Abdul Rajahussain……… (మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా) చలం గారి “ స్త్రీ వాదం “ లో ‘ స్త్రీ ‘ పాత్రలకు వ్యక్తిత్వం ఏదీ ? ‘మైదానం’ లో “ రాజేశ్వరి “ వ్యక్తిత్వం నేతిబీరకాయలోని “ నెయ్యేనా ? మైదానంలో..”రాజేశ్వరికి ” చలం గారు అన్యాయం చేశారా ? “స్త్రీ వాదిగా “ చెప్పుకునే చలం తన రచనల్లోని “ స్త్రీ “ పాత్రలకు అన్యాయం చేశారా ? వ్యక్తిత్వం లేని స్త్రీ పాత్రల ద్వారా ఏం చెప్పాలనుకున్నారు. ? అసలు చలం గారికి ఓ ‘ సిద్ధాంత ‘ మంటూ వుందా? అదేదో ఆయన మాటల్లోనే విందాం.!
Ads
“నా పుస్తకాలు జాగ్రత్తగా చదివిన వారికి అసలు సత్యమేమిటా అనీ, ఈ సమస్యలన్నిటినీ తీర్చగల Ultimate Truth వుందా, వున్నట్టు కనబడతోంది, అది ఏదా, అనే వెతుకులాట కనబడుతుంది. అందుకనే మీకు నా పుస్తకాలలో నా ‘ సిద్ధాన్తం ‘ దొరకలేదు. నేను ఎంత గొప్ప వారు చెప్పినా వారు చెప్పారు గనుక నమ్మనని, స్వతంత్రంగా బయలుదేరాను. ఆ యాత్రే నా పుస్తకాలలో కథలూ, నాటకాలు, వ్యాసాల రూపంగా వొచ్చింది.”… (చలం లేఖలు… నారాయణ మూర్తికి రాసిన ఉత్తరం నుంచి.. 10.6.1956)
నిజమే చలం సాహిత్యానికి సిద్ధాంతమంటూ లేదు. సిద్ధాంతం లేకపోయినా ఫరవాలేదుగానీ… అక్కడక్కడ ‘రాద్ధాంతం’ కనిపిస్తుంది. అదే చలం గారితో వచ్చిన ఇబ్బంది. చలం గారిని స్త్రీవాదిగా ఆవిష్కరించిన ‘ మైదానం’ నవలలోని కథానాయిక రాజేశ్వరి పాత్రను చూస్తే ఏమనాలో అర్థంకాని పరిస్థితి . స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపి, వారి ఔన్నత్యానికి ఆదర్శంగా నిలిచేలా పాత్రల్ని చిత్రీకరించాల్సింది పోయి, మోహగాలికి ఎటుపడితే అటు కొట్టుకు పోయేలా చిత్రీకరించి, చలం గారు ఏం చెప్పదలుచుకున్నారు. స్త్రీ లోకానికి ఎలా మార్గదర్శకంగా నిలవాలనుకున్నారో అర్థం కాదు.
ఆయన ప్రతిపాదించిన ‘ స్వేఛ్ఛా శృంగారం ‘ గాడితప్పిందా ? ఏమో? రాజేశ్వరి పాత్రను చూస్తే అలానే అనిపిస్తుంది. సమాజం, కట్టుబాట్లు, సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారు సరే…. కనీస విలువల్ని కూడా పాటించక, విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్లు సంచరించేలా….. రాజేశ్వరి పాత్రను చిత్రీకరించారు. కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే తాపత్రయపడే స్త్రీగా ఆ పాత్రను రాశారు. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ‘ ఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఇష్టపడినవారితో ఎంతమందితోనైనా… సరే ‘ … అన్నవిధంగా రాజేశ్వరిని ఓ “ మోహధూపిని “ గా భావించడం ఎంతవరకు సబబు?
కనీస విలువల మాట అటుంచి పురుషుడు అధికారానికి, అసూయకు తలవొంచేలా వెన్నెముక లేని రాజేశ్వరి పాత్రను సృష్టించారు. ఈ పాత్రకు ఏమాత్రం వ్యక్తిత్వం లేకపోవడం అటుంచి, ఎవరి కోసమైతే (అమీర్ )లేచిపోయిందో కనీసం వాడితోనైనా… నమ్మకంగా వుందా అంటే అదీ లేదు. తనకంటే తక్కువ వయసున్నోడితో , తనను “దీదీ ” (అక్కా ) అని ప్రేమతో నోరారా… పిలిచే పదహారేళ్ళ పిల్లాడి ‘ పొందు’ కోసం చివరకు అమీర్ ను కూడా వదులుకునేందుకు సిద్ధపడిందంటే,రాజేశ్వరి వ్యక్తిత్వాన్ని ఏమనాలి ? ఎలా చూడాలి. ? ఎలా పిలవాలి ? ఎలా సమర్థించాలి?
