అమ్మా.. నేను..
ఇద్దరం తెల్లవారుజామునే లేస్తాం.
అమ్మేమో.. పేపర్ పట్టుకుంటుంది.
నేనేమో.. సెల్ అందుకుంటా.
రోజూలాగానే ఇటీవల ఒక రోజున..
పేపర్లో అమ్మ, సెల్లులో నేను కళ్లు దూర్చేశాం.
వాట్సాప్ ఓపెన్ చేయగానే, నా మిత్రుడి నుంచి ఓ వీడియో మెసేజ్. టచ్ చేయగానే… నేపథ్యం నుంచి ‘గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..’ పాట వినిపిస్తున్నది. నా చిన్నప్పుడు నేను చూసినవి/చేసినవి/ఆడినవి… ఒకటొక్కటిగా కనిపిస్తూ, పలకరిస్తూ తెర (స్క్రీన్) మీద నుంచి వెళ్తున్నాయి. కాల్గేట్ పళ్ల పొడి, శ్రీదేవి బొమ్మతో లక్స్ సబ్బు కవర్, ఫెయిర్ అండ్ లవ్లీ, వీకో టర్మరిక్, నిర్మా వాషింగ్ పౌడర్.. ఇలా ఇలా అనేకం. అవన్నీ చూస్తూ.. నా బాల్యంలోకి వెళ్లబో..తు..న్నా..!
Ads
అంతలోనే..
సడన్ గా..
‘‘అరేయ్ బుజ్జిగా.. ‘నేతి బీరకాయలో నెయ్యి’ ఉంటుందారా..?!’’ అనడిగింది అమ్మ.
(ఈ బుజ్జిగాడు ఎవడనేదేగా మీ సందేహం..?! ఇంకెవడు.. నేనే..!! గాడిదలాగా ఎదిగినా, ఇద్దరు పిల్లలకు తండ్రినయినా కూడా.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నన్ను ఇలాగే పిలుస్తున్నది. ఆమె నన్ను పేరు పెట్టి పిలవగా.. ఇప్పటివరకూ వినలేదు)
‘‘నెయ్యేమిటి..? బీరకాయేమిటి..? నేతి బీరకాయలో నెయ్యి, బూడిద గుమ్మడి కాయలో బూడిద.. ఉంటుందా..? అయినా, ఇంత పొద్దున్నే నీకు ఇంత ‘పేద్ద’ సందేహమెందుకొచ్చిందే..’’ బోల్డంత ఆశ్చర్యంగా.. కాస్తంత అసహనంగా అన్నాను.
‘‘ఇది చదువు..’’ అంటూ, తన చేతిలోని పేపర్ ను నాకు ఇచ్చింది.
——————
‘ఆ ప్రకటనలు వారంలోగా నిలిపేయండి’
శీర్షికన ఓ వార్త. సెన్సోడైన్ టూత్ పేస్ట్.. తెలుసు కదా.. ‘ప్రపంచంలోనే నంబర్ 1 సెన్సిటివిటీ టూత్ పేస్ట్. ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యులు సిఫారసు చేసిన టూత్ పేస్ట్’ అంటూ ఆ కంపెనీ ఊదరగొడుతుంది. మీరు వినే/చూసే ఉంటారు. ఆ కంపెనీ చేస్తున్న ఈ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ నిషేధం (శాశ్వతంగా కాదు, కేవలం ఏడు రోజులపాటు) విధించింది. అంతటితో ఊరుకోలేదు. ఆ కంపెనీకి అక్షరాలా పదిలక్షల రూపాయల జరిమానా విధించింది. ఇదంతా ఎందుకయ్యా అంటే.. ‘క్లినికల్ గా పరీక్షించారు. 60 సెకన్లలో పనిచేస్తుంది’ అంటూ,
కొనుగోలుదారులను ఆ ప్రకటన (అందులోని విదేశీ వైద్యులు) తప్పుదోవ పట్టిస్తున్నదట. సరే, నిషేధం+ జరిమానా విధిస్తూ ఆ సంస్థ పంపిన నోటీసుకు ఈ కంపెనీ జవాబిచ్చిందట. దాంతో ఆ సంస్థ ‘సంతృప్తి’ చెందినట్లుంది. ఆ కంపెనీ ఇచ్చిన జవాబు/వివరణ ఏమిటో.. ఈ సంస్థకు కలిగిన ‘సంతృప్తి’ ఏమిటో తెలియదుగానీ.. చివరికి, ‘ఆ విదేశీ వైద్యులను వదిలేయండి. కేవలం భారతదేశంలోని దంత వైద్యులతోనే వ్యాపార ప్రకటనలు ఇచ్చుకోండి’ అంటూ ‘తీర్పు’నిచ్చింది.
