పుష్కలంగా వంట దినుసులు, మసాలాలు ఉంటే… అన్నీ తరిగి పెట్టేవాళ్లు, కడిగి పెట్టేవాళ్లు, వంట చేస్తున్నప్పుడు అన్నీ రెడీగా పెట్టేవాళ్లు ఉంటే ఎన్ని వంటలైనా చేసి చూపిస్తారు మన ట్యూబ్ చెఫులు… కొత్త కొత్త ప్రయోగాలతో మన కడుపుల పాలిట డోకాసురులు అవుతారు… అలా కాదు, అసలు పొయ్యి వెలిగించే పని ఉండొద్దు… వేయించడాలు, ఉడికించడాలు, కాల్చడాలు గట్రా ఉండొద్దు… చుక్క నూనె కూడా వాడొద్దు… పోపులు, తిరగమోతలు, ఘాటెక్కించే మసాలాలు, మన్నూమశానం ఏమీ ఉండొద్దు… ఏ రుచీ సయించని వేళల్లో కూడా నాలుక ఆవురావురుమంటూ, ఆతృతగా తపించేలా ఓ కూర చేసేవాళ్లు గ్రేట్…
ఎహె, పొయ్యి వెలిగించకుండా ఓ డిష్ చేయడం ఏమిటి..? ట్రాష్… సాధ్యం కాదు అని కొట్టేయకండి… అసలు చాలామందికి పోపు, నూనె లేకుండా అన్నంలోకి, రొట్టెలకు ఏ ఆధరువూ చేయడం చేతకాదు… పోనీ, ఓసారి ఇది ఇలా చేసి చూడండి… చాలా సింపుల్… రుచికి రుచి, ఘాటుకుఘాటు… దీనిపేరు పచ్చి మిర్చి పచ్చడి… కాకపోతే మరీ కారం నషాళానికి అంటేలా గాకుండా కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి…
పన్నెండు పచ్చి మిరపకాయలు… అప్పుడప్పుడే పండుబారుతున్నవయితే ఇంకాస్త రుచి… కడిగి పెట్టుకొండి… కాస్త కరివేపాకు, ఆరేడు వెల్లుల్లి రెబ్బలు… కాస్త చింతపండును చిన్న కప్పు నీళ్లలో నానేసి పెట్టండి… కాస్త జిలకర, రుచికి సరిపడా ఉప్పు… అదీ గళ్ల ఉప్పు… కాస్త ఎక్కువగానే ఉల్లిపాయ ముక్కలు… అంతే… చాలు…
Ads
మిక్సీ జార్‌లో మిరపకాయలు, కరివేపాకు, నానబెట్టిన చింతపండు, జిలకర, ఉప్పు వేసి గ్రైండ్ చేయండి… అప్పుడే అయిపోలేదు… ఇందులో చింతపండు నానబెట్టిన ఆ నీళ్లు ఉన్నాయి కదా, అవి పోయండి… మరోసారి గ్రైండర్ తిప్పండి… కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి మళ్లీ గ్రైండ్ చేయండి… కాకపోతే చట్నీలాగా కాదు… కచ్చాపచ్చాగా మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి…
ఇదీ పచ్చడి… ఉప్మా, అన్నం, సంగటి, పెరుగన్నం, బ్రేక్ ఫాస్టుల్లోకి బెటర్… తోడుగా నెయ్యి సూపర్… కానీ ఓసారి ఉప్పు సరిచూసుకొండి, ఏమాత్రం తగ్గినా కారం అదిరిపోతుంది మరి… అదొక్కటే జాగ్రత్త… లేదు, పచ్చిదనం పోయేలా పోపు పెడతాం, కాస్త నూనె వేస్తాం అంటే మీ ఇష్టం… నాలుగు వంకాయ ముక్కలు వేస్తాం, ఆనపకాయ వేస్తాం అంటారా..? మీ ఇష్టం… కానీ మిర్చి, వెల్లుల్లి, ఉల్లి కంబైన్డ్ ఒరిజినల్ టేస్ట్ మిస్సవుతారు… అంతే…
Share this Article