పార్ధసారధి పోట్లూరి ….. రష్యా ఆయుధాల పని తీరు మీద ఒక విశ్లేషణ !
చైనా నావీ కి ముప్పు తప్పదా ? జిన్ పింగ్ కి శృంగభంగం తప్పదా ?
రష్యా నావీకి చెందిన క్రూయిజర్ ‘మాస్కోవ’ ని నల్ల సముద్రంలో ముంచేసిన ఉక్రెయిన్ కి చెందిన ‘నెప్ట్యూన్’ యాంటీ షిప్ మిసైళ్ళు గత సోవియట్ యూనియన్ కు చెందిన పాత తరం మిసైళ్ళు… సోవియట్ యూనియన్ జమానాలో నెప్ట్యూన్ మిసైళ్ళు తయారీ కేంద్రం ఉన్నది ఉక్రెయిన్ లోనే… రష్యన్ దళాలు గత ఫిబ్రవరి 24 న దాడి మొదలుపెట్టినప్పుడు ఉక్రెయిన్ లో ఉన్న అన్నీ ఆయుధ తయారీ పరిశ్రమల మీద మొదటగా దాడి చేసి వాటిని ధ్వంసం చేశాయి… వాటిలో నెప్ట్యూన్ మిసైళ్ళ తయారీ ఇండస్ట్రీ కూడా ఉంది…. అలాంటిది ఉక్రెయిన్ కి నెప్ట్యూన్ మిసైళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి… ? గత పోస్ట్ లో వివరించినట్లుగా పాత స్టాక్ ని బయటికి తీసి వాటిని మరింత అభివృద్ధి పరిచి ప్రయోగించినట్లు చెప్పింది అబద్ధం ! నలు వైపుల నుండి రష్యన్ దళాలు దాడి చేస్తున్న సమయంలో అదీ విద్యుత్ సరఫరా నిలిపివేసిన సమయంలో నెప్ట్యూన్ ని మళ్ళీ అభివృద్ధి పరిచామని ఉక్రెయిన్ చెప్తున్నది అబద్ధం !
Ads
నాటో దళాలు రహస్యంగా పోలాండ్ నుండి ఉక్రెయిన్ లోకి ‘హార్పూన్ ‘ యాంటీ షిప్ మిసైళ్ళ ని పంపించాయి! కేవలం ‘హార్పూన్ ‘ మిసైళ్ళు మాత్రమే రష్యన్ క్రూయిజర్ మాస్కోవా ని ధ్వంసం చేయగలవు. నెప్ట్యూన్ మిసైళ్ళు మాస్కోవ ని దెబ్బ తీయగలవు కానీ ఏకంగా ముంచివేయగల శక్తి గలవి కావు!
అసలు నిజం !
టర్కిష్ డ్రోన్లు ‘బైరాక్టర్’ లు మూడు చాలా దూరం నుండి మాస్కోవా దృష్టి మరలుస్తూ అదే సమయంలో లేజర్ బీమ్ ని మాస్కోవ మీదకి గురి పెట్టాయి. ఉక్రెయిన్ భూభాగం నుండి హార్పూన్ మిసైళ్ళు దాడి చేయడానికి వచ్చినప్పుడు టర్కిష్ డ్రోన్లు స్పాట్ చేసిన లేజర్ బీమ్ ఆధారంగా మాస్కోవ ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా గైడ్ చేశాయి హార్పూన్ మిసైళ్ళ కి దాంతో టార్గెట్ ని ఛేదించాయి హార్పూన్ మిసైళ్ళు.
