‘‘మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా..?’’ ఇదీ తమిళనాడు, కేరళల్లో నెటిజన్లు కొందరు పెడుతున్న పోస్టులు… ఆశ్చర్యమేసింది… కారణం ఏమిటంటే..? తిండికి, భాషకు కూడా మతం ఉంటుందా..? పైగా అవి రెండూ హార్డ్ కోర్ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు… అవసరమైతే మతం ముద్ర వేసి దధ్యోదనం, పులిహోరకు మతం రంగు పులిమే బాపతు… కానీ షవర్మాకు ఎందుకు ఆ ముద్ర వేస్తాయి..?
అసలు ఏమిటీ ఈ షవర్మా అంటారా..? మన దగ్గర కూడా ఫేమసే… సన్నగా ముక్కలు చేసిన మటన్ ముక్కల్ని (ఇప్పుడు చికెన్, బీఫ్ తదితరాలనూ వాడుతున్నారు) ఓ రోలింగ్ స్టాండ్‌కు ఎక్కిస్తారు… అది మెల్లిగా తిరుగుతూ ఉంటుంది… గ్రిల్ అవుతూ ఉంటుంది… ఎవరైనా ఆర్డర్ ఇవ్వగానే చపాతీ రోల్స్‌లాగా లేదా శాండ్‌విచ్‌లాగా ప్రిపేర్ చేసి ఇస్తుంటారు… మన హైదరాబాదులో కూడా డిమాండ్ ఎక్కువే…
ఇప్పుడు వివాదం ఏమిటంటే..? కేరళలో షవర్మా తిని ఓ పదహారేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది… అనేక మంది అనారోగ్యం పాలయ్యారు… పైకి మాత్రం ఫుడ్ పాయిజనింగ్ ఏమీ లేదు, షవర్మా తప్పేమీ లేదు అంటున్నారు కానీ… చెడిపోయిన మాంసాన్ని ఫ్రీజర్లలో దాచీ దాచీ, వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చి ఉంటుందనేది ఉన్నతాధికారుల్లోనే సందేహం…
Ads
వెంటనే అలర్టయిన తమిళనాడు ఆరోగ్య మంత్రి… మామూలుగా చెబితే వినరనే భావనతో… అది మన తిండి కాదు, అవాయిడ్ చేయండి అని పిలుపునిచ్చాడు… అదీ వివాదం… నిజానికి వెల్లూరు జిల్లా, గుడియాథం మున్సిపాలిటీ మరో అడుగు ముందుకేసి షవర్మాపై నిషేధమే విధించింది… కేరళలో ఈ నిషేధం విధించడమే కాదు, మాంసం నిల్వల పరిస్థితులను రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తోంది ప్రభుత్వం… ఇక్కడ ఆ ఫుడ్ ఏమిటనేది కాదు ముఖ్యం, ఏ స్థితిలో, ఎలా నిల్వ చేస్తున్నారనేదే ముఖ్యం…
తమిళనాడు ఆరోగ్య మంత్రి ఏమంటాడంటే..? “షవర్మా భారతీయ వంటకం కాదు… అది పశ్చిమ దేశాల ఆహారం… అక్కడి వాతావరణ పరిస్థితులకు అది సరిపోతుంది… ఆయా దేశాల్లో ఒక్కోసారి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలోకి పడిపోతుంది… షవర్మాను బయట అలానే వదిలేసినా పాడవదు… కానీ ఇక్కడ అలా కాదు… మాంసాహారాన్ని సరిగా నిల్వ చేయకపోతే పాడైపోతుంది… వాటిని తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి…” అన్నాడు… కానీ అది పశ్చిమాసియాకు చెందిన ఆహారం…
సాధారణంగా గ్రిల్డ్ ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్‌కు గిరాకీ ఎక్కువే… ఎటొచ్చీ కుళ్లిపోయిన మాంసాన్ని కూడా వాడితేనే ప్రమాదం… నిల్వ కూడా హైజినిక్ కండిషన్‌లో ఉండాలి… హెల్దీగా నిల్వ చేసిన మాంసంతో చేసే షవర్మా నిజానికి బాగా రుచికరం… చాలామంది ఇష్టపడతారు… మెల్లిగా, అన్ని పక్కలా, బాగా గ్రిల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ డిఫరెంటుగా ఉంటుంది… కానీ… హోటళ్లు నిల్వ జాగ్రత్తలు పాటించకపోతే, మనుషులు అనారోగ్యం పాలవుతుంటే… అసలే కరోనా కండిషన్లు… సో, తమిళనాడు గానీ, కేరళ గానీ కఠినంగా వ్యవహరిస్తే తప్పుపట్టాల్సింది ఏముంది..?!
Share this Article