ఏముంది ఆ పొరుగు రాష్ట్రంలో..? కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం… అని కేటీయార్ ఎంతగానో ఏపీలో జగన్ పాలన తీరును వెక్కిరించవచ్చుగాక… తరువాత తానే తప్పయిపోయింది అని స్వీయఖండన చేసుకోవచ్చుగాక… జగన్ మంత్రులు వెంటనే కేటీయార్‌పై విరుచుకుపడవచ్చుగాక… కానీ జగన్ పాలనాధికారులు మాత్రం నిర్వికారంగా కేసీయార్‌ను మస్తు మెప్పించే పనులే చేస్తుంటారు సుమా… తేడా రానివ్వరు… పొరుగురాష్ట్ర పాలకుడి మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు…
ఓ చిన్న ప్రశ్న… తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై ఏపీ ప్రభుత్వానికి ఏమవుతుంది..? ఏమీ కాదు…! ఆ రాష్ట్రానికి వెళ్తే అఫిషియల్ గెస్టు… ఓ రాష్ట్ర గవర్నర్ కాబట్టి కాస్త ప్రోటోకాల్… అంతేకదా… కానీ ఏపీ ఉన్నతాధికారులకు అవన్నీ జాన్తానై… హఠాత్తుగా రాష్ట్రపతి, శారదా పీఠాధిపతి స్వరూపానంద ఒకేసారి వచ్చారని అనుకుందాం ఓ గుడికి… ఏపీ దేవాదాయ శాఖ స్వరూపానందకే సాగిలబడుతుంది… రాష్ట్రపతి, ప్రధాని ఎవరొచ్చినా సరే, స్వరూపుడి తరువాతే… ఎందుకు..?
స్వరూపుడు రాజగురువు… తెలుగు లోకంలో జనమెల్లరికీ జగన్ ముద్దులు పెట్టి, వోట్లు కొల్లగొడితే… అంతటి జగన్‌కే ముద్దులు పెట్టి స్వరూపుడు ఈ ప్రభుత్వం మీద అపరిమిత గ్రిప్ కొల్లగొట్టాడు కాబట్టి… స్వాములు, సన్యాసులు ఎంతటి పాలకశిష్యులైనా ఆలింగనం చేసుకుని, ఆత్మీయ చుంబనాలు ప్రసాదించవచ్చా అనేది వేదాలు, ధర్మసూక్ష్మాలు తెలిసినవాళ్లు మాత్రమే తేల్చాల్సిన ప్రశ్న కాబట్టి దాన్నలా వదిలేద్దాం…
Ads
ఇప్పుడు వార్త ఏమిటంటే..? సింహాచలంలో నిన్న చందనోత్సవం జరిగింది కదా… ఆ గుడికి ప్రతి ఏటా అదే పెద్ద ఈవెంటు… రాజు వెడలె అన్నట్టుగా స్వరూపానందుడు అట్టహాస, పటాటోపాలతో ఆ గుడికి వేంచేశాడు… దైవభక్తి ఉన్న తెలంగాణ గవర్నరమ్మ తమిళిసై కూడా ఓ భక్తురాలిగా సింహాచలం వచ్చింది… వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌కు ప్రాధాన్యం, గౌరవం దక్కాలి… కానీ ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు స్వరూపుడికి మాత్రం ఆకుపచ్చ తివాచీ పరిచేశారు…
ఇదీ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసిన వార్త… స్వరూపుడు వస్తే సాక్షాత్తూ ఈవో సూర్యకళ ఎదురేగి, స్వాగతం పలికి, భక్తిప్రపత్తులతో లోపలకు తీసుకెళ్లి దర్శనం చేయించెనట… స్వయంగా వీడ్కోలు పలికెనట… ఆయన విచ్చేసిన రథం, అనగా వాహనాన్ని రాజగోపురం దాకా అనుమతించారు… సమయానికి పల్లకీలు దొరకలేదేమో, లేకపోతే అందులో ఎక్కించి, సన్నాయి వాయిద్యాలతో గర్భగుడి వరకూ తీసుకువెళ్లేవారేమో…
కానీ తెలంగాణ గవర్నరమ్మకు దక్కిన గౌరవం ఏమిటో తెలుసా..? రాజగోపురానికి దూరంగా ఓ పీఆర్వో ఆఫీసు ఉంటుంది… అక్కడ ఆపేశారట… దేవాదాయ శాఖ అంటేనే అధర్మం కదా… ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమెను నడిపించుకుంటూ గుడిలోకి తీసుకెళ్లెనట… మరి ఈవో..? ఏముంది..? అస్సలు పట్టించుకోలేదు… పట్టించుకుని నెత్తిమీద పెట్టుకోవడానికి ఆమె ఏమైనా రాజగురువా..? కాదు కదా…!!
ప్చ్… కేసీయార్‌కు, కేటీయార్‌కు, సమస్త గులాబీ శ్రేణులకు, తెలంగాణ అధికారులకు తమిళిసై ఓ బీజేపీ నాయకురాలిగా కనిపించవచ్చుగాక… కేసీయార్ అగ్గిమండుతున్నాడు కాబట్టి ఆమెను అందరూ అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు… మరి ఏపీలో ప్రభుత్వానికి ఆమెపై ఏం కోపం..? ఇదేం అగౌరవం..? ఇదీ ఓరకమైన అవమానమే… పోనీలెండి, వదిలేద్దాం, లేకపోతే ఏ దేవాదాయ మంత్రో మీడియా ముందుకొచ్చి, ఇంకేమైనా అంటాడేమో…!!
Share this Article