సరే, సరే… రాజకీయ దూషభూషణలు కాస్త పక్కన పెట్టండి.,. ఈ ఈనాడోడు వరుసగా నాలుగు రోజుల నుంచీ బీజేపీ భేటీల్లో యాదమ్మ మార్క్ తెలంగాణ వంటకాలు అంటూ తెగ రాసేస్తున్నాడు… అక్కడికి ఇదేదో పెళ్లివేడుక, విందుభోజనాల ముచ్చటలాగా… అంతకుమించి వాడేమీ రాయడు కదా… కేసీయార్‌ను ఏమీ అనరాదాయె, మోడీని ఏమీ అనకూడదాయె… మరేం చేయాలి..?
ఏ పార్టీ ప్లీనరీ అయినా, పెద్ద మీటింగు అయినా సరే… ఫస్ట్, మీడియా అటెన్షన్ భోజనాల మీదకు వెళ్తుంది… అక్కడికి వచ్చే కార్యకర్తలు తిండికి మొహం వాచి వస్తున్నట్టు… ఆ వంటకాలేవో పెద్ద విశేషం అయినట్టు… రాజకీయ తీర్మానాల మీద గానీ, వాటి విశ్లేషణల మీద గానీ వ్యాఖ్యానాలు చేయాలంటే బుర్రలో చటాక్ ఉండాలి… ఈ వార్తలకు అక్కర లేదు కదా…
సరే, బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీయే చూసుకుందాం… అన్నీ తెలంగాణ వంటకాలే… మోడీకి స్వయంగా వడ్డించి, రుచిచూపించిన యాదమ్మ, అడిగి తెలుసుకున్న మోడీ అంటూ బోలెడు వార్తలు… నిజానికి మోడీ శాకాహారి… స్వల్పాహారి… తను తినేదే తక్కువ… అందులోనూ తనకు తెలియని ఫుడ్ జోలికి పోడు… పెద్ద పెద్ద దేశాల ఆతిథ్య విందుల్లోనే నిమ్మకాయ షర్బత్ తాగి లేచిపోయే నొటోరియస్ వెజ్ రకం అది… సర్వపిండి తిన్నాడా, సకినం కొరికాడా, గట్క టేస్ట్ చేశాడా..? ఎవడు చూడొచ్చాడు..? దానికున్న ప్రాధాన్యత ఏమిటి..?
Ads
ప్రధాని తిండే ప్రధానం కాదు కదా… ఎందరో నాయకులు వచ్చారు, ఎవరి తిండి అలవాట్లు వాళ్లవి… కంఫర్ట్ ఫుడ్ దొరికిందా లేదా అనేదే చూస్తారు… ఈ వార్త ఓసారి చదవండి…
50 రకాల తెలంగాణ వంటకాలు అట… స్వీట్లు, అల్పాహారం, ఇతర తినుబండారాలు కూడా తెలంగాణవే అట… ఎవడో ఏదో రాస్తాడు… మనం ఎడ్డిపప్పులమై చదవాలి… చిక్కుడుకాయ టమాట, ఆలూ కూర్మా, వంకాయ మసాలా, దొండకాయ పచ్చి కొబ్బరి తురుం, బెండకాయ కాజు పల్లీ ఫ్రై, తోటకూర టమాట ఫ్రై, బీరకాయ మీల్‌మేకర్ చూర ఫ్రై, మెంతికూర చట్నీ, పెసరపప్పు ఫ్రై, గంగవాయిలి కూర, మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పులిహోర, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూర పచ్చడి, దోసకాయ ఆవ చట్నీ, టమాట చట్నీ, సొరకాయ చట్నీ… ఇలా రాసుకుంటూ పోయారు…
ఇందులో తెలంగాణ స్పెషల్ ఏముందసలు..? అన్నిచోట్లా చేసుకునేవే కదా… అందరూ ఇష్టంగా తినేవే కదా… వాటికి ప్రత్యేకంగా తెలంగాణ ముద్ర దేనికి..? పచ్చిపులుసు, సకినాలు, సర్వపిండి, జొన్నగట్క, మక్కగుడాలు ఎట్సెట్రా వంటకాలు పెడితే, అతిథులు ఇష్టంగా తింటే ఓ వార్త… గట్క తినడం ఓ ఆర్ట్… సర్వపిండి తినడం ఓ టేస్ట్… పచ్చిపులుసు డిఫరెంట్… అసలు వైట్ రైస్ అని రాసి, తెలంగాణ వంటకం అని రాస్తే ఇక దాన్ని ఏమనాలి..?
ప్రేక్షకులు పిచ్చెదవలు, మనం రాస్తాం, వాడు చదువుతాడు అనే తేలికభావన తప్ప… ఏదో పాయ, బోటీ, తలకాయ కూర ఎట్సెట్రా ఉంటాయేమో అని చూస్తే ఈ భేటీలో నాన్ వెజ్ వాసనలే లేవట… ఇంకేమంటాం… జై వైట్ రైస్… జై తెలంగాణ ఫుడ్… జీతే రహో తెలుగు మీడియా..!! థాంక్ గాడ్… చపాతీలు, పరోటాలు చేసి తెలంగాణ రొట్టె, తెలంగాణ పరోటా అనలేదు…!! ఏమో, తెలంగాణ డోక్లా, తెలంగాణ పావ్ బాజీ, తెలంగాణ సమోసా అని పేర్లు పెట్టలేదు…!!
Share this Article