★ గురువుగారూ.. అసలు ఈ యుద్ధమేంది? ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు దాడులు చేస్తోంది? ఉక్రెయిన్ తో నాట్ ఓకేకి సంబంధం ఏంది? ఈ యుద్ధానికి సంబంధించిన జ్ఞానం ఏందో కాస్త చెప్పండి గురువు గారూ!
◆ హహహ… ఒరేయ్ చారీ.. అది “నాట్ ఓకే” కి కాదురా.. ”నాటో”కి అనాలి. అసలు ఇవన్నీ అర్థం కావాలంటే రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోలెండ్, హంగేరీ, చైనా, పాకిస్తాన్, జపాన్ ఈ దేశాలన్నింటికీ నిన్ను తీసుకెళ్లి చెబితే గానీ అర్థం కాదురా.
అయితే మరి ఎలా గురువుగారూ? నయనతార రహస్యం బయట పెట్టే వరకు మీరు చెప్పేలా లేరే?
Ads
ఒరే చారీ.. అంతపని మాత్రం చేయొద్దురా! నేనేదో నాలుగు మంత్రాలు చెప్పుకుని బతికేవాడిని. నాకు తెలిసిందేదో మన లోకల్ పాలిటిక్స్ ద్వారా నీకు అర్థమయ్యేలా చెప్పమంటే చెప్తాను!
ఏదో వొకటి చెప్పండి గురువుగారూ. ఆ బాంబులేవో మనమీద పడతాయని అసలే భయంతో చచ్చిపోతున్నాను. కొంచెం భయం తగ్గేలా నాలుగు మాటలు చెప్పండి గురువుగారూ!
ఇప్పుడు వైసిపి పార్టీ ఉంది కదా… అది రష్యా… నాటో కూటమి అంటే టిడిపి, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5… ఇవన్నీ.
అంటే ఇప్పుడు అమెరికా అంటే టిడిపి నా గురువుగారు?
అవును శిష్యా.
మరి బ్రిటన్ ఏది గురువు గారు?
జనసేన పార్టీరా…
ఓహో.. మరి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ బాంబులు వేస్తుంది కదా? అదేంటి గురువు గారు?
వైసిపి పార్టీ రాష్ట్రంలో ఉండే రకరకాల ప్రజలని అనేక పథకాలతో డబ్బులిచ్చి మభ్యపెడుతూ వాళ్లని నాశనం చేస్తుందట కదా… ఆ పథకాల బాంబులు వేయకూడదని ఈ నాటో కూటమి అంతా ఒక్కటై రష్యా మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అన్నమాట.
ఓహో.. మరి పాకిస్తాన్ సంగతి ఏంటి గురువు గారు? అదిప్పుడు రష్యాకి సపోర్ట్ చేస్తుంది కదా?
అంటే ఒకప్పుడు టిడిపిలో ఉండి, నారా కూటమి నచ్చక, తర్వాత వైసీపీకి సపోర్ట్ చేస్తున్న కొడాలి నాని పాత్రని పాకిస్తాన్ పోషిస్తోంది అన్నమాట.
చైనా బలమైన దేశం. అది కూడా రష్యాని సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి గురువు గారూ? ఏవిటో అంతా కంగాళీ కథ అల్లేస్తున్నారు మీరు!
ముయ్యరా కుర్రకుంకా. బీజేపీ మోడీ అండదండలు వైసిపి పార్టీకి ఉన్నట్టే చైనా అండదండలు పూర్తిగా రష్యాకి ఉండాయి. నాటో కూటమికి బాగా మండుతుండే విషయం ఇది.
మరి ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధం అంతా ఈ పథకాల బాంబులను గురించి అన్నమాట ఐతే.
అవును శిష్యా… ఎలాగైనా పథకాలు అందుతున్న పేద జనాలకి ఆ పథకాలు ఆపించి, వాళ్లని మంచి చేసుకోవడం నాటో కూటమి లక్ష్యం.
మరి సిపిఐ, సిపిఎం పార్టీల విషయం ఏంటి గురువుగారు? వాళ్ల మద్దతు రష్యాకే ఉండాలిగా? ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేయడం లేదుగా? మీరూ మీ తొక్కలో ఎనాలిసిస్సూను?