అమీర్ పై వ్యామోహంతో భర్తను, ఇల్లును సమాజాన్ని, కట్టుబాట్లను వదిలి వెళ్ళిన రాజేశ్వరి జీవితంలో యేం బావుకుంది? “లేచిపోయిన ముండ” అంటూ సమాజంచేత ముద్ర వేయించుకుంది. సమాజంతో నాకేంటి పని? అని తనకంటూ ఓ కుటుంబం లేకుండా చేసుకుంది. మైదానంలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. బ్రాహ్మణ యువతి అయినా…అమీర్ వేటాడి తెచ్చిన చేపలను ఆబగా తింటుంది. తినడానికి పళ్ళెం కూడా వుండదు. ఒకే మట్టి మూకిడిలో అమీర్, మీరాతో కలిసి తింటుంది. ఇలా అడుగడుగునా… రాజీపడుతుంది రాజేశ్వరి .!
చివరకు తను ఎంతగానో మోహించిన అమీర్ నే… దూరం చేసుకుంది. ఇంకా లోకజ్ఞానం కూడా తెలీని పదహారేళ్ళ చిన్నపిలగాడు ‘మీరా’తో శారీరక సంబంధం పెట్టుకుంది. చివరకు తన జీవితం ఏమిటో తనకే అర్థంకాని పరిస్థితి తెచ్చుకుంది. తుపాను హోరులో చిక్కుకొన్న ‘ నావ ‘ లా గిలగిలలాడింది. స్త్రీకి అపురూపమైన “ అమ్మతనాన్ని “ కూడా వదులుకుంది. శారీరక సుఖం కోసం మాతృత్వాన్ని కాలదన్నుకుంది. తల్లి కావాలన్న స్త్రీ సహజమైన కోరికను కూడా చంపుకుంది. అమీర్ పై వున్న వ్యామోహంతో అబార్షన్ చేయించుకుంది. పురుషాధిపత్యానికి తలొంచింది.రాజేశ్వరి కూడా‘ అబల ‘గా నే మిగిలిపోయింది.
చలం స్త్రీ వాదం తేలిపోయింది. నేతిబీరకాయగా మారింది. ఓ సాంప్రదాయిక గృహస్థురాలు తొలిచూపులోనే .. అమీర్ మోహంలో పడటానికి చలంగారు బలమైన కారణమేదీ చెప్పలేదు. కేవలం అమీర్ “ చూపులు “ మన్మథ బాణాలై రాజేశ్వరికి గుచ్చుకున్నాయట. అంతే.. వాడితో లేచి పోయింది. అసలు ఈ అమీర్ ఎవరు? వాడి నేపథ్యం ఏమిటి? ఇలాంటి వివరాలేమీ తెలుసుకోకుండానే వున్నపళంగా మొగుడ్ని సంసారాన్ని వదిలేసి లేచిపోయింది. కేవలం అమీర్ పై కలిగిన వ్యామోహం కారణంగానే వాడితో “ “లేచిపోవాలన్న” పెద్ద నిర్ణయం తీసుకోవడంలో రాజేశ్వరి ‘సెక్స్ ‘ బలహీనత ‘ కనిపిస్తుంది.
అమీర్ తో లేచిపోతే రేపు తన భవిష్యత్తు ఏమిటి? అన్న కనీస ఆలోచనకూడా లేకపోవడం రాజేశ్వరిలో తెలివిలేనితనాన్ని సూచిస్తోంది. పైగా అమీర్ కోసం తను చేసిన త్యాగాల్లో నూరో వంతు చేస్తారా ఈ భార్యలు అంటూ… “ అర్థంపర్థం లేకుండా సమర్థించుకుంటుంది. రాజేశ్వరి లేచిపోవడానికి మొగుడు చేతకానితనం అన్న భావాన్ని స్ఫురింపజేస్తారు చలం. అయితే అమీర్ గనక కనబడక పోయి వుంటే ఇప్పటికీ తన పెనిమిటితో “సుఖంగా” కాపురం చేస్తుండేదాన్ని “ అని రాజేశ్వరి చెప్పడం చూస్తే…..భర్తచేతకానితనం ఏదీ లేదనిపిస్తుంది. కేవలం అమీర్ పై ఆకర్షణతోనే అనాలోచితంగా ఇంటిగడప దాటడం రాజేశ్వరి లోని అమాయకత్వంతో పాటు పరపురుషుడితో సెక్స్ వ్యామోహం. అనుకోవాల్సి వస్తోంది.
