ఒక కులసంఘం మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తారు… తమ కులానికి సంబంధించిన ఇష్యూస్ ప్రస్తావనకు వచ్చేలా చూసుకుంటారు… తమ కులానికి ఏమైనా ఉపయోగపడేలా ప్లాన్ చేస్తారు… తమ కులస్థులే పాల్గొనేలా చూస్తారు… కానీ ఆర్య వైశ్య మీటింగులు, సంఘాలు ఎవరిష్టారాజ్యం వాళ్లు… ఒకప్పుడు పద్దతికి, ప్రణాళికకు పెట్టింది పేరయిన వైశ్యసంఘాలు ప్రస్తుతం ఆర్యవైశ్య మహాసభ నిర్వాకం, స్వార్థం కారణంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే అసమర్థత కారణంగా… బోలెడు పిల్ల సంఘాలు పుట్టుకొస్తున్నాయి… పేరుకు అవి ప్రపంచ, ఇంటర్‌నేషనల్ సంఘాలు… కానీ కొందరు వ్యక్తుల కోసం ఉపయోగపడే సంఘాలు అవి…
నిజాలు చెబితే నిష్ఠురంగానే ఉంటుంది… వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ (వామ్) అని ఓ సంఘం ఉంది… పక్కాగా టీజీ వెంకటేష్ కోసం 17న హైదరాబాద్, క్లాసిక్ కన్వెన్షన్ హాలులో ఓ మీటింగు ఆర్గనైజ్ చేయబడింది… దారుణమైన నిర్వహణ… వేలాది మందిని ఆహ్వానిస్తున్నామనీ, ఖరీదైన గిఫ్టులు ఇవ్వబడతాయని చెప్పారు… తీరా అక్కడికి వచ్చిన వాళ్ల మీదకు చీరెల్ని ‘‘వరద ప్రాంతాల్లో బాధితులకు పులిహోర పొట్లాల్లాగా’’ బౌన్సర్లు విసిరేసిన వీడియో చూస్తారా..? చూడండి… ఒక కులసంఘం మీటింగు ఎలా జరగకూడదో చెప్పడానికి నిఖార్సయిన ఉదాహరణ…
అసలు అక్కడికి వచ్చినవాళ్లందరూ వైశ్యులేనా..? అది పెద్ద డౌట్… ఎక్కడి నుంచి జనసమీకరణ జరిగింది… తీరా అక్కడికొచ్చాక నిర్బంధ సభ్యత్వం క్లాజ్ ఎందుకు పెట్టినట్టు..? బోలెడు మంది స్పాన్సరర్లు, వ్యాపారులు, కంపెనీలు ఉండగా… వేరే కులాలకు చెందిన వారికి స్టాళ్లు ఎందుకు ఇచ్చినట్టు..? అసలు ఓ కులసంఘం మీటింగును ఇలా ఎగ్జిబిషన్‌గా మార్చడం దేనికి..? ఆ స్టాళ్లకు డబ్బులు వసూలు చేయడం దేనికి..? సరే, చేశారుపో… కనీసం ఓ పద్ధతీపాడూ ఉండదా సభ నిర్వహణకు..?
Ads
మరి, ఈ పుట్టగొడుగులు పుట్టుకొస్తుంటే ఆర్యవైశ్యమహాసభ ఏం చేస్తోంది..? ఆ నాయకమణులు కుర్చీలను వదలరు, కొత్తరక్తం రాదు, అదీ అసలు సమస్య… సరే, టీజీ వారి మీటింగు విషయానికే వద్దాం… సార్, బీజేపీలో చేరాడు, మళ్లీ రాజ్యసభ సభ్యత్వం రాలేదు, ఏ ఈశాన్య రాష్ట్రానికో గవర్నర్ చాన్స్ వస్తుందనుకున్నాడేమో అదీ రాలేదు… తనకు కులం మద్దతు ఎలా ఉందో చూపించడానికా ఏకంగా లోకసభ స్పీకర్‌ను తీసుకొచ్చి ఈ షో చేసింది..? పోనీ, అదైనా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా… ఆ సోయి కూడా లేదాయె…
తన రాజకీయ కార్యస్థలం ఏపీ… మరి ఏపీలో ఉన్న వైశ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఎందుకు పిలవలేదు… వాళ్లు వచ్చి జగన్ భజన చేస్తారనా..? చేయనీ, తప్పేముంది..? తెలంగాణకు చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్ వచ్చి టీఆర్ఎస్ భజన స్టార్ట్ చేస్తే, చాలామంది ఆపెయ్ ఆపెయ్ అని గోల చేశారట కదా… ఆమధ్య మల్లారెడ్డిని ఆయన కులస్థులే గెదిమారు కదా… అలా జరుగుతుందమోనని సదరు చైర్మన్ ఆపేసి, కాసేపటికే జంప్ అట… పోనీ, వైశ్య కులానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయా..? మరి ఈ అట్టహాసాలు దేని కోసం..? ఎవరి లబ్ధి కోసం..? సరే, కులం పేరు చెప్పుకుని ఒక టీజీ ఓ మంచి పదవి తెచ్చుకుంటే ఎవరూ కాదనరు, అభ్యంతరాలు ఉండవు, అడ్డుపడరు, బీజేపీ హైకమాండ్ అంత గుడ్డిదీ కాదు… కాకపోతే ‘‘ప్రయత్నాలు’’ హుందాగా, తలెత్తుకునేలా ఉండాలి.., మరీ ఈ ‘‘నానాజాతి సమితి’’ మీటింగుల్లా కాదు…!!
Share this Article