ఏం రాశామనేది, ఎలా రాశామనేది ముఖ్యం కాదు… ఏదో ఒకటి రాసేశామా, జనంలోకి వదిలేశామా అనేదే ముఖ్యమైపోయింది ఈరోజు… జర్నలిస్టు, రచయిత రషీద్ కిద్వాయ్ రాసిన ఓ పుస్తకం, అందులోని కంటెంట్ గురించిన వార్త ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది… సినిమాలకు ట్రెయిలర్లలాగా పుస్తకాల్లోని ముఖ్యమైన కంటెంట్ కొంత భాగాన్ని వార్తలాగా రాసి, ఆ పుస్తకానికి ప్రమోట్ చేయడం కొత్త ట్రెండ్… రషీద్ రాసిన ‘లీడర్స్, పొలిటిషియన్స్, సిటిజెన్స్’ పుస్తకంలోని ఓ భాగం ఇప్పుడు వార్తలాగా, సారీ, ట్రెయిలర్‌లాగా పలకరిస్తోంది…
పోతేపోయింది, ఆయనేదో రాసుకున్నాడులే… చదివేవాడు చదువుతాడు, లేదంటే మూసేసి అటక మీద పారేస్తారు అన్నట్టు ఉండవు కొన్ని… ఎందుకంటే… తను జర్నలిస్టు… గతం తాలూకు కొన్ని సంఘటనలను రాస్తే, ఎవరో ఒకరు నిజమనుకునే అవకాశముంది… ఆ సంఘటనలను తాజాగా సరైన రీతిలో రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఫీలయ్యే ప్రమాదముంది… సంఘటనలకు రిపోర్ట్ చేస్తే కల్పన అందులో అడుగు పెట్టకూడదు… ప్రత్యేకించి దేశ ప్రముఖ నాయకుల గురించి, కీలక సంఘటనల గురించి రిపోర్ట్ చేస్తున్నప్పుడు…
విషయం ఏమిటంటే..? ఇందిరాగాంధీ తన మరణాన్ని ముందే ఊహించినట్టుగా… 14 ఏళ్ల రాహుల్ గాంధీని పట్టుకుని, ఏడవొద్దురా, నువ్వే బాధ్యత తీసుకోవాలిరా అని కోరిందట… ఎవరితోనూ షేర్ చేసుకోని ఎన్నో విషయాల్ని ఆమె తన మనవడితో చెప్పుకునేదట… (జాతీయ రాజకీయాల్లోకి పోవద్దు అని చంద్రబాబుకు లోకేష్ సూచించినట్టు… రాజకీయాల్లోకి రావల్సిందే అని ఎన్టీయార్‌కు చంద్రబాబు సూచించినట్టు అప్పట్లో బోలెడు హాస్యాస్పద వార్తలు వచ్చాయి కదా…)
Ads
ఆ పుస్తకంలో ఇతర కంటెంటు జోలికి మనం ఇక్కడ పోనక్కర్లేదు గానీ… ఇందిర హత్యకే పరిమితమవుదాం… ఎస్, ఆపరేషన్ బ్లూస్టార్ తరువాత ఆమె బాడీగార్డుల నుంచి సిక్కులను తొలగించాలనీ, అదనపు భద్రత చర్యలు అవసరమనీ ఉన్నతాధికారులు చెబితే, ఇందిర తిరస్కరించారనీ, ఏళ్లుగా తన వెంట ఉన్న బియాంత్ సింగ్‌ను తానెలా అనుమానించగలననీ అడిగింది… అంతేకాదు, అంతకుముందురోజు ఎక్కడో ఓ సభలో మాట్లాడుతూ ‘‘ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు… కానీ ఈ దేశం కోసం నా రక్తం ధారబోయగలిగితే గర్విస్తాను’’ అని ఉద్వేగానికి గురైంది… అవి అప్పట్లోనే వార్తల్లో రిపోర్టయ్యాయి… (ఆమెలోని ఏదో ఇన్‌స్టింక్ట్ ఏదో ప్రమాదాన్ని గుర్తుచేసి ఉండొచ్చు…)
ఉదయం నిద్రలేచాక… తన రొటీన్ ఆరోగ్య పరీక్షలు, ఏదో డాక్యుమెంటరీ షూటింగ్ కోసం కాస్త మేకప్ కాగానే ఆమె తన క్యాంప్ ఆఫీసు వైపు బయల్దేరింది… ఆమెపై కాల్పులు జరిగింది 9.10 నిమిషాలకు… మొత్తం 33 బుల్లెట్లు… ఆమె దేహాన్ని జల్లెడ చేశాయి… కుప్పకూలిందామె… ఇక మాట లేదు, బొందిలో ప్రాణం ఉందో లేదో తెలియదు… 9.20కల్లా ఓ కారులో ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు… అప్పటికే ఆమె కన్నుమూసినట్టు చెబుతారు… బీబీసీ ఆమె మరణవార్తను బ్రేక్ చేసేవరకు ఆమె మరణాన్ని అధికారికంగా ప్రకటించలేదు…
మరి రాహుల్ గాంధీని పట్టుకుని… ‘‘నేను చనిపోతే నువ్వే ఏడవొద్దురా, నువ్వే బాధ్యతలు తీసుకోవాలి’’ అని ఎప్పుడు చెప్పినట్టు..? ప్రియాంక ఈ జర్నలిస్టుకు చెప్పిందట… ‘‘మేం స్కూల్‌కు వెళ్తుంటే ఈ మాటలు చెప్పింది’’ అని..! ప్రపంచ రాజకీయాల్ని, అత్యంత సంక్లిష్టమైన భారత రాజకీయాల్ని, వ్యక్తుల్ని, తత్వాలను వడబోసిన మహామేధావి ఆమె… అలాంటి పద్నాలుగేళ్ల పిల్లాడిని ఏం బాధ్యత తీసుకోవాలని కోరింది, తనలోని ఏ దృఢతత్వాన్ని ఆమె అప్పటికే గుర్తించింది ఆమె..? ఆశ్చర్యంగా లేదా..?
అబ్బే, ఇందిరాగాంధీ రాహుల్‌తో అలా మాట్లాడలేదు అని ఖండించేవాళ్లు ఎవరూ ఉండరు… రాహుల్ గొప్పనాయకుడు కాబోతున్నాడని అప్పట్లో ఇందిర గుర్తించి, బాధ్యత నువ్వే తీసుకోవాలని కోరిందని రాస్తే… నో, నో, అలా ఏమీ చెప్పలేదు అని రాహుల్ గానీ, తాను అలా చెప్పలేదని ప్రియాంక కూడా ఖండించరు కదా… సో, పుస్తకంలో మిగతా 49 ఎపిసోడ్ల నాణ్యత ఏమిటో కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందిగా…!!
Share this Article