ఈ వార్తంతా చదివిన తర్వాత.. ‘కొండంత రాగం తీసి..’, ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది’ సామెతలు గుర్తుకొచ్చాయి. కొనుగోలు/వినియోగదారులను ఆ ప్రకటనలు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పిన ఈ సంస్థ.. అలా చేయొద్దని చెప్పకపోగా.. ఆ విదేశీ డాక్ట్లర్ల మొఖాలను మార్చేసి, కేవలం స్వదేశీ డాక్టర్లవి పెట్టి ప్రచారం చేసుకుంటే.. తప్పు కాస్తా ఒప్పవుతుందని చెప్పి వదిలేసింది. ఆ ప్రకటనలోని విషయం (క్లినికల్ గా పరీక్షించారు. 60 సెకన్లలో పనిచేస్తుంది) ఎంత అవాస్తవికమో అనేది ఇక్కడ ప్రధానాంశం. దానిని వదిలేసి, ఆ మొఖాలపై అభ్యంతరం చెప్పడమేమిటో.. స్వదేశీ మొఖాలు పెడితే సరిపోతుందని సెలవీయడమేమిటో.. హేమిటో.. అంతా సిల్లీగా అనిపించింది.
——————
ఇంతకీ మా అమ్మకు ఆ సందేహం (నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా..?) ఎందుకొచ్చిందో అర్థమవలేదు. అదే విషయం అడిగాను. అమ్మ బిగ్గరగా నవ్వుతూ.. ‘‘నేను ఎప్పటి నుంచో ఈ సెన్సోడైన్ టూత్ పేస్ట్ వాడుతున్నాను. నాకు కాస్తంత ఉపశమనం ఉంది. కానీ, ఆ ప్రకటనలో చెప్పినట్లుగా 60 సెకన్లలో మాత్రం కాదు’’ అంది.
‘‘ఇదొక్కటే కాదు. ఇలాంటివే అనేక వ్యాపార ప్రకటనలు మనల్ని ముంచుతున్నాయి, దోచుకుంటున్నాయి’’ అంటూ సోదాహరణగా వివరిస్తుంటే.. నా చిన్నప్పటి జ్ఞాపకాలు తరుముకుంటూ వచ్చాయి.
——————
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువగా లైఫ్ బాయ్ (ఒంటి) సబ్బు వాడేవాళ్లం. ఎందుకంటే.. అది ధర తక్కువ, సైజు ఎక్కువ. పెద్దగా.. గట్టిగా ఉండేది. ఎంత రుద్దినా కూడా అరిగేది కాదు. చాలా రోజుల వరకు వచ్చేది. నాకేమో లక్స్ సబ్బు వాడాలని ఉండేది. పేపర్ లో, మేగజైన్స్ లో లక్స్ సబ్బు ప్రకటన వస్తుండేది. ఆ సబ్బు కవర్ మీద శ్రీదేవి బొమ్మ, దాని కిందనే ‘నా చర్మ సౌందర్య రహస్యం.. లక్స్ సబ్బు’ అనే క్యాప్షన్.. నన్ను ఆకట్టుకునేవి. ‘లక్స్ సబ్బుతో ఒళ్లు రుద్దుకుంటే.. నేను కూడా అందంగా మారిపోతానేమో..! అనుకునేవాడిని.