కోల్డ్ వార్ సమయంలో దాదాపుగా అన్నీ యుద్ధ నౌకల పైన ఉండే కవచం ‘హల్ ‘ ని మూడు అంగుళాల మందం కలిగిన ఉక్కుతో తయారుచేసేవారు. అప్పట్లో యాంటీ షిప్ మిసైళ్ళు మూడు అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచం ని ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళి పేలేవి కావు. కాబట్టి రక్షణగా మూడు అంగుళాల ఉక్కు కవచంని ‘హల్’ కోసం వాడేవారు. అదే సమయంలో తయారు చేసిన నెప్ట్యూన్ మిసైళ్ళు మాస్కోవా హల్ ని ఎలా ఛేదించుకుంటూ లోపలికి చొచ్చుకుపోయి పేలిపోగలవు ? ఇప్పటి హార్పూన్ మిసైళ్ళు థర్డ్ జెనెరేషన్ వి అంటే దాదాపుగా 7 అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచం ‘హల్ ‘ ని ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళి పేలిపోగల సామర్ధ్యం కలిగి ఉన్నాయి. కాబట్టి మాస్కోవ ని ముంచి వేసింది నెప్ట్యూన్ మిసైళ్ళు కాదు అవి హార్పూన్ మిసైళ్ళ పనే !
చైనాకి ఆందోళన ఎందుకు ?
చైనా మొదట్లో రష్యా నుండి కార్వేట్టీ లని, ఫ్రిగేట్ లని,డిస్ట్రాయర్ లని కొని తరువాత కాలంలో వాటిని రివర్స్ ఇంజినీరింగ్ చేసి స్వంతంగా తయారు చేసుకున్నది. అదే సమయంలో వాటి హల్ ని మరింత మందం కలిగిన అంటే 4 అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచంని అమర్చింది. అవి తయారు చేసే సమయానికి 4 అంగుళాల మందం కలిగిన ఉక్కు హల్ ని అమర్చడం మంచిదే ! కానీ ఇప్పటి కొత్త తరం యాంటీ షిప్ మిసైళ్ళు 7 అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచంని కూడా ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళి పేలిపోగలవు ! అందుకే అమెరికాతో పాటు నాటో దేశాలు తమ యుద్ధ నౌకలని 8 అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచంతో తయారు చేసుకున్నాయి ఎందుకంటే తమకి శత్రువులు అయిన రష్యా, చైనా, ఇరాన్ దేశాల యాంటీ షిప్ మిసైళ్ళు 8 అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచంని ఛేదించ లేవు.
చైనా తైవాన్ మీద దాడి చేసి స్వాధీనం చేసుకోగలదా ?
ఒకటికి పది సార్లు ఆలోచించాలి !
తైవాన్ చుట్టూ సముద్రం ఉన్న ద్వీప దేశం… అంటే పూర్తిగా యుద్ధ విమానాలతో పాటు తన విమాన వాహక నౌక అయిన ‘లియోనిన్గ్’ [Liaoning ] ని మోహరించాల్సి ఉంటుంది. అయితే విమాన వాహక నౌకతో పాటు దానికి రక్షణగా ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్ ని మొహారించాల్సి ఉంటుంది. తైవాన్ ని స్వాధీనం చేసుకోవాలి అంటే చైనా తన విమాన వాహక యుద్ధ నౌకని [Carrier Battle Group ] ని మోహరిస్తే అవి తైవాన్ కి అమెరికా సప్లై చేసిన అధునాతన హార్పూన్ మిసైళ్ళ ని తట్టుకొని నిలబడగలవా ? కష్టమే ! ఒకసారి చైనా లియోనిన్గ్ విమాన వాహక యుద్ధ నౌక గురుంచి తెలుసుకోవాలి ముందు !
1998 లో చైనాకి చెందిన ఒక డమ్మీ కంపనీ ఉక్రెయిన్ లో ఉన్న ‘వార్యాగ్ ‘ [Varyag ] అనే పేరుతో పాడుబడిన విమాన వాహక నౌకని స్క్రాప్ కింద కొన్నది! ఈ వార్యాగ్ విమాన వాహక నౌక చాలా పాతది… సోవియట్ జమానాలో ఇది ఉక్రెయిన్ సముద్ర తీరంలో తుక్కు కింద వదిలేశారు. ఉక్రెయిన్ దానిని అమ్మాలని చూసింది కానీ కొనేవాళ్ళు లేక అలా వదిలేసింది… దానిని చైనా కొన్నది. చైనా డమ్మీ కంపనీ ‘వార్యాగ్ ‘ [Varyag ] ని చైనా నావీకి అమ్మింది 2002 లో…. చైనాకి చెందిన ఇంజినీర్లు ‘వార్యాగ్ ‘ [Varyag ] ని కొత్తగా మళ్ళీ నిర్మించారు కానీ బేస్ మాత్రం అలానే ఉంచారు. మిగతా పరికరాలు చైనా తాను రష్యా నుండి సేకరించిన సమాచారం ఆధారంతో నావిగేషన్, ఎలెక్ట్రానిక్స్ ఇతర వ్యవస్థలని అమర్చి దానికి ‘లియోనిన్గ్’ [Liaoning ] అనే పేరు పెట్టి 2012 లో జల ప్రవేశం చేయించింది !
