‘‘దయచేసి ఈ సినిమా చూడండి… లేకపోతే మా అప్పులు తీరవు… మునిగిపోతాం…’’ అని హీరో రాజశేఖర్ అప్పీల్ చేసినప్పుడే అర్థమైపోయింది… ఈ సినిమాలో దమ్మేమిటో..! డియర్ రాజశేఖర్… ఎవరి అప్పులూ ఎవరూ తీర్చరు… నీ సెంటిమెంట్ డైలాగ్స్ ఎవరినీ కదిలించవు… మీ సినిమావాళ్లలాగే ప్రేక్షకులూ కమర్షియలే ఇప్పుడు… మీ సినిమాల టికెట్లు రేట్లు, థియేటర్లలో దోపిడీలతో భయపడి ఎవడూ థియేటర్ల వైపే రావడం లేదు… మరీ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..! థియేటర్లలో చూడాలని టెంప్ట్ చేసేలా ఉంటే తప్ప..!
రాజశేఖర్‌కు నటుడిగా వంక పెట్టలేం… కామెడీ, కరుణ రసాల మాటేమిటో గానీ రౌద్రం, బీభత్సం వంటివి బాగానే పండించగలడు… పైగా ఈ సినిమాలో వయస్సుకు తగ్గ లుక్కు… ఆల్‌రెడీ నాలుగేళ్ల క్రితం మలయాళంలో క్లిక్కయిన జోసెఫ్ సినిమాకు ఇది రీమేక్… థ్రిల్లర్… పెద్ద ఖర్చు కూడా ఏమీలేదు… భార్య జీవిత దర్శకురాలు… ఒక పాత్ర సొంత బిడ్డ చేసింది… పెద్ద ప్రయోగాలు, మార్పులు కూడా ఏమీలేవు… మలయాళంలో ఎలా ఉందో అలా సీన్లు చేసుకుంటూ పోయారు… ఒరిజినల్‌లో ఉన్న ఆత్మీయ రాజన్ ఇందులో కూడా ఉంది… మరి ఎక్కడ దెబ్బకొట్టింది..?
- సినిమా మొత్తం ఏడుపే… ప్రతి పాత్ర విషాదాంతమే…
- ముస్కాన్, ఆత్మీయ రాజన్ ఉన్నా పెద్ద ప్రాధాన్యం లేదు…
- రాజశేఖర్‌లో ముసలితనం కనిపిస్తోంది… కరోనాకు ముందు గరుడవేగ, కల్కి పాత్రలు కాస్త వోకే… కానీ ఆమధ్య కరోనా సోకాక మనిషి మరీ డౌన్ అయిపోయాడు ఫిజికల్‌గా…
Ads
- మళ్లీ ఈ వయస్సులో కూడా యంగ్ ఏజ్, డ్యూయెట్ సీన్లు గట్రా ప్రేక్షకులకు నచ్చలేదు…
- ప్రత్యేకించి పాటలు పెద్ద మైనస్… ఒక థ్రిల్లర్‌లో పాటలు కథావేగానికి అడ్డుపడతాయి తప్ప పేక్షకులకు నచ్చవు… పైగా ఆ పాటలు సోసో…
- జీవిత దర్శకురాలిగా కొత్తగా చేసిందేమీ లేదు… ప్రజెంట్ ట్రెండ్, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్పీడ్ నెరేషన్ కోసం ప్రయత్నించలేదు…
- మలయాళంలో స్లో కథనమైనా సరే, చల్తా… కానీ తెలుగులో అలా నడవదు… ప్రేక్షకులు ఇష్టపడరు…
- థ్రిల్లర్ అయినా సరే కాస్త ఎమోషన్ ఉండాల్సిందే… కానీ అది మరీ బోరింగు, సాగదీత ఉండకూడదు…
( జోసెఫ్ సినిమాలో ఆత్మీయ రాజన్)
ఏ సినిమాకు ఆ సినిమాయే, ఒకదాన్ని మరోదాన్ని పోల్చలేం… కానీ ఒక్కసారి దృశ్యం సినిమా గుర్తుతెచ్చుకొండి… ఎమోషన్స్, క్రైం, సస్పెన్స్, ఫ్యామిలీ బాండ్… అన్నీ సరిగ్గా కలిసిన వంటకం అది… ఆర్ద్రతతో ప్రేక్షకుడు ఆ సినిమాలో ఫ్యామిలీని ఓన్ చేసుకుంటాడు… శేఖర్ సినిమాలో కేసు దర్యాప్తు, చివరకు తను తెలుసుకున్న ఓ అవయవదానం స్కాం తప్ప మిగతా ఎమోషన్స్ ఏమీ ఆకట్టుకునేలా లేవు… అదీ పెద్ద మైనస్… సినిమా చెత్త అనాల్సిన అవసరం లేదు… కానీ ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పించాలంటే మరీ ఇంత సాదాసీదాతనం పనికిరాదు… ఓటీటీ, టీవీల్లో చూసుకోవచ్చులే అనుకుంటాడు ప్రేక్షకుడు… శేఖర్‌కు కూడా అదే శరణ్యం… రాజశేఖర్, కాస్త అప్పులు, మునిగిపోతాం అనే డైలాగుల్ని అక్కడ ఉపయోగించి, ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్‌కు ఎక్కువ రేట్లు వచ్చేలా ప్రయత్నించాలి… అదొక్కటే మార్గం…!!
Share this Article