి వారి ఆగడాలు. దారి వెంట వెళుతున్న ఆడవారిని త్రాకటం, లాంటివి. ఇది ఆయన చెవిన పడింది. ముగ్గురు పోలీసులను మఫ్టీలో పెట్టి మూడు రోజులు అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. నాలుగో రోజు నలభై మంది పోలీసులను పెట్టి ముప్ఫై మందిని పట్టుకున్నారు.
అక్కడే రోడ్డు మీదనే ఆ కుర్రాళ్లనందరిని బట్టలు ఊడదీయించి, మెళ్ళల్లో రోడ్ రోమియోస్ అని బోర్డులు వేలాడ దీసి, కేవలం అండర్ వేర్లపై కడప ప్రధాన కూడళ్లలో తిప్పారు. ఆడవాళ్లు అందరూ మా అక్కా చెల్లళ్లు అంటూ వారితో స్లోగన్స్ ఇప్పించారు. దారి వెంబడి వారి ముడ్డీలపై లాఠీలు నృత్యం చేశాయి. ప్రతి కూడలిలో కోటింగ్ ఇచ్చారు. స్టేషన్లో ఉంచి ఆ రోజు రాత్రి, మరుసటి రోజు ఉదయం, మళ్ళీ మధ్యాహ్నం కోటింగ్ ఇచ్చి, సాయంత్రం వారి అమ్మా నాన్నను పిలిచి వారికి మాటలతో కోటింగ్ ఇచ్చి గానీ వదల్లేదు. నాకు తెలిసి ఆ నీచులు ఇంకోసారి ఈవ్ టీజింగ్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా వణికి ఉంటారు.
Ads
రౌడి షీటర్లందరికి ప్రతి వారం కౌన్సిలింగ్ ఉండేది స్టేషన్లో, అందరిని ఒకసారి అండర్ వేర్లపై, కడప టౌన్ మొత్తం తిప్పారు, ఇంకెప్పుడు రౌడీయిజం చేయము అని స్లొగన్స్ ఇచ్చుకుంటూ ఊరేగింపుగా తిప్పారు. వీధికి ఒక రౌడీ గ్యాంగ్ ఉండేది. వీళ్ళు ఏదో ఒక పార్టీ నాయకుడికి లేదా ఫ్యాక్షన్ లీడర్లకు అనుచరులుగా కొనసాగే వాళ్ళు. వీరి ఆగడాలు కూడా ఎక్కువే కడపలో. నాగరాజ్ పేట గ్యాంగ్, అంగిడి వీధి గ్యాంగ్, మసాపేట గ్యాంగ్, స్టేషన్ గ్యాంగ్, రాజారెడ్డి స్టీట్ గ్యాంగ్, చిన్నచౌక్ గ్యాంగ్, రవీంద్ర నగర్ గ్యాంగ్, ప్రధానంగా ఉండేటివి.
ఆ గ్యాంగ్ లీడర్లు ఇప్పుడు కొందరు కార్పొరేటర్లుగా ఉన్నారు. చాలా మంది అప్పట్లో ఉమేష్ చంద్ర గారి ధాటికి తట్టుకోలేక అండర్ గ్రౌండ్ కు వెళ్లి పోయారు… ఆ పోలీస్ కోటింగ్ మామూలుగా ఉండేది కాదు, విపరీతమైన చిత్రహింసలు పెట్టే వాళ్లు. ఆ కోటింగ్ తీసుకున్న వాళ్లు బయటికి వచ్చినప్పుడు దీనoగా ఉండేది వారి పరిస్థితి. అడుగు తీసి అడుగు వేయలేక పోయేవాళ్ళు.
చంద్రబాబు నాయుడు అప్పటి CM, ఈయనకు ఫ్రీ హాండ్ ఇచ్చారు, పూర్తి స్వేచ్ఛ, కడపలో రౌడీయిజం, ఫ్యాక్షనిజం రెండూ అంతం చెయ్యాలి అన్న ఆలోచనతోనే పంపించారు ఈయనను ఇక్కడికి. ఒకసారి మా రాయచోటి పోలీస్ స్టేషన్కు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఫ్యాక్షన్ లీడర్లను, వారి అనుచరులను తెచ్చి స్టేషన్ ఆవరణలో పడుకోబెట్టి ప్రజలు అందరూ చూస్తూ ఉండగానే విపరీతoగా కొట్టారు, లాఠీలు విరిగే వరకు… ఆ లాఠీ దెబ్బలకు అనుగుణoగా వారి పెడబొబ్బలు ఉండేటివి.