నిర్మాణం మొదలుపెట్టిన 2002 లో ఇప్పటి అధునాతన యాంటీ షిప్ మిసైళ్ళు ఎంత మందం కలిగిన హల్ ని ఛేదిస్తాయో ఊహించలేదు కాబట్టి హల్ ఎన్ని అంగుళాల మందం కలిగిన ఉక్కుతో తయారుచేయాలో అనే విషయం పట్టించుకోకుండానే తమకీ ఒక విమాన వాహక యుద్ధ నౌక ఉంది అని అనిపించుకోవడానికి తయారు చేసింది ‘లియోనిన్గ్’ [Liaoning ] ని… ఇదంతా భవిష్యత్తులో క్రూయిజ్ మిసైళ్ళు, యాంటీ షిప్ మిసైళ్ళు ఎంత మందం కలిగిన ఉక్కు కవచాన్ని ఛేదించగలవో అనే లెక్కని ఆధారం చేసుకొని కనీసం 20 ఏళ్లు గట్టిగా నడవగలిగే విధంగా నిర్మించాల్సి ఉంటుంది…
‘లియోనిన్గ్’ [Liaoning ] విమాన వాహక యుద్ధ నౌకతో పాటు దానికి రక్షణగా నిలిచే ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్ సామర్ధ్యం మీద పలు అనుమానాలు ఉన్నాయి. చైనా వార్యాగ్ నే కాకుండా ఇంకో రెండు విమాన వాహక యుద్ధ నౌకలు అయిన ‘కీవ్ ‘, మినస్క్ లని కొన్నది ఉక్రెయిన్ నుండి… కీవ్, మినస్క, మాస్కోవ లు మూడు కూడా సోవియట్ జమానాలో ఇప్పటి ఉక్రెయిన్ లో ఉన్న మికొలైవ్ [Mykolaiv ] పోర్ట్ లో నిర్మించబడ్డాయి ! కీవ్, మినస్కా లని రీసర్చ్ చేసి వార్యాగ్ ని లియోనింగ్ గా నిర్మించింది చైనా… సోవియట్ కాలం నాటి కీవ్, minsk, మాస్కోవ లాంటి వాటిని చూసి చైనా ఇంజినీర్లు రివర్స్ ఇంజినీరింగ్ చేసి ఫైనల్ గా లియోనింగ్ ని నిర్మించారు! 20 ఏళ్ల నాడు చేసిన రివర్స్ ఇంజినీరింగ్ తో నిర్మింపబడ్డ లియోనింగ్ పని తీరు మీద ఇప్పుడు సందేహాలు ఉన్నాయి…
ఎక్కడ లోపాలు ఉన్నాయి ?
ఏప్రిల్ 24 న బ్లాక్ సీ లో ఉన్న రష్యన్ క్రూయిజర్ ని ముంచివేసిన యాంటీ షిప్ మిసైళ్ళు అత్యాధునికమైనవి ! ఉక్రెయిన్ చెప్తున్నట్లు అవి నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్ళు కాదు! మాస్కోవ అనేది ఫ్రిగేట్ కాదు, డిస్ట్రాయర్ కాదు! దాదాపుగా రెండు ఫుట్బాల్ మైదానాల అంత పెద్దది మాస్కోవ ! ఫ్రిగేట్, డిస్ట్రాయర్ లు చేసే రెండు పనులనూ క్రూయిజర్ అయిన మాస్కోవా చేయగలదు. అలాంటిది మాస్కోవా ని ఎలా ముంచివేయగలిగింది ఉక్రెయిన్ ? రష్యన్ రాడార్ల పని తీరు మీద ఎలాంటి సందేహాలు లేవు ఇప్పటివరకు, కానీ ఇప్పుడు చాలా సందేహాలకి తావు ఇస్తున్నది మాస్కోవ ఉదంతం !
