కొన్ని వార్తలు అనామకంగా ప్రజల దృష్టికి రాకుండా వెళ్లిపోతుంటయ్… ఈనాడు ఇలాంటి వార్తల్ని ‘‘అచ్చేసీ వేయనట్టు’’ అస్పష్టంగా అచ్చేస్తుంది… మిగతా పత్రికలకు అసలు ఏ సోయీ ఉండదు… అలాంటిదే ఈ వార్త కూడా… ఓ చిన్న సింగిల్ కాలమ్ బిట్… సరిగ్గా చూస్తే స్పేస్ ఫిల్లర్… అనగా ఖాళీని భర్తీ చేసే చిన్న వార్త… సరే, వేశాంలే, చదివితే చదువు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది…
విషయం ఏమిటంటే..? రవిప్రకాశ్ తెలుసు కదా… టీవీ9 ఫౌండర్ డైరెక్టర్… అప్పట్లో ఎవరో డబ్బు పెట్టారు, ఈయన దాన్ని పెంచాడు… చివరకు మైహోం చేతుల్లో పెట్టారు… యాజమాన్యం బదలాయింపుకి ఈ రవిప్రకాష్ మొరాయించడం, రవిప్రకాష్ సాగించిన అవకతవకలు, అమ్మకాల్లో ఆర్థిక అక్రమాలపై కొత్త యాజమాన్యం కేసులు పెట్టడం మళ్లీ చెప్పుకోవడం దండుగ…
రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు… ఇక సాధారణ పరిస్థితుల్లో ఆ కేసులు నడుస్తూనే ఉంటయ్… కానీ తను రవిప్రకాశ్ కదా… ఈడీ ఊరుకోవడం లేదు… మళ్లీ పంజా విసిరే ప్రయత్నంలో పడింది… తను సొంతంగా ఓ కొత్త శాటిలైట్ చానెల్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు కదా… దానికి హోం శాఖ క్లియరెన్స్ అవసరం, అదెక్కడివరకు వచ్చిందో తెలియదు… ఈ కేసులున్నందున దానికి ఎవరి పేరుతో దరఖాస్తులు చేశారో తెలియదు… కానీ తాజాగా ఈడీ ఏకంగా బెయిల్ రద్దుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం ఇంట్రస్టింగుగా మారింది…
Ads
కేసు ఏమిటంటే..? 18 కోట్ల నిధుల దుర్వినియోగం… ప్రతి నెలా చివరి శుక్రవారం ఈడీ ముందు హాజరు కావాలనేది ముందస్తు బెయిల్‌కు పెట్టిన షరతు… ఎప్పుడు పిలిచినా సరే వచ్చి విచారణకు సహకరించాలి తను… కానీ 2020 డిసెంబరు నుంచి ఫిబ్రవరి 2 వరకు నాలుగుసార్లు సమన్లు జారీ చేసినా రవిప్రకాశ్ పట్టించుకోలేదనీ, రాలేదనీ ఈడీ ఆరోపిస్తోంది… ఆయనతోపాటు మూర్తి అనే మరో మాజీ డైరెక్టర్ మీద కూడా సేమ్ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ…
రవిప్రకాశ్ కొత్త చానెల్‌కు హోం శాఖ క్లియరెన్స్ మీద స్పష్టత లేదు, కానీ ఈడీ తాజా పిటిషన్ తన సొంత టీవీ చానెల్‌కు క్లియరెన్స్ రాకుండా అడ్డుపడుతుందా అనేదీ వేచిచూడాలి… టీవీ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నారు… బేసిక్ వర్క్ అంతా పూర్తయినట్టు చెబుతున్నారు… ఈ స్థితిలో మళ్లీ ఈడీ కొరడా పట్టుకోవడం విశేషమే… మోడీ టీంతో రవిప్రకాశ్‌కు సత్సంబధాలే ఉన్నాయంటారు, మరోవైపు రవిప్రకాశ్ పేరు చెబితేనే మండిపడే మై హోంకూ బీజేపీతో మంచి సంబంధాలున్నయ్… ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ బెయిల్ రద్దు కోసం ఈడీ తాజా ప్రయత్నాల్ని ఎలా అర్థం చేసుకోవాలి..?!
Share this Article