Nancharaiah Merugumala…………. నేటి బ్రిటన్ గ్రేట్ సమస్యలు–డౌన్ బ్లౌజింగ్, గ్రూమింగ్ గ్యాంగ్స్! మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుం బిగిస్తున్న’ రిషీ సునక్…. పాత పాత్రికేయ బాణీలో చెప్పాలంటే– భారత/పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ నేత, దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్ (42) ప్రధానమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలూ పద్ధతిగానే చేస్తున్నాడు. సునక్ కు మంచి చదువు, సంపద, మిలియనీర్ భార్య (ఇన్ఫోసిస్ ఎన్ ఆర్ నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు అక్షత) మాత్రమే కాదు పదునైన మెదడుంది.
ఇంగ్లండ్ రాజకీయ ప్రమాణాల ప్రకారం 42 సంవత్సరాలకు ప్రధాని కుర్చీ ఎక్కడం మరీ ముందేమీ కాదు. నాలుగు పదులు నిండకుండానే 10, డౌనింగ్ స్ట్రీట్ అధికార నివాసంలోకి మకాం మార్చినోళ్లూ ఇంగ్లండ్ ప్రజాతంత్ర చరిత్రలో కనిపిస్తారు. 1757 జూన్ నెలలో ప్రధాని అయిన విలియం కేవిండిష్ వయసు అప్పటికి 36 ఏళ్ల 192 రోజులు. ఆయన తర్వాత చాల్జ్ వాట్సన్–వెంట్ వర్త్ ( 35 ఏళ్ల 61 రోజులు), ఆగస్టస్ ఫిజ్ రాయ్ (33 ఏళ్ల 16 రోజులు), ఫ్రెడరిక్ నార్త్ (37 ఏళ్ల 290 రోజులు), విలియం పిట్ ద యంగర్ (24 ఏళ్ల 205 రోజులు) కూడా 40 నిండకుండానే ప్రధాని పీఠమెక్కినోళ్లే.
ఇక అసలు విషయానికి వస్తే–అన్ని పారిశ్రామిక, పాశ్చాత్య, ప్రజాస్వామిక, ఆధునిక, ధనిక సమాజాల్లో మాదిరిగానే యునైటెడ్ కింగ్ డమ్‌లో సైతం మైనర్లు అయిన (ఆడ) పిల్లలపై లైంగిక దాడులు, మాయమాటలు చెప్పి వారి శరీరాలను బలవంతంగా వాడుకోవడం వంటి అవలక్షణాలు ఉన్నాయి. అందరూ బాహాటంగా చర్చించే శాంతి భద్రతల సమస్యల్లో ఇదొకటి. మరి రెండోది ఎదిగిన స్త్రీల వక్షభాగాలను వారు చూడనప్పుడు మొబైల్ ఫోన్లతో ఫోటో తీయడం.
Ads
ఈ ఆడవాళ్ల అనుమతి లేకుండానే కిందికి వంగిన, మాల్స్, థియేటర్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కింద మెట్లపై నడుస్తున్న యువతులు, స్త్రీల పైభాగాలను ‘చరవాణుల’తో చిత్రీకరించడం ఈ గొప్ప చరిత్రగల దేశంలో ఇటీవల ఎక్కువైంది. మహిళలపై అస్త్రాలుగా ఇలా మొబైల్ ఫోన్ల వాడడాన్ని అక్కడ ‘డౌన్ బ్లౌజింగ్ ’ అని ముచ్చటగా పిలుస్తారట. మైనర్ ఆడపిల్లలకు ఆత్మీయులుగా, స్నేహితులుగా నటిస్తూ వారిని అదును చూసి నలిపివేయాలని చూసే ముఠాలు ఇంగ్లండ్‌లో ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’గా పేరుమోశాయి.
భారతీయులు వంటి వెనుకబడిన ప్రజలను నాగరీకులను చేసే బరువు బాధ్యతలు రెండు శతాబ్దాల పాటు నెత్తినేసుకున్న బ్రిటిషోళ్ల దేశంలోని ఈ ముఠాలు పెద్ద ‘శాంతి భద్రతల సమస్య’గా మారాయి. పశ్చిమ యార్క్ షైర్ లోని హడర్స్ ఫీల్డ్, టెల్ఫోర్డ్ పట్టణాల్లో ఈ గ్రూమింగ్ గ్యాంగుల దాష్టీకాలు ప్రపంప దేశాల దృష్టిని ఆకర్షించాయి. ఈ రెండు పట్టణాలపై అమెరికా, ఐరోపా దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంగ్లిష్ భాషను, ఆధునిక సంస్కృతిని పరిచయం చేసిన గ్రేట్ బ్రిటన్‌లో లా అండ్ ఆర్డర్ మళ్లీ మామూలు స్థితికి రావాలంటే పైన వివరించిన బాలికలు, స్త్రీలను వేధించే, వారిపై అనూహ్యంగా లైంగిక దాడులు జరిపే తెల్ల మగ ముఠాలను (గ్రూమింగ్ గ్యాంగ్స్, డౌన్ బ్లౌజింగ్ బృందాలు) కట్టడి చేసి, వారిని వీధుల్లో తిరగకుండా చేయాలని ఆంగ్ల వనితలు కోరుకుంటున్నారట. అందుకే, కోటేరు ముక్కుతో పాటు అంతే పదునైన బ్రెయిన్ ఉన్న పంజాబీ పురుషుడు రిషీ సునక్ ఈ రెండు జాఢ్యాలను నిర్మూలించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. అదీ ఆయన ప్రధానమంత్రి పదవి అంటే కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంటరీ పక్షం నేతగా ఎన్నికయ్యాక చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇండియా కంటే ఎన్నో దశాబ్దాలు ముందున్న ఇంగ్లండ్ లో మహిళా ప్రపంచానికి ఈ కొత్త సమస్యలు (డౌన్ బ్లౌజింగ్, గ్రూమింగ్ గ్యాంగ్స్) నిరంతర అలజడిగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మళ్లీ, రిషీ సునక్ విషయానికి వస్తే– ఆయన 2018లో బ్రిటన్ ఆర్థికమంత్రిగా (చాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్) ప్రమాణం చేశాక తన అమెరికా గ్రీన్ కార్డ్ వదిలేశారు. నాన్ డొమిసైల్ నివాసిగా పన్ను రాయితీలు పొందుతున్న ఆయన భార్య అక్షత తన భర్త కోసం నాన్ డొమిసైల్ హోదాను స్వచ్ఛందంగా రద్దు చేయించుకున్నారు. ఈ విషయం రిషి స్వయంగా ప్రకటించారు. మరి ఇన్ని త్యాగాలు చేస్తున్న రిషీ సునక్ దంపతుల కృషి ఫలిస్తుందా? పంజాబీ (భారతీయ) మూలాలున్న మనిషికి ప్రధాని పీఠం దక్కుతుందా? త్వరలోనే ఈ సస్పెన్స్ తొలిగిపోతుంది.
Share this Article