మాస్కోవ మీద పలు రకాల బాండ్లు కల చాలా రాడార్లు ఉన్నాయి కానీ యాంటీ షిప్ మిసైళ్ళు తన మీదకి వస్తున్న సంగతిని ఎందుకు పసిగట్టలేక పోయాయి ? పోనీ యాంటీ షిప్ మిసైళ్ళు sea స్కీమ్మింగ్ టెక్నిక్ ని వాడి రాడార్లని బోల్తా కొట్టించాయి అనుకుందాం కానీ ఫైనల్ స్టేజ్ లో ప్రతిస్పందించాల్సిన CIWS [Close In Weapon System ] సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు ? CIWS అనేది యుద్ధ నౌక మీద ఉండే అన్నీ రక్షణ వ్యవస్థలని తప్పించుకొని మీదకి వచ్చే యాంటీ షిప్ మిసైళ్ళ ని చివరి క్షణంలో సెకను కి దాదాపుగా వెయ్యి బులెట్లని ఒక తెర లాగా ప్రయోగించగల సామర్ధ్యం ఉంటుంది… కానీ CIWS కూడా పని చేయలేదు ఎందుకు ? ఈ CIWS కి అనుసంధానంగా చిన్న రాడార్ కూడా ఉంటుంది నౌక మీదకి వచ్చే క్షిపణులని ట్రాక్ చేసి ఎటువైపు ఫైర్ చేయాలో నిర్దేశిస్తుంది. ఇవేవీ పని చేయలేదు మాస్కోవ లో… మరో విషయం ఏమిటంటే కీవ్, minsk లాంటి యుద్ధ నౌకల డిజైన్ ని కాపీ కొట్టి మరీ తన స్వంత పరిజ్ఞానంతో తయారు చేసిన చైనా విమాన వాహక యుద్ధ నౌక లియోనింగ్ ఇప్పటి మారిన పరిస్థితుల్లో ఎంతవరకు అమెరికన్, యూరోప్ మిసైళ్ళ ని ఎదుర్కొని నిలబడగలదు?
తైవాన్ మీద చైనా దాడి చేసే ఆలోచన చేయదు!
ఎందుకంటే ఒక్క చైనా మాత్రమే కాదు, భారత్ తో సహా మిగతా దేశాలు చాలా ఆసక్తిగా అక్కడ జరుగుతున్న వాటిని పరిశీలిస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలు రెండూ దాదాపుగా ఒకే తరహా టాంక్ లు, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లని వాడుతున్నాయి… కానీ విజయం రెండు దేశాల మధ్య దోబూచులాడుతూనే ఉన్నది రెండు నెలలు అయినా ! అసలు ఉక్రెయిన్ కి నౌకా దళం అంటూ ఏదీ లేకపోయినా మాస్కోవా ని దెబ్బ తీయడం అనేది అతి పెద్ద విజయం. ఆఫ్ కోర్స్ ! అమెరికాతో పాటు నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ సహాయం చిన్నదే కానీ వ్యూహాలు మాత్రం చాలా పెద్దవి.
రష్యా ఇప్పటి వరకు రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి ’బ్రూట్ ఫోర్స్’ అనే వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నది… అంటే క్వాలిటీ లేకపోయినా అధిక సంఖ్యలో యుద్ధ టాంకులు, విమానాలతో దాడి చేయడం brut force ప్లాన్ అంటారు కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇది వర్కవుట్ కాదని తేలిపోయింది. చైనాది కూడా అదే వ్యూహం. లడక్ సరిహద్దుల్లో చైనా అనుసరించిన వ్యూహం కూడా బ్రూట్ ఫోర్స్ ! కానీ అది విఫలం అయ్యింది అని మనం చూశాం !