ఇలా రాజేశ్వరి పాత్ర తీరు తెన్నుల్లో వైరుధ్యాలెన్నో కనిపిస్తాయి. ఆ పాత్ర చేతలకు, చేష్టలకు ‘ జస్టిఫికేషన్ ‘ కలిగించలేక పోయారు చలం. ‘మీరా ‘ విషయంలో చలం తత్తరపాటును గమనించవచ్చు. మీరాను చూస్తే రాజేశ్వరికి సరదాగా వుండేది. ఎందుకో అతన్ని పిలిచి పలకరించి కబుర్లు చెప్పాలనిపించేదట. అట్లాంటి “ తమ్ముడు “ వుంటే బావుండును, ‘కొడుకు’ వుంటే బావుండును అనుకునేదట రాజేశ్వరి. (మీరా కూడా రాజేశ్వరిని దీదీ అంటూ పిలిచేవాడు ) అమీర్ తన దగ్గర దాచే విషయాలను కనుక్కునేందుకు మీరాను దువ్వేది. ప్రేమతో లాలించేది. భుజాల మీద చేతులు వేసి మీరాను ఉడికించేది. చివరకు తన దేహాన్నే ఎరగా వేసి, అసలు విషయాన్ని రాబడుతుంది. అంటే తనకు కావలసినదానికోసం.. రాజేశ్వరి ఎంతకైనా తెగబడుతుంది, బరితెగిస్తుందని చలం గారు చెప్పకనే చెప్పారు.
చివరకు అమీర్ కోరుకున్న తోళ్ళసాయిబు కూతురిని ఒప్పించడానికి మీరా సాయం తీసుకుంటుంది. తనే మధ్యవర్తిగా వుండి ఇద్దరినీ శారీరకంగా కలుపుతుంది. ఇలా క్రమంగా తను మీరాకు దగ్గరవుతుంది. పాపం ! మీరా ఇంకా మీసాలు కూడా మొలవని పిల్లాడు. వయసు చేష్టలు తెలీనివాడు. రాజేశ్వరి అందగత్తె మాత్రమే కాదు. శృంగారజాణ. కేవలం చూపులతోనే ఎదుటివారిని వశపరుచుకోగల దిట్ట. పాపం మీరా మాత్రం ఏం చేయగలడు? రాజేశ్వరి మోహంలో పడకుండా ఎలా వుండగలడు?
రాజేశ్వరి చేష్టలకు తట్టుకోలేక “ దీదీ ఈ బాధను ఇంకా భరించలేక పోతున్నానంటూ “ మనసులో మాట చెప్పేస్తాడు. ఆపై రాజేశ్వరి కూడా మీరానువదిలి వుండలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి గర్భవతి అవుతుంది. కడుపు తీయించుకోమంటాడు అమీర్. రాజేశ్వరి నిరాకరిస్తుంది. ఈ సందర్భంలో అమీర్ పురుషాధిపత్యంతో రాజేశ్వరిని హెచ్చరిస్తాడు. మందలిస్తాడు. తన మాట వినకపోతే వదిలి వెళ్ళిపోతానని బెదిరిస్తాడు. అంతేకాదు కాలితో పొట్టమీద బలంగా తంతాడు.
రాజేశ్వరికి కోపం వస్తుంది. అయినా అంత కోపంలో కూడా …అమీర్ కాలుని ముద్దుపెట్టుకోవాలనిపిస్తుందట. రాజేశ్వరి కామంతో కళ్ళుమూసుకుపోయి పురుష దౌష్ట్యానికి తలొగ్గుతుంది. ఇక్కడే రాజేశ్వరిలోని ‘బానిస’ భావన.. Sex Perversion కనిపిస్తుంది. నిజానికి అమ్మతనంపై అమీర్ చేసిన భౌతిక దాడి ఇది…. అయినా కూడా రాజేశ్వరి React కాలేదంటే, చలం ఫెమినిజానికి Justification ఏమిటో అర్థం కాదు.
