నిజానికి ఇది పాత వీడియో… ఎప్పటిదో తెలియదు… స్టార్మాటీవీ ఉత్త మాటీవీగా ఉన్న పురాతనకాలం… అప్పట్లో చిన జియ్యరుడి కూత ఒకటి మళ్లీ సోషల్ తెర మీదకు వచ్చి హల్చల్ చేస్తోంది… ఇక్కడ కూత అనడం ఎందుకంటే..? నిజంగానే తనకు ఏమీ తెలియదు… తెలియదని ప్రతిసారీ తనంతట తనే లోకానికి తెలియజేస్తున్నాడు… తన అవగాహన రాహిత్యం స్థాయినీ తనే చెబుతున్నాడు…
ప్రతి మాట వివాదమే… ఇంకా పాత వీడియోలు తవ్వితే ఇలాంటి అణిముత్యాలు ఎన్ని బయటపడతాయో… రామానుజ పీఠానికి అర్హుడేనా, సమతను బోధించిన గురుపరంపరకు వారసుడేనా..? ఈరోజుకూ డౌటే… పాలకుడు వచ్చి పాదాలపై పడిపోతే గురుగౌరవం ఏమీ వెలిగిపోదు… వందల కోట్ల భారీ విగ్రహాలు, పెద్ద ప్రాజెక్టులు కట్టగానే భారీజ్ఞానం ఏమీ సిద్ధించదు…
చూశారు కదా… సమ్మక్క-సారక్క మీద ప్రేలాపనలు… ‘‘వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత… గ్రామదేవత… అక్కడుండేవాళ్లు చేసుకోనీ, సరే… చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు… ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ ఇప్పుడు… అది వ్యాపారమైపోయింది ఇప్పుడు… ఎంత అన్యాయం..? అది ఒక చెడు… కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో…’’ ఇలా సాగింది తన ధోరణి…
Ads
ఈయనకు హిందూ మత వైశిష్ట్యం ఒక్క ముక్క కూడా తెలియదు… పూర్వకాలంలో రామానుజుడు గానీ, శంకరాచార్యుడు గానీ… అందరినీ కలుపుకుని వెళ్లే ధోరణి కనబర్చారు, అంతకుముందైనా అంతే… వేల సంస్కృతులు, ప్రాంతీయ దేవుళ్లు, ప్రజల నమ్మకాలను గౌరవిస్తూ, అందరినీ హిందూ దేవుళ్లలో కలిపేస్తూ, ఏవో తమ ప్రయత్నాలు తాము చేశారు… చినజియ్యర్ వంటివాళ్లు విడదీసే విద్వేషాలు చిమ్ముతారు…
నిజానికి గ్రామదేవతలు, అడవిదేవతలు అంటే అంత చిన్నచూపేమిటి..? అసలు ఆధ్యాత్మిక ఉన్నతి ఎలా సిద్ధిస్తుందో తెలుసా తనకు..? దేవుడు అంటే ఓ విశ్వాసం… అంతే… అది ఏ మతమైనా సరే… ఒక ఎల్లమ్మ, ఒక ఉప్పలమ్మ, ఒక మైసమ్మ, ఒక సమ్మక్క, ఒక పెద్దమ్మ, ఒక మాంకాళమ్మ, ఒక నూకాలమ్మ… రకరకాల పేర్లతో ఆయా ప్రాంత ప్రజలు పూజిస్తే, విశ్వసిస్తే నీకొచ్చిన నొప్పి ఏమిటి..? పోనీ, నువ్వు చెప్పిన దేవుళ్లు, నువ్వు నీ కొత్త ప్రాజెక్టులో డమ్మీ గుళ్లు కట్టిన 108 మంది దేవుళ్లు బ్రహ్మలోకం నుంచి దిగివచ్చారా..?
మొక్కడం, పూజించడం అంటే విశ్వసించడం, మంచిని ఆకాంక్షించడం, గౌరవించడం…. పల్లెవాసుల దేవుళ్లు అంటే తెలుసా..? ఓ బొడ్రాయి, చెరువు కట్ట మీద రాయి, ఓ కాలువ వెంట పాతిన రాయి, ఓ నది, ఓ చెట్టు, ఓ పుట్ట… చివరకు పంట కోసుకునే ముందు కూడా పూజ చేసి కోయడం మొదలెడతాడు… నీ విష్ణువు మీద ఉన్న విశ్వాసానికి ఏ పవిత్రత ఉందో, ఈ ప్రకృతి పూజల్లోనూ అదే పవిత్రత ఉంది… అది తప్పెలా అయ్యింది..?
పోనీ, నువ్వు చేసేది దందా కాదా..? నీ రామానుజ ప్రాజెక్టు చుట్టూ పరుచుకున్న వ్యాపార ఆలోచనల మాటేమిటి..? స్మార్ట్ సిటీ ప్రణాళిక ఏమిటి..? ఓ పీఠాధిపతి జన్మదినాలకు, వస్త్రాలంకరణ వేడుకలకూ వెళ్లి డబ్బులు తెచ్చుకుంటే అది ఆధ్యాత్మిక మార్గమా..? అదేమైనా హుందాగా ఉందా..? తుచ్చమైన ధనాన్ని కూడబెట్టి, పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లాగా కార్పొరేట్ ధార్మికక్షేత్రాలను కట్టడమా ఆధ్యాత్మిక భావనల వ్యాప్తి అంటే..!! ఇలాంటి పోకడలేనా మతాన్ని కాపాడేవి..? అన్య మతాల నుంచి తీవ్రమైన దాడి జరుగుతున్నవేళ ఇదేనా కనబర్చాల్సిన హైందవ ఐక్యతాజ్ఞానం..?
చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల పూజలకు ఒక సమ్మక్క, ఒక సారలమ్మ పనికిరారా..? నీ సర్టిఫికెట్లు కావాలా ఈరోజు వాళ్లకు..? ఫలానావాళ్లు దేవతలే, పర్లేదు పూజించవచ్చు అని క్లియరెన్స్ ఇవ్వాలా..? ఒక పీఠాధిపత్యానికి పనికొచ్చే నడతేనా ఇది..? నడకేనా ఇది..? ప్రతి మాటకు ఎంత విలువ ఉండాలి, అసలు ఇలాంటివే కదా, విద్వేషాన్ని వ్యాప్తి చేసే మైల మాటలు..? మాంసాహారం మీద అప్పుడెప్పుడో కూసిన వెగటు కూతలకూ… సమ్మక్క-సారలమ్మల మీద చూపిన ఈ రోతలకూ పెద్ద తేడా ఏమీ లేదు… సేమ్, అజ్ఞానమే…!!
నిజానికి ఇదుగో, ఇలాంటి స్వాములు, జ్ఞానులు, కైలాసరాజులే నయం… సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదు… ఎటొచ్చీ, హైందవంలోని వివిధ సెక్షన్ల నడుమ మంట పెట్టే ధోరణి, ఆహార అలవాట్లను వెక్కిరించే పోకడ, మనోభావాలను-విశ్వాసాలను వెకిలి చేసే అలవాట్లతో పోలిస్తే ఈ నిత్యానందులే నయమేమో…
Share this Article