తైవాన్ కి భూమితో సరిహద్దు లేదు చైనాకి. కేవలం సముద్రం నుండి ఆకాశం నుండి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది… కానీ వెస్ట్రన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుండి తప్పించుకొని చైనా యుద్ధ విమానాలు తైవాన్ మీద దాడి చేయగలదా ? కష్టం! అలాగే సముద్రం మీద నుండి తన నౌకా బలంతో దాడి చేయగలదా ? ఫ్రెంచ్ ఎక్సోసెట్ MM 40 అనేది అధునాతన యాంటీ షిప్ మిసైల్ , అలాగే అమెరికన్ హార్పూన్ మిసైళ్ళు కూడా ఆధునికమయినవే ! ఈ రెండూ కూడా 7 అంగుళాల మందం కలిగిన ఉక్కు కవచంని తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ధ్వంసం చేయగలవు కాబట్టి చైనా నౌకా దళానికి ముప్పు తప్పదు. నేరుగా తన స్వంత టెక్నాలజీతో తయారు చేసిన రష్యా యుద్ధ నౌక విఫలం అయినప్పుడు రివర్స్ ఇంజినీరింగ్ చేసిన చైనా యుద్ధ నౌకలు నిలబడలేవు !
అమెరికా వ్యూహకర్తల ఆలోచన వేరు ! ఉక్రెయిన్ కి సహాయం చేస్తున్న నెపంతో రష్యా ఆయుధాల పని తీరుని అంచనా వేయడానికే దాదాపుగా రెండు బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుద్ధాలని ఇస్తున్నది ఉక్రెయిన్ కి… ముఖ్యంగా యుద్ధ టాంకుల పని తీరుని బాగానే పసిగట్టింది అమెరికా తన జావెలిన్ యాంటీ టాంక్ గైడెడ్ మిసైళ్ళతో… మొదట్లో రష్యా ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ ని తన అదుపులోకి తీసుకున్నా నెల తిరగకుండానే ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మీద పట్టు కోల్పోయింది రష్యా… అమెరికాతో పాటు బ్రిటన్ ఇచ్చిన తక్కువ దూరం ప్రయాణించగల స్టిoగర్ మిసైళ్ళు రష్యాకి చెందిన హెలికాప్టర్ల తో పాటు భూమీద టార్గెట్లని ధ్వంసం చేయగల Su.24 లని కూడా కూల్చివేయగలిగింది ఉక్రెయిన్… ఇవన్నీ కూడా తైవాన్ మీద చైనా దాడి చేస్తే ఎలాంటి ఆయుద్ధాలని ప్రయోగించి తైవాన్ ని రక్షించ వచ్చో ఒక ప్రయోగం లాంటిది అమెరికాకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం! జస్ట్ ఉక్రెయిన్ లాగానే తైవాన్ విషయంలో కూడా అమెరికా నేరుగా కలుగచేసుకోదు, కేవలం ఆయుధాలు,శిక్షణ ఇచ్చి చోద్యం చూస్తుంది.
బయటి ప్రపంచానికి కంటే చైనాకే ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం గురించి బాగా తెలుస్తున్నది! తాను రివర్స్ ఇంజినీరింగ్ చేసిన రష్యా ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయో ఇప్పటికే ఒక స్పష్టమయిన చిత్రం చైనా ముందు ఉంది. మందలు మందలుగా నైపుణ్యం లేని వాళ్ళని యుద్ధానికి పంపిస్తే ఉపయోగం ఉండదు అన్న సత్యం బోధపడింది చైనాకి… అందుకే చెప్పా పెట్టకుండా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకి వచ్చాడు !
ఆయిల్,సహజ వాయువు విషయంలో అమెరికాతో పాటు నాటో దేశాలకి ఉక్రెయిన్ చాలా ముఖ్యం… అలాగే సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలో అమరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కి తైవాన్ చాలా ముఖ్యం. ఒకసారి తైవాన్ కనుక చైనా అధీనంలోకి పోతే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి తైవాన్ ని తమ మొత్తం శక్తి యుక్తులని వాడి రక్షణగా నిలబడతాయి కాబట్టి చైనా ఇప్పట్లో తైవాన్ మీద దాడి చేసే సాహసం చేయకపోవచ్చు….
Share this Article