పుష్ప… రెండురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగినపేరు… కాబోయే భర్తపై కసకసా దాడి చేసిన ఆమె అలా ప్రవర్తించడానికి కారణం… పెళ్లి వద్దనుకోవడం… ఎందుకు..? ఏదో ఆధ్యాత్మిక సమాజంలో చేరిపోవాలనే పిచ్చి… అవును, పిచ్చి… దేవుడి మీద భక్తి ముదిరితే, ఎవరినో నమ్మి, చచ్చేందుకు కూడా సిద్ధపడేంత ఉన్మాదం ఆవరిస్తుంది… చరిత్రలో బోలెడన్ని ఉదంతాలున్నయ్ ఈ కల్ట్ మీద.., ఇది ఓ మానసిక చాంచల్యం… ఈ పరంపరలో పుష్ప మొదటిదీ కాదు, చివరిదీ కాదు… ఇది మళ్లీ ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా..? చదవండి…
నిజామాబాద్ జిల్లాకు చెందిన సంతోషి రూప 2005లో జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… ఎంఎస్ కోసం అమెరికా పోయింది… లూయిస్ విల్లే యూనివర్శిటీలో 2011లో పీహెచ్డీ చేసింది… 2012లో లోవా యూనివర్శిటీలో మరో పీహెచ్డీ… 2015లో హఠాత్తుగా మాయమైంది… తెలివి ఎక్కువైనా కష్టమే, అది ఏ పర్వర్షన్ వైపు లాక్కుపోతుందో తెలియదు…
తల్లిదండ్రులకు లింక్ కటయిపోయింది… అమెరికా యూనివర్శిటీతో టచ్లోకి వెళ్తే ఆమె ఇండియాకే వెళ్లిపోయిందని చెప్పి, చేతులు దులుపుకున్నారు… మరి ఎక్కడికి పోయింది..? ఆచూకీ కోసం ప్రయత్నించగా, త్నించగా… ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ దీక్షిత్ నడిపే ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ ఆశ్రమంలో ఉంటున్నట్టు తెలిసింది… తనను తాను శ్రీకృష్ణుడినని భావిస్తూ, వేలమంది గోపికలు కావాలని పేలే అతని మాయలో ఎలా పడిందో తెలియదు… ఇలాంటి వాళ్లెందరో… ఆణిముత్యాలు ఎన్ని ఇలా మాడిపోతున్నాయో…
Ads
అవునూ… ఇలాంటి ఆధ్యాత్మిక వంచకులకు ఆడపిల్లలు, మహిళలే సాఫ్ట్ టార్గెట్లు అవుతారు… వాళ్లే అత్యంత సులభంగా ఎందుకు పడిపోతారు..? భక్తిని వ్యాప్తి చేయడానికి ఆడవాళ్లే కావాలా..? సరే, సదరు ఆశ్రమంపై బోలెడు ఫిర్యాదులు… కొన్నినెలల క్రితం సీబీఐ అధికారులు ఆశ్రమం మీద దాడి చేసి 40 మందిని రక్షించారు… అదొక జైలు… డ్రగ్స్… అమ్మాయిలు ఏం చేసినా దైవసేవ అని భ్రమింపజేస్తారు… ఆ మాయలో పడితే ఇక పేరెంట్స్ ను పట్టించుకోరు, మిగతా లోకాన్నే పట్టించుకోరు…
రెండుమూడేళ్లుగా ఈ వార్త చదువుతూనే ఉన్నాం… సంతోషి తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు… మళ్లీ వంద మందికిపై మహిళలు అక్కడ చేరారట… మరి సీబీఐ మధ్యలోనే ఎందుకు వదిలేసినట్టు..? అసలు దేశరాజధానిలోనే ఈ అక్రమ ఆశ్రమ వ్యవహారాలు నడుస్తుంటే ఇక పాలన ఏముంది..? అసలు ఆ వీరేంద్రుడు ఎవరు..? ఎవరి మద్దతు ఉంది..?
మొన్నటి వార్త ఏమిటంటే… హైకోర్టు ఒక్కసారిగా సీరియస్ అయ్యింది… అసలు వీరేంద్ర అనేవాడు అజ్ఞాతంలో, పరారీలో ఉన్నాడు కదా, మరి ఈ ఆశ్రమాన్ని ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించింది… ప్రభుత్వం వెంటనే ఆ యూనివర్శిటీని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది… వెలువడిన వార్తలన్నీ గందరగోళంగా కూడా అనిపించాయి… ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సరిపోదు, అక్కడ చిక్కుకుపోయిన వారికి మానసిక చికిత్స చేయించి, తల్లిదండ్రులకు అప్పగించడం బెటర్… హైకోర్టు ఆదేశాల్లో ఈ అంశం ఉందో లేదో తెలియదు…
ఆశ్రమంలో ఉన్నవారిని ఎటూ తరలించకుండా నిరోధించాలని చెప్పిందట… అసలు ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, అందరి వివరాలను కోర్టుకు సమర్పించడం బెటర్ కదా… వాళ్లను రక్షించే బాధ్యత అధికార యంత్రాంగం మీద పడుతుంది… నిజానికి హైకోర్టు ఎప్పుడో స్పందిస్తే ఇంకా బాగుండేది… చాన్నాళ్లుగా నలుగుతోంది ఈ కేసు…
ఢిల్లీ ఆశ్రమంలో పట్టపగలు ఈ పిచ్చి పనులేమిటీ అని కోర్టు ఆగ్రహించింది… కరెక్టే… తమ దగ్గరకు ఈ కేసు వచ్చినప్పుడే ఈ ప్రశ్నను అధికార యంత్రాంగానికి వేసి, తలంటితే ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చేది… లేకపోతే ముదిరిపోతుంది… డేరాబాబా కేసు అందరమూ విన్నదే, చదివిందే… ఇక్కడ పదే పదే కలుక్కుమనిపించే వాక్యం ఏమిటంటే..? 2018లో 40 మందిని స్వయంగా రక్షించింది కదా సీబీఐ… ఐనా మళ్లీ ఆ ఆశ్రమం యధావిధిగా ఎలా నడుస్తోంది..? ప్రభుత్వం దాన్నెందుకు మూసేయలేదు… వాటి మీదకు బుల్డోజర్లు వెళ్లవా..?
Share this Article