Padmakar Daggumati…………… “నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు” అనే డైలాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఏ సినిమాలో విలన్ కి మొదటగా రాశారోగాని చాలా బలంగా నాటుకుపోయే నెగటివ్ డైలాగ్ అది. అది అంతర్గతంగా చాలా మొండి పట్టుదలని ప్రేరేపించే డైలాగ్. ఎవరు ఔనన్నా కాదన్నా సంస్కారం నేర్పే వనరులు పూర్తిగా కనుమరుగు ఐపోయి, సినిమాలు, టీవీలు ఏం నేర్పితే అవే సాంస్కృతిక విలువలుగా మారి దశాబ్దాలు అయ్యింది.
పెళ్లికాని అమ్మాయి అంటే పెళ్లికాని అబ్బాయిలాగే ఊహలతో కలలతో పెరుగుతుంది. అబ్బాయిలు నాకు ఈ అమ్మాయితో జీవితం బాగుంటుంది అనుకోవడం తప్పుకాదు. ఐతే, ఈ అబ్బాయితో నా జీవితం బాగుంటుంది అని అమ్మాయి కూడా అనుకునేలాగా ప్రవర్తించడం ఎలా? ఇది ఎవరు నేర్పాలి అబ్బాయిలకి?
“నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు” అనే డైలాగ్ యువతకి పంతం పట్టడం నేర్పినప్పుడు సినీ రచయితలు ఒకటి గుర్తుంచుకోవాలి. అమ్మాయి మనసు చూరగొనడం కూడా నేర్పాలి కదా. ఈ పని మాత్రం హీరోలతో చేయిస్తారు.
Ads
అమ్మాయిలు అంటే దక్కించుకోవడానికి వస్తువులా..? ఇంకెవరికీ దక్కకుండా చేయడానికి ఆ అమ్మాయికి, పేరెంట్స్ కి లేని హక్కు నీకేం ఉంది. ఈ వాదన సంస్కారం నేర్పేది ఆలోచింపచేసేది ఎవరు? పోలీసుల పరిశోధన తుపాకీ చుట్టూ మాత్రమే తిరుగుతుంది. అయితే అన్నేళ్లు కష్టపడి చదివి, చక్కటి సాఫ్టువేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ఆ అబ్బాయిని హత్యకి, ఆత్మహత్యకి పురికొల్పిన కారణాలపై పరిశోధన సమాజంలో ఎవరు చేయాలి? తుపాకీది ఏముంది? తుపాకీ కాకపోతే కత్తితో పొడుస్తాడు. అదీ కాకపోతే బ్లేడుతో గొంతు కోస్తాడు.
ఇంతకీ ఆ అబ్బాయి అమ్మాయిని చంపాలని మాత్రమే అనుకున్నాడా? తనుకూడా చనిపోవాలని ముందే అనుకున్నాడా? ముందే అనుకుంటే అక్కడే కాల్చుకుని చనిపోయేవాడు కదా! అంటే ఆ అమ్మాయిని చంపేశాక దిక్కుతోచని స్థితిలో లోకానికి భయపడి చనిపోయాడు. అంటే హత్యకి ముందు తానొక హీరోనని అనుకున్నాడు. తర్వాత తాను విలన్ని అని గ్రహించాడు.
తాను కోరుకున్నది తనకి దక్కాల్సిందే అనుకునే ఇలాంటి ఆవేశపరులు, తమ మీద తమకి అదుపులేని వారు రేపు పెళ్లయ్యాక సంసారం చేయగలరా? కోరుకున్నదల్లా క్షణాలలో కొనగలిగే పోగుబడుతున్న సంపాదన, క్షణాలలో పొందగలిగే పర్చేజింగ్ కల్చర్ ఏమైనా యువతమీద ప్రభావం చూపుతున్నదా అనేది కూడా ఆలోచించాలి.
విద్యావిధానంలో వర్తమాన, భావి జీవితాలకి సంబంధించిన విషయాలు ప్రతి తరగతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉంది. మృత్యువు పిలిచే వరకూ జీవితం పరిపూర్ణంగా జీవించాలి, ఇంకొకరితో రిలేషన్స్ ఎలా ఉండాలి, పెళ్లి అంటే ఏమిటి, సంసారం అంటే ఏమిటి, విలువలు అంటే ఏమిటి అనేవి పాఠాలు ప్రశ్నలు జవాబులు కావాలి. ఉద్యోగమే పరమావధిగా మార్చి, లోకజ్ఞానంలో సున్నా మార్కులతో వచ్చే సర్టిఫికెట్లతో ఏం ఉపయోగం ఉంది? కూలిపనులు చేసుకుంటూ నిండు జీవితం గడిపే సామాన్యులకు కూడా ఉండే జ్ఞానం ఈ ఉన్నత చదువులు చదివే వారిలో ఎందుకు కొరవడుతుంది?
డబ్బు సంపాదిస్తున్నామనే అహంకారమేనా? డబ్బు సంపాదిస్తే మేం గొప్పవాళ్లమనే భావనేనా? వీళ్లంతా డబ్బు లేని మనుషులను ఎలా గౌరవిస్తున్నట్టు? డబ్బు వల్ల వచ్చే అహంకారం విషయంలో స్త్రీ పురుష బేధం ఉండదు. ఈ మాటలు అందరూ తమకుతాము అప్లై చేసుకోవలసిన అవసరంలేదు. ఓపెన్ చేసిన ఒక బ్లేడు సాయంత్రం వరకూ పట్టుకోమని ఒక పరీక్ష పెడితే ఎన్ని వస్తువులు కట్ చేస్తామో మనకే తెలీదు. మన దగ్గర అదనంగా ఏదివుంటే దానిని ఉపయోగించాలని చూడడం మానవనైజం. అలాంటి నైజంలో నాకు దక్కనిది ఇతరులకు దక్కకూడదు, దానిని ఏమైనా చేయవచ్చు, చేయాల్సిందే అనే నైజం కూడా ఒకటేనా?
Share this Article