నాకు గుర్తున్నంత వరకు (కౌమారంలోకి వచ్చేంత వరకు) ఆ సబ్బు వాడలేకపోయాను. ఎందుకంటే, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడైన మా బాపుకు ఆనాడు ఆదాయం చాలా తక్కువగా వచ్చేది (బతకలేక బడి పంతులన్న మాట). అందుకే, లక్స్ సబ్బు కొనేంత ‘స్థోమత’ ఉండేది కాదు. అది త్వరగా అరిగిపోవడం/కరిగిపోవడం కూడా మరో కారణమనుకోండి. లక్స్ సబ్బుతో స్నానం చేయాలని, కనీసంగా మొఖమైనా రద్దుకోవాలనే కోరిక.. నాకు బాల్యంలో కలగానే మిగిలిపోయింది. అలాగే.. ఆ తర్వాతి రోజుల్లో వీకో టర్మరిక్ పేస్ట్, ఫెయిర్ అండ్ లవ్లీ పేస్ట్ ఉండేవి. వాటి వ్యాపార ప్రకటనలు కూడా బాగా ఆకట్టుకునేవి. వీటిని మా అమ్మ వాడుతుండేది.
అమ్మ చూడకుండా (పేస్ట్ త్వరగా అయిపోతుంది.. రాసుకోవద్దు.. అని తిడుతుందేమోనని భయం) ఆ పేస్టును నా మొహానికి రాసుకునేవాడిని. సాయంత్రమో, మరుసటి రోజునో.. అద్దంలో నా మొఖాన్ని ఆశగా, పరీక్షగా చూసుకునేవాడిని.. ఏమైనా మెరుపు/నిగారింపు వచ్చిందేమోనని..!! ఇంకొక జ్ఞాపకం కూడా తరుముకొస్తున్నది.
నేను పదేళ్ల లోపు వయసులో ఉన్నప్పుడు.. మా ఇంటిల్లిపాదీ.. పళ్లు తోముకోవడానికి బొగ్గు పొడి, ఆ తరువాత పళ్ల పొడి, దంత మంజన్ వాడేవాళ్లం. ఆ తర్వాత కొన్నాళ్లకు కోల్గేట్ టూత్ పౌడర్ర్ కు మారాం. ఆ పౌడర్ తో తోముకుంటే పళ్లు తెల్లగా మిలమిల మెరుస్తాయంటూ ప్రకటన వచ్చేది. అది చూసి, పళ్లు తెల్లగా మెరవాలని.. ఎడమ అరచేతిలో కాసింత ఎక్కువ పౌడర్ పోసుకుని, కుడి చేతి చూపుడు వేలితో తెగ రుద్దేవాడిని. పళ్లు తెల్లగ కావడం సంగతేమోగానీ.. రుద్దీ రుద్దీ నా వేలికి బొబ్బ వచ్చేది..!
———
వ్యాపార ప్రకటనలు.. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతాయి. ‘అయామ్.. కాంప్లాన్ బాయ్..’ అంటున్న చలాకీ పిల్లాడిని చూసి, ‘బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ..’ అంటూ సచిన్ ఇచ్చిన ‘సర్టిఫికెట్’ చూసి.. కాంప్లాన్, బూస్ట్.. డబ్బాలకు డబ్బాలకు కొని, తమ పిల్లలకు తాగించిన తల్లులు ఎంతమందో..!! నాటి తరానికి చెందిన మాకు.. లక్స్ కంపెనీ వాడు శ్రీదేవిని చూపించి ‘లక్’ కొట్టేశాడు, ‘లాక్స్’ (ఆఫ్ రూపీస్) పోగేశాడు. ఆ లక్స్ వాడిన నాబోటోళ్ల ‘లుక్స్’ మాత్రం మారలేదు. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వాడు కూడా ఆనాడు అందర్నీ ‘లవ్లీ’గా పడేశాడు, లాఘవంగా లాగేశాడు.
———
అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. అంతే !
జరిగిందీ.. జరుగుతున్నదీ.. జరగబోయేదీ.. ఇదే !
ఇదంతా ‘ఎమోషనల్ బ్లాక్ మెయిల్’ అనిపిస్తున్నది నాకు. ఈ వ్యాపార ప్రకటనల మాయాజాలం నుంచి బయటకు రానంత కాలం ఇలాగే జరుగుతుంది. కాదంటారా..?!