వాళ్లది అదో మతంరా చారీ. ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ల వాళ్ల మతాలకి ఎలా ప్రాధాన్యత ఇస్తారో.. సేం వీళ్ళు వీళ్ళ సిద్ధాంతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లంతా పైకి ఎర్రజెండాలురా. ఎప్పుడైతే రష్యా గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పేరుతో పునర్నిర్మాణం మొదలు పెట్టిందో అప్పుడే వీళ్ళకి తెగదెంపులు జరిగిపోయాయి. భర్త వదిలేసినా భార్య తాళి కళ్లకద్దుకోవడం ఒక గౌరవం మంచి మర్యాద కదరా చారీ. పద్దతుల గురించి మనకంటే ఎవరికి తెలుసు చెప్పు?
గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పేర్లేంటి గురువుగారు.. నోరు తిరగడం లేదు!
నీకన్నీ చెప్పలేక చస్తున్నానురా చారీ. జగన్ పార్టీ నిర్మాణం కోసం ఓదార్పు యాత్ర, పాదయాత్ర అని రెండు చేసాడు కదా. అవి రెండు ఇవే అనుకో గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా అంటే.
అబ్బో… భలే చెప్పారు గురువుగారు. మరి కె.ఎ.పాల్ విషయం ఎలా చూడాలి గురువు గారు?
కె.ఎ.పాల్ ఒక పవర్ఫుల్ పర్సన్ రా. అమెరికా అధ్యక్షుడు అంతటి వాడికి ఉన్న పేద్ద విమానం ప్రపంచంలో ఇంకో వ్యక్తికే ఉందటరా చారీ. అతగాడే కే ఏ పాల్ అంట. అలాంటి ఇంకో పవర్ఫుల్ వ్యక్తే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రఘురామ కృష్ణంరాజు. కే ఏ పాల్ రష్యాపై కారాలు మిరియాలు నూరుతుంటే రఘురామ కృష్ణంరాజు కూడా వైసీపీపై కారాలు మిరియాలు నూరుతుండడం తెలిసినదే కదా. అన్నీ అలా మ్యాచ్ అయిపోతాయిరా చారీ. కాకపోతే మనలాంటి శాస్త్రం తెలిసినవాళ్లు చేసేయాలి.
అబ్బో చానా కథ ఉంది కదా గురువు గారు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాతో సంధి చేసుకోవాలని చూస్తుంది గదా. అదేదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జరిపించేయండి గురువు గారూ. రోజూ ఈ యుద్దం వార్తల రచ్చ భరించలేకుండా ఉండారు నాబోటి జనం.
అది జరిగేది కాదురా చారీ. ఎలాగైనా బాంబులు వేయడం ఆపించి యుద్ధాన్ని ఆపించడానికి నాటో కూటమి ఉక్రెయిన్ని సంధికి పంపుతోందిరా. లేకపోతే పుతిన్ అణుబాంబు అయినా వేస్తానని భయపెడుతున్నాడు కదా.
అణుబాంబు అంటే అది కూడా ఏదైనా పెద్ద పథకమా గురువు గారు?
ఒరే చారీ.. అదేదో చిరంజీవి సినిమాలో వాణిశ్రీ, “కావాలంటే రాష్ట్రాన్నైనా రాసిస్తాను గాని..” అంటుంది కదా. అలాగే సామాన్య ప్రజలకు రాష్ట్రం మొత్తం రాసిచ్చేస్తాడేమోనని లోకల్ నాటో కూటమికి భయం ఉంటుంది కదా?
ఏమవుతుంది గురువుగారు అలా రాసిచ్చేస్తే?
అప్పుడు ఈ జనమంతా…
“ఈ నేల నాదిరో – ఆ నింగి నాదిరో,
ఈ చెట్టు నాదిరో – ఈ పుట్ట నాదిరో, నడుమ దొర ఏందిరో దొర పీకుడేందిరో”
అని మోడీని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, మొత్తం నాటో కూటమిని, చివరికి జగన్ ని కూడా తరిమి కొడతారనీ, ఆ సంగతి జగన్ కి అర్థం కావడం లేదనీ ప్రపంచ మేధావులంతా బాధపడతా ఉండారు. ఇది అణుబాంబు కంటే పెద్ద విస్ఫోటనంరా చారీ.
మరి మీ దగ్గర ఇంత తెలివుండి నయనతార విషయంలో ఎందుకు బొక్కలో పడ్డారు గురువుగారూ?
ష్… అదిగో.. నయనతార వస్తుంది.. కాసేపు కళ్లనిండా చూసుకోనీరా చారీ…
◆◆◆
Share this Article