ఆయన దగ్గరుండి మరీ కొట్టించారు. స్టేషన్ బయట గుమికూడిన ప్రజలను మళ్ళీ సాయంత్రం రండి, వీరికి ఇంకో రౌండ్ కోటింగ్ ఉంటుంది, వచ్చి చూడoడి, వీళ్ళంటే భయం పోతుంది మీకు, వీళ్లకు సిగ్గు వస్తుంది అన్నారు. కొట్టిన తరువాత వీళ్లందరికి జండూ బామ్ స సీసాలు ఇచ్చి పూసుకోoడి, సాయంత్రం వరకు నొప్పి తగ్గాలి, మళ్ళీ శక్తి రావాలి, బాగా తినండి మధ్యానం, సాయంత్రం మళ్ళీ ఉంటుంది మీకు అన్నారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరుల ఆగడాలు చెప్పుకుంటే తరగనివి మా కడప జిల్లాలో. దౌర్జన్యంగా డబ్బులు గుంజటo, పంచాయతీలు, హత్యలు, ప్రజలను భయపెట్టటo, గ్రామాల్లో ఎంత మంది అమ్మాయిలను చెరిచారో లెక్క లేదు.
లంచాలకు వ్యతిరేకి, ఆయన వచ్చిన మొదటి వారoలో స్టేషన్ కు ఇంత అని తన స్వంత డబ్బులు పంచారు. లంచాలకు దూరoగా ఉండoడి, జీతం సరిపోకుంటే, ఇతర అవసరాలు ఉంటే నా దగ్గరకు వచ్చి అడగoడి అంటూ సందేశం పంపారు. ఏ SI అయినా, లేదా స్టేషన్ సిబ్బంది ప్రజలను డబ్బు కోసం పీడిస్తుంటే వారిని sp ఆఫీసుకు పిలిచి తన శైలిలో కోటింగ్ ఇచ్చే వాళ్ళు.
ఈయనకు ఇష్టమైన ఒక పోలీస్ టీం ఉండేది, యంగ్ పోలీస్ ఆఫీసర్స్, SI లు జగదీష్, నాగేశ్వర్ రెడ్డి, అయ్యప్ప రఘు, ముని రామయ్య, తిరుపాల్ రాజు… తిరుపాల్ రాజు కాస్త వయసు ఎక్కువ, మిగతా వాళ్ళు అందరూ యువకులు. గణపతి అని ఒక రౌడీ షీటర్ ఉండే వాడు, ఇతను ex పోలీస్ constable. సస్పెండ్ అయ్యాడు, తరువాత కిరాయి హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, సామాన్యులను బెదిరిoచడాలు చేసేవాడు. అతడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేసే కార్యాన్ని SI జగదీష్ కు అప్పజెప్పారు. మరి SI జగదీష్ ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించాడో తెలియదు, గణపతి ఎలాగో చనిపోతున్నాను అని తెలిసి జగదీష్ రివాల్వర్ తీసుకొని అతడినే కాల్చి చంపాడు. అలా SI జగదీష్ మరణించాడు, గణపతి ని పక్కన ఉన్న పోలీసులు కాల్చి చoపారు.
జగదీష్ కాల్పుల్లో చనిపోవటo ఉమేష్ గారికి మంచి ఎదురు దెబ్బ. తిరుపాల్ రాజు తరువాతి కాలంలో రిటైర్ అయ్యారు, నాగేశ్వర్ రెడ్డి గారు రాజమండ్రి dsp గా ఉన్నారు, ఈయనతో నాకు మంచి పరిచయం, చాలా నిజాయతీ పరుడు, ముని రామయ్య నిన్నటి వరకు తిరుపతిలో క్రైమ్ dsp గా ఉండి, పోయిన నెలలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడు. అయ్యప్ప రఘు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడో dsp గా ఉన్నారు. ఈయన దగ్గర పని జేసిన SI లు కెరీర్ పరంగా పెద్దగా సాధించుకున్నది ఏమీ లేదు. SI జగదీశ్ మెమోరియల్ బ్లాక్ ఒకటి ఉంది, SP ఆఫీస్ లో, అతని త్యాగానికి గుర్తుగా…
సంఘ విద్రోహులను ఎన్కౌంటర్లు జేశారు. సరిగ్గా పట్టీ లేదు నా దగ్గర. చాలానే చేశారు. సత్యం అనే ఒక విద్యార్థి నాయకుడిని, నక్సల్ సానుభూతిపరుడని అనవసరంగా చoపేశారు. పాపo ఆ అబ్బాయి అంతా వయసు ఇరవై దాటలేదు. రూంలో నిద్దుర పోతున్న వాడిని తీసుకొని వెళ్లి ఎన్కౌంటర్ జేపించేశారు…ఇదొక్కటి నచ్చలేదు ఆయన చేసిన పనుల్లో. నక్సలైట్లు అంటే ఇంత ఎత్తున లేచేవారు. మా జిల్లాలో చాలా దళాలను తుది ముట్టించారు.