———
ఇంతగా ఆలోచిస్తుంటే.. నాకొక సందేహం వస్తున్నది. కంపెనీ వాడికి బాధ్యత లేదు సరే.. ప్రచారకర్తల మాటేమిటి..? గొప్ప క్రికెటర్ గా సచిన్ ను అభిమానిస్తాం. గొప్ప నటుడిగా చిరంజీవిని ప్రేమిస్తాం. వాళ్లు ‘సర్టిఫికెట్’ ఇచ్చేసిన ఉత్పత్తులను వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తుంటాం. మన అభిమానాన్ని, ప్రేమను ఆ వ్యక్తులు (సచిన్, చిరంజీవి.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఎవరైనా కావొచ్చు) ‘పెట్టుబడి’గా పెట్టి కోట్లు కూడబెట్టుకోవడాన్ని ఏమనాలి..? ఇది బాధ్యతారాహిత్యం కిందికి రాదా..? కచ్చితంగా వస్తుంది.
———
ఆగండాగండి..
ప్రచారకర్తలందరినీ ఒకే గాటన కట్టేస్తే ఎలా..?! ముగ్గురు ప్రముఖుల గురించి చెప్పుకుందాం. అంతకన్నా ముందుగా మూడు మాటలు చెప్పాలి. సినిమా పరిశ్రమ అనగానే.. కొంతమందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడి వారికి విలువలు ఉండవనీ, వాటిని వలువల్లా వదిలేస్తారని, కోట్లు కుమ్మరిస్తే దేనికైనా సిద్ధపడతారని… ఇలా ఒకింత తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి అభిప్రాయాలు విన్నప్పుడు, చదివినప్పుడు.. ఎందుకోగానీ నా మనసు చివుక్కుమంటుంది. అందుకేనేమో, సినీ పరిశ్రమ.. అందులోని ‘శ్రామికుల’(కళాకారులు, సాంకేతిక నిపుణులు)కు సంబంధించి ఏదేని సానుకూలాంశం కనిపిస్తే/వినిపిస్తే సంతోషమేస్తుంది.
———
నేను చెబుతానన్న ముగ్గురు సినీ ప్రముఖుల్లో మొదటి వారు మరెవరో కాదు.. ‘పుష్ప’.. ‘పుష్పరాజ్’ అలియాస్ అల్లు అర్జున్..! ‘పుష్ప’తో ఆయన ఇమేజ్ అమాంతం ‘పాన్ ఇండియా’కు దూసుకెళ్లింది. కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారానికి ఇలాంటి వారిని కోట్లకు కోట్లు పడేసి ‘కొనుక్కుంటాయి’. మన ‘పుష్ప’ వద్దకు అలాంటి ఓ కంపెనీ వచ్చింది. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని అడిగింది. భారీగానే ఆఫర్ చేసింది.
మరొకరైతే.. ఎగిరి గంతేసేవారేమో. ఈ ‘పుష్ప’ మాత్రం.. తనదైన స్టైల్లో ‘తగ్గేదేలే.. చేసేదేలే..’ అని ‘నో’ చెప్పేశాడు. ఆ కంపెనీ పొగాకు ఉత్పత్తులకు సంబంధించినది. ‘పాన్ పరాగ్’ తయారు చేస్తున్నది. దానిని ప్రమోట్ చేయాలని అడిగింది. ‘‘మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే.. నేను చేయనే చేయను’’ అని తెగేసి చెప్పేశారు. ‘ఎందుకయ్యా..?’ అని అడిగితే.. ‘‘ఆ యాడ్ చేస్తే.. నా అభిమానులు దానిని వాడే ప్రమాదముంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలాంటి ఉత్పత్తులను వాడాలని నేనెలా చెబుతాను..? అందుకే, చేయనని చెప్పేశా..’’ అని వివరించారు. నిజ జీవితపు ‘హీరోయిజ’మంటే ఇదే కదా..! నిజమైన హీరో ఇతడే కదా..!!
———
మరో ప్రముఖుడి గురించి చెప్పుకుందాం. ఆయన మరెవరో కాదు.. మన మెగా స్టార్ చిరంజీవి..! ఆయన అప్పుడెప్పుడో ఓ కూల్ డ్రింక్ యాడ్ చేశారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకసారి ఆ యాడ్ ను సీపీఐ నేత నారాయణ గారు చూశారట. ఆయనకు ఒళ్లు మండిందట. దాదాపుగా అన్ని కూల్ డ్రింక్స్ లో (అందులో కలిపే రసాయనాల్లో) పురుగు మందు అవశేషాలు ఉంటాయని మనందరికీ తెలుసు. అయినప్పటికీ తాగేవాళ్లు తాగుతూనే ఉన్నారు.
