ఈమధ్య కరోనా చుట్టుముట్టాక అందరికీ ఆరోగ్యస్పృహ పెరిగింది… ప్రొటీన్లు, విటమిన్లు ఇచ్చేవి, ఇమ్యూనిటీ పెంచే ఆహారం మీద ధ్యాస కూడా పెరిగింది… ఆహారమే ఔషధం అనే కాన్సెప్టు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది… కాకపోతే ప్రాబ్లం ఏమిటంటే… సైట్లు, యూట్యూబర్స్ ఇచ్చే కథనాలను నమ్మేసి, గుడ్డిగా ఫాలో అవుతున్నారు కొందరు… ఏ జాగ్రత్తలూ తీసుకోకుండానే… అర్ధ పాండిత్యం ప్రాణాంతకం అన్నట్టుగా ఆ స్టోరీలతో కొన్నిసార్లు ప్రమాదం తలెత్తే అవకాశాలున్నాయి… ఉదాహరణకు బీట్‌రూట్…
మనకు అందుబాటులో ఉన్న కాయగూరలు, దుంపల్లో బీట్‌రూట్ స్థానం చాలా గొప్పది… డౌట్ లేదు… ప్రత్యేకించి దేశంలో రక్తహీనత పెరుగుతోంది… రుతుస్రావ సమస్యలున్న మహిళల్లో ఈ సమస్య మరీ పెరుగుతోంది… వాళ్లకు బీట్‌రూట్ దివ్యౌషధం… పొటాషియం, మెగ్నీషియం, బీ6 విటమిన్, ఐరన్ పుష్కలం…
అందుకే చాలామంది జ్యూస్ చేసుకుని, తేనె లేకపోతే నిమ్మరసం కలిపేసి తీసుకుంటున్నారు… కొందరు నేరుగా వెజ్ సలాడ్లలో భాగం చేస్తున్నారు… మరికొందరైతే కట్ చేసుకుని, ఆ ముక్కల్ని యథాతథంగా నమిలేస్తుంటారు… ఇంకొందరు దాంతో రకరకాల ఫుడ్ రెసిపీలు చేసుకుంటారు… అయితే కొందరికి ఈ బీట్‌రూట్ పడదు… అదీ తెలుసుకోవాలి…
Ads
- ఇందులో పొటాషియం ఎక్కువ… అందుకని లోబీపీ సమస్య ఉన్న రోగులకు బీట్‌రూట్ పనికిరాదు… అకస్మాత్తుగా బీపీ ఇంకా డౌనయ్యే ప్రమాదం ఉంది…
- బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అధికం కాబట్టి మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవాళ్లకు ఇది డైట్‌లో పనికిరాదు… ఆ సమస్య పెరిగే ప్రమాదం ఉంది…
- పలురకాల అలర్జీలతో బాధపడేవారికి కూడా బీట్‌రూట్ సమస్యాత్మకం కావచ్చు కొన్నిసార్లు… చర్మం దద్దుర్లు, ఇతరత్రా అలర్జీ లక్షణాలు పెరిగే ప్రమాదం ఉంది…
- బీట్‌రూట్ అధిక గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది… అందుకని సుగర్ పేషెంట్లకు ఇది ప్రాబ్లమాటిక్… అకస్మాత్తుగా సుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది…
ఈ సమస్యలు లేనివాళ్లు మాత్రం ఎంచక్కా బీట్‌రూట్‌ను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు… నేరుగా తినడాన్ని చాలా మంది ఇష్టపడరు… ఎప్పుడూ జ్యూస్ తాగడమూ ఇష్టముండదు… అందుకని బీట్‌రూట్‌తో హల్వా, కూరలు, పరోటాలు గట్రా చేసుకుంటారు… ఇంకా టేస్టీగా బీట్‌రూట్ ఎంజాయ్ చేయడానికి బీట్‌రూట్ ఫ్రైడ్ రైస్ చాలా బెటర్… చాలా సింపుల్ కూడా… ఇతరత్రా వెజిటబుల్స్ కలిపితే హెల్దీ రెసీపీ అవుతుంది కూడా…
మిగిలిపోయిన అన్నం ఉందా..? సరే… లేదంటే తాజాగా వండుకొండి… అందులో సరిపడా ఉప్పు ముందే కలిపి పెట్టుకొండి… మరోవైపు బీట్‌రూట్ తురుం రెడీగా ఉంచుకొండి… ఓ గిన్నెలో కాస్త నూనె పోసి, ఎప్పటిలాగే కాసిన్ని ఆవాలు, జిలకర వేయండి… అందులో కొన్ని పల్లీలు పచ్చి శెనిగె పప్పు వేసి కాసేపు వేగనివ్వండి… ఎలాగూ ఉల్లిపాయలు వేస్తాం కదా… రుచికి సరిపడా పచ్చి మిర్చిని నిలువునా చీల్చి వేసేయండి… అప్పుడు ఈ బీట్‌రూట్ తురుం వేసి, కాస్త పసుపు తగిలించి కొంతసేపు ఉడకనివ్వండి…
ఇష్టముంటే కాస్త అల్లం వెల్లుల్లి వేస్తే చాలు… ఏ ఇతర మసాలాలూ వద్దు… యూట్యూబ్ వీడియోలు చూస్తే ధనియాల పొడి, చాట్ మసాలా, కారం ఎట్సెట్రా ఏవేవో వేయమంటారు… అలా చేస్తే బీట్‌రూట్ ఒరిజినల్ టేస్ట్ పోతుంది… ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు గట్రా యాడ్ చేసేకొద్దీ అసలు టేస్ట్ మారిపోతుంది… సో, గిన్నెలో మిశ్రమంలో ఉప్పు కలిపిన అన్నం మొత్తం కలగలపండి… అంతే… బీట్‌రూట్ తురుం బదులు చిన్న చిన్న ముక్కలు వాడినా బాగానే ఉంటుంది… కొందరు పోపులోనే బీట్‌రూట్ ముక్కలు వేసేసి, బియ్యం, నీళ్లు పోసి కుక్కర్‌లో కిచిడీలాగా వండుకొమ్మని చెబుతారు… అది మరీ పథ్యం చప్పిడి కూడులా ఉండే ప్రమాదం ఉంది… అన్నట్టు మరోసారి హెచ్చరిక… పైన చెప్పిన రోగసమస్యలు లేనివారికి మాత్రమే ఈ బీట్‌రూట్… బెటర్‌రూట్… బెస్ట్‌రూట్…!!
Share this Article