రాజకీయ నాయకులు స్టేషన్ పైరవీలు చెయ్యాలి అంటే వణికే వాళ్లు. అధికార పక్షాన్ని కూడా లెక్క జేసే వాళ్లు కాదు. పోలీస్ లందరూ ధైర్యంగా, దాదాపు నిజాయతీగా తమ డ్యూటీ చేసే వాళ్ళు. ఈయన ఎప్పుడూ సామాన్యుల వైపే. సామాన్య ప్రజలకు పోలీసు ఎప్పుడూ అందుబాటులో ఉండేది.
ఈయనకు రాజశేఖర్ రెడ్డి గారికి, వారి తండ్రి రాజారెడ్డి గారికి ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. రాజారెడ్డి ఎప్పుడో ఉమేష్ చంద్రకు ఫోన్ జేసి బాబూ అని మాట్లాడితే, నేను పోలీస్ ని, IPS ఆఫీసర్ ని, సర్ అని పిలవండి అన్నారు అంటా… రాజశేఖర్ రెడ్డి గారు, ఎవరికైనా కాస్త తగ్గారు అంటే అది ఉమేశ్ చoద్ర గారికే. రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులoదరికి మూడు చెరువుల నీళ్లు త్రాపించారు అప్పట్లో, నేర చరిత్ర ఉన్న వాళ్లకే…. రాజశేఖర్ రెడ్డి గారు బొటా బొటీ మెజారిటీతో MP గా గెలిచిoది ఈయన SP గా ఉన్నప్పుడే… దాదాపు రిగ్గింగ్ జరగని ఎలెక్షన్స్ అని అప్పట్లో అందరూ అనుకున్నారు. చాలా strict గా ప్రజాస్వామ్య బద్దంగా జరిపారు ఎలెక్షన్స్ అప్పుడు.
కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను ఎవరినీ ఉపేక్షిoచే వారు కాదు. టీడీపీ వారి పైన కూడా కేసులు కట్టారు. అక్రమ ఆయుధాల ఏరివేత కార్యక్రమ్మాన్నీ చేబట్టి దాదాపు అన్ని అక్రమ తుపాకులను ఏరివేశారు. ఒకచోటా రాజకీయ నాయకుడి దగ్గర పిస్తోలు ఉంది అని పుకారు, అది పోలీసులకు తెలిసింది, నిజానికి అతడి దగ్గర పిస్తోలు లేదు, అయినా పోలీసుల వత్తిడి తట్టుకోలేక యాభై వేలకు ఒకటి కొని పోలీసులకు అప్పజెప్పాడు.
ఈయన గురించి చెప్పుకుంటే పోతే చాలా పెద్ద పోస్ట్ అవుతుంది. మా కడప నుంచి కరీంనగర్ కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు పోలీసులు అందరూ, ధర్నాలు, సమ్మెలు జేశారు. కరీంనగర్ లో కూడా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ పోలీసులు జరిపిన సమ్మె హింసాత్మక రూపం దాల్చింది. ఈయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక మా కడప పరిస్థితి మళ్లీ మామూలే. అదే రౌడీయిజం, ఫ్యాక్షనిజం.
ఒక పదిహేను సoవత్సరాల నుంచి పరవా లేదు. ఫ్యాక్షనిస్టులు పూర్తిగా తగ్గిపోయారు. రౌడీయిజం కూడా లేదు. రాజకీయ నాయకులు జరిపే చెదురు ముదురు భూ కబ్జాలు తప్ప. హైదరాబాద్లో నక్సల్స్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు అని తెలిసి చాలా బాధపడ్డా. ఆయన పేరు మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కళ్యాణ మండపాన్ని కట్టి నడుపుతోంది. ఇప్పటికి మా కడప పోలీస్ సిబ్బందికి, ప్రజలకు ఈయనంటే ఒకరకమైన అభిమానం. ఈయన్ని చాలా ప్రేమగా, గౌరవoగా స్మరించుకుంటారు…
Share this Article