‘ఈ డ్రింక్ నేను తాగుతున్నాను, మీరూ తాగండి..’ అని మెగా స్టారే టీవీ తెర మీదకు వచ్చి చెబితే.. ఆయన అభిమానులు తాగకుండా ఉంటారా..? వారి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందా..? వారి ఆయురారోగ్యాన్ని హరించే హక్కు చిరంజీవికి ఉంటుందా..? ఇలా ప్రశ్నలు సంధిస్తూ చిరంజీవికి నారాయణ గారు లేఖ రాశారట. అంతేకాదు, ఆ కూల్ డ్రింక్ ప్రచారం మానుకోకపోతే.. పిల్లకాయలను (విద్యార్థులు) పోగేసి ప్రదర్శనలు, ధర్నాలు చేస్తానని హెచ్చరించారట.
కొన్ని రోజుల తరువాత.. అల్లు అరవింద్ గారే నారాయణ గారికి ఫోన్ చేశారట. ‘‘ఏమండీ..! ఆ యాడ్ ద్వారా వస్తున్న డబ్బును మేం మా స్వంతానికో, స్వార్థానికో వాడడం లేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు వెచ్చిస్తున్నాం. మమ్మల్ని ఎలా తప్పుబడతారు..?’’ అన్నారట. అంతే.. ఈయన గారికి చిర్రెత్తుకొచ్చిందట. వెంటనే.. ‘‘ఒకవైపేమో.. పురుగు మందు కలిపిన డ్రింక్ తాగించేది మీరే. అది తాగినోళ్లు ఆరోగ్యం దెబ్బతిని చావుబతుకుల్లో మంచమెక్కితే.. రక్తమిచ్చి ప్రాణం నిలుపుతామని చెప్పేదీ మీరే.
ప్రాణం తీయడమెందుకు..? ప్రాణం పోయడమెందుకు..? ప్రాణం పోయడం సంగతి సరే.. ప్రాణం తీసే హక్కు మీకెక్కడిది..?’’ అని గట్టిగా నిలేసి అడిగారట. అరవింద్ గారు కన్విన్స్ అయ్యారట. ‘‘ఇంకొక ఆరు నెలల్లో ఆ కంపెనీ కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఆ తరువాత చిరంజీవి గారు ఆ యాడ్ చేయరు’’ అని హామీ ఇచ్చారట. అన్నట్లుగానే ఆ తరువాత నుంచి చిరంజీవి గారు ఆ యాడ్ కాంట్రాక్టును పొడిగించలేదట. (నారాయణ గారే ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టారు) ఇఫ్పుడు చెప్పండి.. తెలియక చేసిన తప్పును సరిదిద్దుకుని, సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల యాడ్ వదిలేసుకున్న మెగా స్టార్ చిరంజీవిది ‘హీరోయిక్ డెసిషన్’ కాదంటారా..!
———
మరకరి గురించి కూడా చెప్పుకోవాలి. హీరో కాదు.. హీరోయిన్.. సాయిపల్లవి..! బ్యూటీ ప్రోడక్ట్ కు సంబంధించిన యాడ్ చేసేందుకు ఓ కంపెనీ ఏకంగా రెండుకోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది. అయినా సరే, ఆ యాడ్ చేయనంటే చేయనని ఆమె తెగేసి చెప్పారు. ఈ వార్త బయటకు రాగానే.. ‘బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ చేస్తే తప్పేమిటి..?’ అంటూ అనేకమంది సందేహం వ్యక్తం చేశారు. ఆమె అభ్యంతరం ఆమెకు ఉంది.
‘‘నేను మొఖానికి అసలు మేకప్ వేసుకోను. షూటింగ్ అప్పుడు కూడా.. తప్పదనుకుంటేనే ఏదో నామమాత్రంగా వేసుకుంటాను. నా చెల్లెలి పేరు పూజ. నాకంటే ఐదేళ్లు చిన్నది. మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. అదంటే నాకెంతో ఇష్టం. అది ఎక్కువగా చీజ్, పిజ్జాలు, బర్గర్లు తింటుంది. పండ్లు తినమన్నా తినదు. తరచూ అద్దంలో తనను తాను చూసుకుంటూ.. ‘అక్కా, నేను నీ అంత అందంగా లేను..’ అంటూ బాధపడుతుండేది. అందమనేది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదని, సహజంగా రావాలని, అందుకోసం ప్రయత్నించాలని చెప్పేదాన్ని.
