ముందుగా ఓ వార్త చదవండి… ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సిటీ ఎడిషన్‌లో వచ్చింది… ‘‘ఇద్దరు దంపతులు… 65 ఏళ్లు దాటారు… ఇద్దరూ ప్రొఫెసర్లుగా పనిచేసి రిటైరయ్యారు… ఇద్దరు పిల్లలు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్లు… ఈ ముసలోళ్లకు డబ్బుకు కొదువ లేదు… కానీ ఆమె హఠాత్తుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది… ఏమిటమ్మా అంటే… కాఫీ పెట్టడం లేదుట, ఏ పనిచెప్పినా భర్త చేయడం లేదట… నచ్చింది వండుకుంటే ఆయన ఒప్పుకోవడం లేదట…
నీ భార్య చెప్పినట్టు వినాలని కాస్త బెదిరించండి ఆయన్ని… వినకపోతే జైలుకు పంపిస్తామని చెప్పండి గట్టిగా… ఇంటి బయట చాలామంది ఆడవాళ్లతో మాట్లాడుతున్నాడు… ఈ వయసులో అవేం పనులు..? కేసు పెడతామని హెచ్చరించండి… ఇప్పటిదాకా బోలెడంత కష్టపడ్డాను, ఇంటి పని, వంట పని, పిల్లల చదువు, సంధ్య, బాధ్యతలు అన్నీ నేనే చూసుకున్నాను… ఇప్పుడు ఆయన సేవలు చేస్తే తప్పేమిటి..? అని అడిగింది పోలీసులను…
ఫాఫం… పోలీసులు ఈ ఫిర్యాదు విని, ఏం చేయాలో తెలియక… ఓ పనిమనిషిని పెట్టుకోవమ్మా అని సలహా ఇచ్చారు… ఎందుకు, దండుగ… ఆయన ఖాళీగా ఉన్నాడుగా, తను చేస్తే తప్పేమిటట, ఇన్నేళ్లు నేను చేయలేదా ఏం..? అని బదులిచ్చింది… ఆ ముసలాయన్ని పిలిచి అడిగితే… ఆమె అలా వ్యవహరిస్తోంది, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్ అని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు..’’……. ఇదీ వార్త…
Ads
నిజానికి ఇంకేదో సమస్య ఉంది… అది మానసికమైన డిస్ట్రబెన్స్ కావచ్చు… అది ఈరకంగా బయటికి తన లక్షణాల్ని చూపిస్తుండవచ్చు… మనం ఓ ముసలామె పోలీసుల వద్దకు రావడం ఏమిటి..? ఈ ఫిర్యాదు ఏమిటి..? అని కాసేపు నవ్వుకునో, ఆయన పట్ల జాలిపడో మరో వార్తలోకి వెళ్లిపోతాం… కానీ ఈ వార్తలోనే ఓ ట్విస్టు ఉంది చదవండి…
‘‘మీ పిల్లలతో ఇవన్నీ మాట్లాడొచ్చు కదాని పోలీసులు అడిగారు… దానికి ఆయన చెప్పిన జవాబు విచిత్రంగా ఉంది… వాళ్లు ఎక్కడో బెంగుళూరులో ఉంటారు, మా ఇగోలతో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు… వాళ్ల వద్దకు ఎప్పుడైనా వెళ్దామంటే, ఎక్కడ ఉంటారో తెలియదు… అడ్రస్ కూడా చెప్పడం లేదు వాళ్లు… రోజూ ఫోన్‌లో మాట్లాడతారు… చూడాలనిపించి బెంగుళూరు వెళ్తే, హోటల్‌లో రూమ్స్ బుక్ చేస్తారు… వాళ్లే పిల్లలతోసహా వస్తారు, వెళ్లిపోతారు అని చెప్పాడు ఆ ముసలాయన…’’
అసలు తల్లిదండ్రులు తమను చూడటానికి వస్తే హోటల్ రూమ్స్ బుక్ చేయడం ఏమిటి..? అలా వచ్చి, చూసి, మాట్లాడి, వెళ్లిపోవడం ఏమిటి..? అసలు వాళ్ల అడ్రెస్సులు కూడా ఈ ముసలోళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి..? అంటే అసలు సమస్య ఇంకేదో ఉంది… ఇది పోలీసుల వద్దకు రావల్సిన కేసు కాదు… మంచి సైకియాట్రిస్టులో లేక ఫ్యామిలీ కౌన్సిలర్లో డీల్ చేయాల్సింది… మంచి వార్తే… తరచి తరచి లోతులోకి వెళ్తే ఓ సామాజిక సమస్య కనిపిస్తుందేమో… పిల్లలు రెక్కలొచ్చి ఎటో ఎగిరిపోతే, రెక్కలుడిగిన వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా బతుకుతూ ఎదుర్కొంటున్న అవస్థలు… కొన్ని లక్షల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య…!! సరిగ్గా బయటికి చెప్పుకోరు… ఏదో అలసట, ఏదో అశాంతి, ఏదో అసంతృప్తి లోలోపల సుడి తిరుగుతూ… ఎవరినీ ఏమీ అనలేరు… ఎవరి మీదా చూపించలేరు… ఇదుగో ఇలా ఒకరిపైనొకరు ఇలా ప్రదర్శించుకుంటున్నారా..?!
Share this Article