కొన్ని వార్తల్లో పెద్ద విశేషం ఉన్నట్టుగా ఏమీ అనిపించదు… కాకపోతే అవి చదువుతుంటే ఇట్టే కనెక్టయిపోతాయి… ఇదీ అంతే… కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది… ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి కొన్ని సంప్రదాయాల మేరకు, పద్ధతుల మేరకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది… చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు… 21 తుపాకుల్ని గాలిలోకి కాల్చి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని సెలబ్రేట్ చేస్తారు… అంతేకాదు, టెక్నికల్‌గా అన్నిరకాల రక్షణ సైనిక విభాగాలకు అధినేత ఆమే కాబట్టి ప్రమాణ స్వీకారం కాగానే గౌరవవందనం కూడా ఉంటుంది…
ఇంద్రప్రస్థ పీఠం అధిరోహించిన మొదటి గిరిజన మహిళ కదా… ప్రమాణస్వీకార ప్రాంగణాన్ని గిరిజన సంప్రదాయం ప్రతిబింబించేలా అలంకరిస్తున్నారు… సరే, ఇవన్నీ కామన్… ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే..? ఆమె మరదలు సుక్రీ (తమ్ముడు తరిన్‌సేన్ భార్య) ప్రమాణ స్వీకారం వేళ కట్టుకోవడానికి సంప్రదాయిక సంతాలీ తెగ చీరెను తీసుకుని ఢిల్లీ బయల్దేరింది… అయితే ఆ చీరె కట్టుకోవాలో లేదో అంతిమంగా నిర్ణయించేది రాష్ట్రపతి భవన్… కానీ వదినకు కానుక ఇవ్వడానికి ఆ మరదలికి అంతకుమించి ఏమీ తోచలేదు… కాదు, అంతకుమించి ఏముంటుంది..?!
మరి తమ్ముడి కానుక..? ఇదే అడిగితే… మా ఇంట్లో చేసిన అరిశెలు తీసుకుపోతున్నా అన్నాడు నవ్వేస్తూ… నిజమే… ఓ రాష్ట్రపతికి ఇవ్వగల తీపి కానుకలేం ఉంటయ్ ఆ దిగువ మధ్యతరగతి ఇంట్లో…?! ఆరేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కొడుకులు, తల్లి, భర్త, తమ్ముడిని పోగొట్టుకున్న ఆమె బ్రహ్మకుమారీల ఆధ్యాత్మిక మార్గంలో స్వాంతన పొందుతోంది… గవర్నర్‌గా పదవీకాలం అయిపోయాక ఈ తమ్ముడి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది…
Ads
బిడ్డ పేరు ఇతిశ్రీ… బ్యాంకు అధికారిణి… అల్లుడి పేరు గణేష్… తను రగ్బీ ప్లేయర్… బిడ్డ, అల్లుడు, తమ్ముడు, మరదలు… ఈ నలుగురు మాత్రమే ఆమె తరఫున ప్రమాణస్వీకారానికి హాజరయ్యేవాళ్లు… గెలవడానికి పూజలు చేసి, గెలిచాక లడ్డూలు పంచుకుని సంబురాలు చేసుకున్న లక్షల మంది గిరిజన బంధుగణం గుండెలు ఆమె గౌరవవందనం స్వీకరిస్తుంటే ఎలా ఉప్పొంగిపోతాయో కదా…! అసలే భారత స్వాతంత్ర్య పోరాటాల్లో బోలెడు త్యాగాలు చేసిన తెగ అది…
ఆమె నామినేషన్ వేసినరోజున తెల్ల చీరె ధరించింది… సాధారణంగా బ్రహ్మకుమారీలు పాటించే వస్త్రధారణ… వ్యక్తిగత నష్టాలతో ఒక దశలో ద్రౌపది కుంగిపోయింది… ఆ దశలో మయూర్‌భంజ్ జిల్లా, రాయ్‌రంగాపూర్‌లోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయలో చేరింది… యోగ, ధ్యానం సాధన చేసింది… అందులోనే రిలాక్స్ అయ్యేది… కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి పొందింది… ఎక్కువగా ఉద్వేగాల్ని ఆమె ప్రదర్శించకపోవడానికి కారణం బ్రహ్మకుమారీల సావాసం, సాధించిన స్థితప్రజ్ఞత…
గత రాష్ట్రపతి ఎన్నికల్లోనే ద్రౌపది అభ్యర్థిత్వం చురుకైన పరిశీలనకు వచ్చింది… కానీ బీజేపీ హైకమాండ్ ఇంకేవో సమీకరణాలతో రామనాథ్ కోవింద్‌ను ఎంపిక చేసింది… ఆ సమాచారాన్ని కూడా ద్రౌపది నిర్వికారంగా, నిర్లిప్తంగానే స్వీకరించింది… ప్రచారం కోరుకోదు, సింపుల్ లివింగ్, అట్టహాసాలు, ఆడంబరాలు ఉండవు… అతిగా మాట్లాడదు… నియమబద్ధమైన జీవనశైలి… మొత్తానికి ఇంట్రస్టింగు పర్సనాలిటీ…!!
Share this Article