చీజ్, పిజ్జాలు, బర్గర్లు మానేసి.. పండ్లు, ఆకు-కాయగూరలు ఎక్కువగా తింటే చర్మానికి నిగారింపు వస్తుందని వివరించాను. తనకు ఇష్టం లేకున్నా కూడా.. అందం కోసం నేను చెప్పినట్లుగా ఆ ఆహారం బలవంతంగా తీసుకుంది. అందంగా ఉండాలన్న కోరిక దానికి ఎంత బలంగా ఉందో అర్థమైంది. నాకు చాలా బాధనిపించింది. విదేశీయులు తెల్లగా ఉంటారు. మనం నలుపు/చామన ఛాయగా ఉంటాం. ఎవరి రంగు వారిది. శరీర రంగు అనేది మనం ఉంటున్న వాతావరణాన్నిబట్టి ఉంటుంది. అందం అనేది మన మనసులో ఉండాలి, మన ఆలోచనల్లో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి. మన సంతోషమే.. మన అందం అనుకోవాలి. నేను సంతోషంగా ఉన్నప్పుడు.. నా మొఖంలో నిగారింపు (గ్లో) కనిపిస్తుంది. నాకు తెలిసిన గ్లామర్ ‘గ్రామర్’ ఇదే..!
ఇవన్నీ సరే.. రెండుకోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా ఆ యాడ్ ఎందుకు చేయలేదని అడుగుతుంటారు. నేను సాధారణంగా రోజూ రెండు మూడు చపాతీలు, కొంచెం అన్నం, పండ్లు తింటాను. నాకు ఉండడానికి ఇల్లు ఉంది. బయటకు వెళ్లడానికి కారు ఉంది. ఇతరత్రా అవసరాలకు సరిపడినంత డబ్బు ఉంది. ఇది చాలు. నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే.. ఏం చేసుకుంటాను..? కోట్లు వస్తున్నాయని.. ఇప్పటికన్నా ఎక్కువ తినలేను కదా..!
నాకు నచ్చని, నేను ఉపయోగించని, ఏమాత్రం ఉపయోగపడని బ్యూటీ ప్రోడక్ట్ ను అందరూ వాడండని ఎలా ప్రచారం చేస్తాను..? ఒకవేళ అలా చేస్తే.. నా వాళ్లను నేనే మోసగించినట్లు, తప్పుదోవ పట్టించినట్లు కాదా..? అందుకే, ఆ యాడ్ చేయనని చెప్పా..’’ అని వివిధ ఇంటర్వ్యూల్లో వివరించింది. ఇప్పుడు చెప్పండి.. సాయి పల్లవి కేవలం వెండితెర కథానాయకి మాత్రమే కాదని, మనందరి మనసును దోచుకున్న అసలు సిసలు ‘హీరోయిన్’ అని ఒప్పుకోకుండా ఉండగలరా..?!
———
‘తెల్లనివన్నీ పాలు.. నల్లనివన్నీ నీళ్లు’ (నీళ్లు నల్లగా ఉంటాయా..?!) అని అనుకోవద్దని, భ్రమించవద్దని మన పెద్దవాళ్లు చెప్పారు. అందుకే, వ్యాపార ప్రకటనలను గుడ్డిగా నమ్మొద్దు. అలాగే, అందరినీ ఒకే గాటన కట్టేయొద్దు. అందరూ మంచివాళ్లు ఉండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరు. మన సినిమా ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్, చిరంజీవి, సాయిపల్లవి వంటి ఆలోచనాపరులు, సామాజిక బాధ్యత-నిబద్ధత గల వారు కూడా ఉంటారు. వారిని ప్రేమిద్దాం.. ఆరాధిద్దాం.. అభిమానిద్దాం.. అనుసరిద్దాం..! (గుట్కా ప్రచారం పట్ల అమితాబ్ గుట్టుచప్పుడు గాకుండా ఒప్పందం నుంచి దూరం జరిగిపోగా, తాజాగా అక్షయ్‌కుమార్ ప్రజలకు సారీ చెప్పి మరీ బైబై చెబుతున్నట్టు ప్రకటించాడు…)
– సముద్రం
Share this Article