జనం మీద పడే తోడేళ్లలా ప్రభుత్వ అధికారులు కనిపించేవాళ్లు గతంలో… రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కులసంఘాలు, సామాజిక సంస్థలు నిర్బంధ చందాల దందాలు జతకలిశాయి… తరువాత పట్టణాలు, నగరాలయితే హిజ్డాలు ఓ ఆర్గనైజ్డ్ ముఠాలుగా జనంపై పడసాగారు… వీళ్లందరినీ మించి సమాజానికి ఇప్పుడు పెద్ద జాఢ్యం జర్నలిజం… ఈ హైనాల బెడద గతంలో లేదని కాదు, కాకపోతే అప్పట్లో పత్రికల సంఖ్య తక్కువ… తరువాత టీవీ గొట్టాలు చేరాయి… ఇక కొన్నేళ్లుగా యూట్యూబ్ చానెళ్ల పేరిట, కడుపు కోస్తే అక్షరమ్ముక్క కనిపించనివాళ్లు సైతం ఏవేవో వింత పేర్లతో గొట్టాలు పట్టుకుని స్వైరవిహారం చేస్తున్నారు… వీళ్లకు వాట్సప్, డిజిటల్ జర్నలిస్టులు తోడయ్యారు…
ప్రధాన పత్రికలు, టీవీ రిపోర్టర్ల దందాలు చాన్నాళ్లుగా చూస్తున్నదే… అవి స్వైన్ ఫ్లూ, డెంగూ తరహా… ఇప్పుడు యూట్యూబ్ గొట్టపు జర్నలిజం కరోనా టైప్… తాజాగా ఓ వార్త కనిపించింది… అదీ వాట్సప్ గ్రూపుల్లో కనిపించిందే… సంక్షిప్తంగా… ‘‘రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై బియ్యం లారీని అడ్డగించి, డ్రైవర్‌ను, లక్షల్లో డబ్బులు ఇవ్వాలని సరకు యజమానిని బెదిరించిన ఆరుగురు విలేకరులను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు… 14వ తేదీన లారీని ఆపి, మీ ఓనర్‌కు ఫోన్ చేయ్, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని డ్రైవర్‌ను బెదిరించారు. ఫోన్‌లో రైస్ మిల్లు గుమస్తాతో మాట్లాడి రూ.2 లక్షలు ఇస్తే లారీని వదులుతామని, లేకపోతే సీజ్ చేస్తామని బెదిరించారు…
వీరిలో ఆకొండి వీరవెంకటసత్య సూర్యనారాయణమూర్తి (పశ్చిమ వాహిని, తిరుపతి), చిర్రా నాగరాజు (ఆర్‌టీఐ యాక్ట్ న్యూస్ చానల్), అయినవిల్లి విజయబాబు (అనంత వాయిస్ తెలుగు దినపత్రిక), ఉందుర్తి రవికుమార్ (డీఆర్‌ఎస్ యూట్యూబ్ చానల్), పలివెల రాజు (జైజనని తెలుగు దినపత్రిక), ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు (గోదావరి దినపత్రిక) అరెస్టు కాగా, ఏడో ముద్దాయి సీహెచ్ రాజేంద్రప్రసాద్ (వి10 న్యూస్ చానల్) పరారీలో ఉన్నాడట… అతన్ని పట్టుకోవడానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారట…
Ads
వావ్… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే చానెళ్లు అన్నమాట… ఇలాంటి గ్యాంగుల మీద కేసుల వార్తలు ఈమధ్య చాలా చదువుతున్నాం… కాకపోతే అక్కడ పోలీసులతో బాగుంటే కథ వేరే ఉంటుందన్నమాట… ఇదే కేసులో సంఘటన 14న జరిగితే, ఇప్పుడు అరెస్టులు… ఈమధ్యలో ఏం జరిగింది..? ఊళ్లల్లో ఇసుక, బియ్యం కథలుంటే సిటీల్లో భూములు, భవనాలు… ఎవడైనా సిటీ ప్లానింగ్ అధికారులతో ఒప్పందాలు చేసుకుని మరీ దందాలు…
పత్రికలకు ఆర్ఎన్ఐ… టీవీలకు కేంద్రం పర్మిషన్… మరి ఈ గ్యాంగులకు..? ఈ గొట్టాలకు..? ఏ నియంత్రణ లేదు, ఏ వ్యవస్థా లేదు… (అన్నీ ఉంటేనే దోచుకోవాలని కాదు…) అసలు ఎవరు జర్నలిస్టు..? ఇదొక జటిలమైన ప్రశ్న… సొసైటీలో ఎవడైనా కాస్త పచ్చగా కనిపిస్తే చాలు… తోడేళ్లు మీద పడుతున్నయ్… ఇది సర్వత్రా వినిపిస్తున్నదే… హిజ్డాలు, గొట్టాలు… ఈ రుగ్మతలకు కనుచూపు మేరలో ఏదైనా పరిష్కారం కనిపిస్తున్నదా..? ‘‘పెన్ గ్యాంగ్స్’’ నుంచి రక్షణ సాధ్యమేనా..?!
Share this Article