Ice apple అంటారుట ఇంగ్లిషులో… మరీ అంతగా జుత్తు పీక్కోకండి… తెలుగులో తాటి ముంజలు… ఒక్కసారి పొట్టు తీస్తే మెత్తగా, గడ్డ కట్టిన తేనె నీళ్లలా, తియ్యగా, చేతిలో నుంచి జారిపోతూ… అసలు ముంజలకు మించిన అద్భుతమైన సహజ ‘ఆహా’రం ఏముంటుంది..? తేనె వేయొద్దు, చక్కెర చల్లొద్దు, ఏ చెత్తాచెదారం వేయకుండా… వాటిని వాటిలాగే నోట్లోకి వేసుకుంటే చల్లగా గొంతులోకి జారిపోతూ… అద్భుతహ అనాలినిపించే టేస్టు ముంజలకే సొంతం…
కానీ ఈనాడు వాళ్లు అలా ఎవరినీ, దేన్నీ ఒరిజినాలిటీకి వదిలేయరు కదా… ప్రపంచంలోని ఏ ఒరిజినాలిటీనైనా సరే, ధ్వంసం చేసి, మనుషుల కడుపుల మీద కసి ప్రదర్శించే ధోరణి మార్చుకోరు కదా… అసలే యూట్యూబర్లు పెట్టే వంటల వీడియోలతో రోజురోజుకూ ఫాఫం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కడుపుల్లో మందుపాతర్లు పేలుతూనే ఉన్నాయి కదా… టీవీల్లో వంటల వీడియోలు వాయిక్ స్పందనలతో తడిసి ముద్దవుతున్నాయి కదా…
ఐనా ఏదో కనిపించని కక్ష ఏదో రాయిస్తున్నట్టుంది… మానవజాతి మీదే ఏదో ఆగ్రహం రేయింబవళ్లూ పేలుతున్నట్టుంది… నోటికొచ్చినట్టు, సారీ… పెన్నుకొచ్చినట్టు… ఏదిపడితే అది రాసి పేజీలు నింపేస్తే సరి… పాఠకుడి ఖర్మ… ముంజలతో వంటకాలు అని నింపిపారేశారు… ఏదో మిల్క్ షేక్, ఐస్ క్రీమ్, సలాడ్, ఖీర్ అంటే పర్లేదు, అని క్షమించేయొచ్చు… కానీ అలా మామూలుగా పాఠకుల్ని వదిలేయడానికి అదేమైనా సాదాసీదా పత్రికా..? కాదు కదా… ఘొప్ఫ పత్రిక కదా… ఏదేదో కుమ్మిపారేసింది…
Ads
ఒకటేమో మిర్చి బజ్జీల్లాగా… కట్ చేసేసి, శెనిగె పిండిలో ముంచేసి, నూనెలో వేయించాలట… వాయిక్… అంతేనా..? దాన్ని కూర చేసుకుని అన్నంలోకి లేదా చపాతీల్లోకి టేస్టే టేస్టట… ఏముందబ్బా… అన్ని వంటల్లోనూ సాధారణంగా రాసేవే కదా… వాళ్లేమైనా టేస్ట్ చేస్తారా..? పాఠకుల కడుపులు, వాళ్ల ఖర్మ…
అదే అల్లం వెల్లుల్లి ముద్ద, అవే ఆవాలు, అదే జిలకర, అదే కరివేపాకు, అదే కొత్తిమీర, అదే ఉల్లిపాయ, అవే టొమాటోలు… ఇంద్రుడు అకస్మాత్తుగా అమృతం ఇచ్చినా సరే… దానికైనా ఈ పోపు, తిరగమోత తప్పదు అని రాసేసే వింత వంట రకాలు ఇవి… పాఠకుల మీద ఇదేం కక్షో అర్థం కాదు… అదేదో జంధ్యాల సినిమాలో మహాలక్ష్మి పాత్ర చెప్పినట్టు అరటికాయ లంబా లంబా, బంగాళా భౌభౌ… ఆమెను అక్షరాలా ఆవాహన చేసుకుని మరీ వంటలు పరిచయం చేస్తున్నారు ఈమధ్య…
కానీ ఏమాటకామాట… ఈనాడులో చాలా చాలా బరువు పెరిగిపోయి, నేల వైపు భారంగా వాలిపోతున్న పెద్ద పెద్ద తలకాయల సాక్షిగా…. ముంజల బిర్యానీ, ముంజ ఫ్రైడ్ రైస్, ముంజల పకోడీ, ముంజల షోరువా, ముంజ పాయ, ముంజ పరోటాల గురించి రాయలేదు… థాంక్ గాడ్… హేమో… త్వరలో అవీ రాసి పాఠకుల మీదకు వదిలినా దిక్కులేదు…
మరేం చేయాలంటారు..? ఇదేనా మీ ప్రశ్న… ముంజల ఒరిజినాలిటీని చంపేయకండి… అది అద్భుతమైన ఓ వృక్ష ఉత్పత్తి… దాన్నలాగే తినేయండి… అలా చేస్తేనే అనేకానేక ఆరోగ్య ప్రయోజనాలు… అత్యంత లేత కొబ్బరికన్నా మృదువుగా, రుచిగా, చల్లగా, మెత్తగా కడుపులోకి జారిపోతుంది… అదొక అనిర్వచనీయమైన ఫీల్… వాటిని కట్ చేస్తాం, మిరియాల పొడి చల్లుతాం, నిమ్మకాయ రసం చల్లుతాం, బిర్యానీలోకి ముంజల రైతా చేస్తాం, వెనిగర్ వేస్తాం వంటి వికృత ఆలోచనలు చేయకండి… ప్లీజ్… ఇలాంటివి యూనిక్… భ్రష్టుపట్టించకండి…!!
చివరగా ::: ఆమధ్య టీవీల్లో వంటల ప్రోగ్రాములకు యాంకర్‌గా చేసిన శ్యామల ఓ చేదునిజాన్ని బయటపెట్టింది… ఛిఛీ, వాయిక్, వాటినెవడు టేస్ట్ చేస్తారు..? ఏదో అలా నటిస్తాం అని ఖండితంగా చెప్పి పారేసింది… నిజానికి ఇలాంటివి ప్రసారం చేసే పెద్దలకు, పరిచయం చేసు చెఫ్పులకు వాటిని తినిపించడమే సరైన శిక్ష…!!
Share this Article