ఈ దేశపు మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసి… హుందాగా దిద్దుకోలేక, రచ్చ చేసుకుని, గిరిజనంతో ఛీ అనిపించుకున్న అనుభవమేమో కాంగ్రెస్ పార్టీది…! ఫాఫం, ఎలాంటి పార్టీ చివరకు ఏ గతికి చేరిపోయింది… పార్టీకి జరిగే రాజకీయ నష్టాన్ని కూడా అంచనా వేసుకునే స్థితిలో కూడా లేదు… మరోవైపు చూద్దాం…
ఒడిశా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు… ఆయన తటస్థుడు… పెద్దగా కేంద్రంతో ఘర్షణకు వెళ్లడు… అసలు ఢిల్లీలోనే తను కనిపించడు… ఇతర పార్టీల గురించి, నాయకుల గురించి కూడా పెద్దగా మాట్లాడడు… మాట్లాడినా ఒక్క పొల్లు మాట జారడు… సంస్కారం వీడడు… కొందరు గాయిగత్తర ముఖ్యమంత్రుల భాషకు పూర్తిగా భిన్నం… అసలు ఢిల్లీకే పెద్దగా వెళ్లడు కదా… రోజూ రాజకీయాలే మాట్లాడాలనే ధోరణి నవీన్ పట్నాయక్‌లో అస్సలు కనిపించదు…
అలాంటిది ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం ఖరారు కాగానే ముందుగా అభినందనలు చెప్పాడు… మా మట్టిబిడ్డకు మా తొలిమద్దతు అని ప్రకటించేశాడు… దాంతో ఒడిశాలో గిరిజనం వోట్లను టార్గెట్ చేసుకున్న బీజేపీ ముందు కాళ్లకు బంధనాలు వేసేశాడు… ఏదో సందర్భంలో నవీన్ పట్నాయక్‌కు ద్రౌపది రాఖీ కడుతున్న ఫోటోలతో మయూర్’భంజ్ జిల్లాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి… నామినేషన్ల దగ్గర పార్టీ ప్రతినిధులు ఉన్నారు…
Ads
ప్రమాణ స్వీకారానికి తనే తరలివెళ్లాడు… మధ్యలో ఓసారి రాష్ట్రానికి వోట్ల అభ్యర్థనకు వచ్చిన ద్రౌపదితో కలిసి భోజనం చేసి, విజయాశీస్సులు అందించాడు… ఒడిశాలో 23 శాతం గిరిజనులు… వాటిపై కన్నేసిన బీజేపీ ఏ అస్త్రాన్ని వాడుతున్నదో, అదే అస్త్రంతో ఆ దూకుడును నిలువరించే ప్రయత్నం పట్నాయక్‌ది… (గత ఎన్నికల్లో బీజేపీ 11 గిరిజన సీట్లను గెలిస్తే బీజేడీ 22 గెలిచింది…)
ఆమె ప్రమాణస్వీకారం అయిపోయింది… ఐనా నవీన్ పట్నాయక్ ఫినిషింగ్ టచ్ ఇవ్వదలిచాడు… ఒడియాలో బాగా రీచ్ ఉన్న పత్రికల్లో తన పేరిట వ్యాసాలు అచ్చేయించాడు… (నిజానికి వివిధ పార్టీల నాయకులు తమ పేర్లతో పత్రికల్లో వ్యాసాలు రాయించుకోవడం కొన్నాళ్లుగా చూస్తున్న పైత్యమే… అవన్నీ ఎవరితోనో రాయించి, వేయించుకునే వ్యాసాలు… అందరికీ తెలుసు…)… నవీన్ పట్నాయక్ అదే పని తను కూడా చేయడం ఆశ్చర్యంగా అనిపించింది…
ఐ ద్రౌపది ముర్ము… అని స్టార్ట్ చేసి… కొంత ఎమోషన్ దట్టించి… ఆనాటి ఖారవేలుడి చరిత్ర దగ్గర నుంచి స్వాతంత్య్ర పూర్వం నాటి ముఖ్యుల పాలన కాలాల్ని ప్రస్తావిస్తూ… ఒక ఆదివాసీ మహిళ ఈ దేశపు అత్యున్నత కుర్చీలో కూర్చున్న ఓ మరుపురాని ఘట్టంలో నేనూ పాత్రధారినే… అదీ ఆనందంగా ఉంది అని చెప్పుకున్నాడు… ఒడిశా స్థానిక సంస్థల్లో మహిళలకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో చెప్పుకున్నాడు… తన పార్టీ లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా 33 శాతం మహిళలకు సీట్లు ఇస్తున్న తీరునూ వివరించాడు… మహిళ, ఆదివాసీ… ఈ రెండు అంశాల చుట్టూ తన ఎడిటోరియల్ తిప్పుకొచ్చాడు…
ఒడిశాలో కాంగ్రెస్ మట్టిగొట్టుకుపోయింది… బీజేపీ, బీజేడీ మధ్య పోరాటం… ఈ స్థితిలో కాంగ్రెస్ 23 శాతం వోట్లున్న గిరిజనం పట్ల ఎలా ప్రవర్తించింది..? ముఖ్యమంత్రి తన సహజ ధోరణులకు భిన్నంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు..? గిరిజనుల వోట్లు జార్ఖండ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో కూడా అధికమే… ద్రౌపది అభ్యర్థిత్వం ప్రకటించగానే మమత నాలుక కర్చుకుని, నష్టనివారణ కోసం, అరెరె, ఈమె పేరు ముందే చెబితే ఏకగ్రీవం చేసేవాళ్లం కదా అని దిద్దుకునే ప్రయత్నం చేసింది…
జార్ఖండ్ ముక్తిమోర్చా ‘మా ఆడపడుచు’ అని చెప్పుకుని… తను స్వతహాగా యాంటీ బీజేపీ శిబిరంలో ఉంటున్నా సరే, ఈ విషయంలో మాత్రం ద్రౌపదికి జైకొట్టింది… కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో ఏ వ్యూహమూ లేదు… ఏ కదలికా లేదు… రాజకీయాల్లో కదిలే ప్రతి పుల్ల కూడా ఇంపార్టెంటే… కాంగ్రెస్‌లో వర్తమాన వ్యవహారాల్ని పట్టించుకుని, పార్టీకి ఉపయుక్త ఆలోచనలు అందించేవాళ్లే లేకుండా పోయారా..?!
Share this Article