అబార్షన్ కు అమీర్ చెప్పిన కారణాలు మరీ వింతగా వున్నాయి. బిడ్డపుడితే రాజేశ్వరి శరీరంలోని ఆకర్షణ తగ్గిపోతుంది. బిడ్డ తమ ఆనందానికి, షికార్లకు అడ్డం అవుతాడు. బిడ్డకు పాలిచ్చుకుంటూ.. ఏడుపును సముదాయిస్తూ, ఆ ధ్యాసలోనే వుంటే ప్రేమ నశించిపోతుందట. అలాగే.. బిడ్డతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. డబ్బు సంపాదించాలి. వాడ్ని పెంచి పెద్దచేయాలి. ఇదంతా తన వల్ల కాదంటాడు అమీర్. (చలం గారికి కుటుంబ వ్యవస్థ పట్ల వున్న అపనమ్మకానికి దీన్ని ఓ ఉదాహరణగా భావించవచ్చు)
రాజేశ్వరి తన మాట వినకపోయేసరికి కోపంతో నిజంగానే వదిలి వెళ్ళిపోతాడు . కేవలం అమీర్ పై వ్యామోహంతో రాజేశ్వరి కడుపు తీయించుకుంటుంది. అంటే తనకు ఇష్టం లేకపోయినా.. అమీర్ కోసం తలొగ్గుతుంది. ఇలా …రాజేశ్వరికంటూ ఓ వ్యక్తిత్వం , స్థిరమైన అభిప్రాయాలు లేకపోవడం ఆ పాత్ర బలహీనతకు తార్కాణం. ‘దేహం’ పై పురుషులకు, స్త్రీలకు సమాన హక్కులుండాలన్న చలం గారు మైదానంలో రాజేశ్వరికి నోరు లేకుండా చేశారు.
అమీర్ కు తలొగ్గే అతి సాధారణ స్త్రీగా , మోహానికి దారులు వెతుక్కునే మోహధూపినిగా చిత్రీకరించి చలంగారు రాజేశ్వరి పాత్రకు అన్యాయం చేశారు. ఓ దిశ, దశ లేని, బాధ్యత లేని స్త్రీ గా చిత్రీకరించారు చలం…. తాను స్త్రీ వాదినంటూనే కేవలం శారీరక సుఖం కోసం అమీర్ కు దాసోహమనిపించాడు. చివరలో మీరా చుట్టూ పిచ్చిగా తిప్పించాడు.
రాజేశ్వరి అబార్షన్ వార్త తెలుసుకొని అమీర్ తిరిగొస్తాడు. ఈ సారి మీరాను పంపేయమంటాడు. నావల్ల కాదంటుంది రాజేశ్వరి. నిన్నైనా వదులుకుంటాను కానీ మీరాను వదులుకునే ప్రసక్తే లేదని చెబుతుంది. అమీర్ గాయపడతాడు. నాకంటే నీకు మీరానే ఎక్కువయ్యాడా ? అయితే ఇంక నేనెందుకు ? చచ్చిపోతాను అంటాడు . బాధపడతాడు . చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు .
ఏ అమీర్ పై మోహంతో లేచి వచ్చిందో, మీరా కోసం ఆ అమీర్ నే కాదనుకోవడం రాజేశ్వరి పాత్రలోని పెద్దలోపం. అప్పుడు అమీర్ పై మోహంతో భర్తను వదిలేసింది. ఇప్పుడు మీరాపై వ్యామోహంతో అమీర్ ను వదిలేయడానికి కూడా సిద్ధపడింది రాజేశ్వరి. అంటే రాజేశ్వరి వ్యక్తిత్వంలోని మితి మీరిన సెక్స్ వాంఛలకు ఇది పరాకాష్ట.
చివరకు అమీర్ ఆత్మహత్య చేసుకుంటాడు. తాను నమ్మి వచ్చిన అమీర్ లేకపోవడంతో రాజేశ్వరి దిక్కులేనిదవుతుంది. (మీరా వున్నా.. పిలగాడే ) మైదానంలో రాజేశ్వరి పాత్ర ద్వారా చలం గారు ఏం చెప్పదలుచుకున్నారో తెలీకుండానే అర్థాంతరంగా కథకు తెరపడుతుంది. పాపం… రాజేశ్వరి. ఆ మైదానంలో ఓ దిక్కులేని ‘అబల ‘ గా ‘అనాథ’ గా మిగిలిపోతుంది.!!
— ఎ.రజాహుస్సేన్
Share this Article