సర్, ఆ దిక్కుమాలిన యూట్యూబ్ చానెల్‌లో మరీ మూఢనమ్మకాల ప్రచారం ఈమధ్య ఎక్కువైపోయింది… వాళ్లే కాదు, ఇతరత్రా శాటిలైట్ టీవీలూ, బోలెడు యూట్యూబ్ చానెళ్లూ అదే పనిచేస్తున్నాయి… నియంత్రించలేరా..? ఎవరూ అడ్డుకోలేరా..? ప్రభుత్వానికి బాధ్యత లేదా..? ప్రజలు ఇలాంటి పెడధోరణులవైపు వెళ్లకుండా చూడటం దానికి కర్తవ్యం కాదా..? మన చట్టాలు ఏమంటున్నాయి..? అనడిగాడు ఓ మిత్రుడు…
నిజంగానే వీళ్లపై ఏం చర్యలు తీసుకోగలరు..? చూసేవాడు ఎప్పుడూ చెప్పేవాడికి లోకువే… వాడిదేం పోయింది..? ఏదో వాగుతాడు… పాటించాలా లేదానేది ప్రేక్షకుడి విజ్ఞత, జ్ఞానం మీద ఆధారపడి ఉంది… కానీ ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవడం నేరమే కదా… ఆ దిశలో ఇదీ తప్పే కదా… పర్సులో యాలకులు, నల్లకుక్కకు చపాతీ, జిల్లేడు చెట్టుకు బల్లితోక వంటి పేడకంపు, మూర్ఖపు సలహాలు నిజంగా దారుణం…
కొన్నాళ్లుగా ఇలాంటివి బోలెడు చూస్తున్నాం… సోషల్ మీడియా బూతులు తిట్టేకొద్దీ ఇంకా ఇవి ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు… ఓ శాటిలైట్ చానెల్‌లో పొద్దున్నే ఓ రంగుపూసల స్వామి చెప్పే సలహాలు నిజంగా ఒళ్లు జలదరింపజేస్తాయి… వీళ్లంతా మనల్ని పాత రాతియుగం వైపు తీసుకుపోతున్నారా..? చానెళ్ల ఓనర్లకు డబ్బు యావ తప్ప ఎలాగూ ఇంకేమీ ఉండదు… మరి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చా..? పెద్ద పెద్ద కేసులే ఎటూ తేలవు, ఎవరికీ ఏమీ కాదు, ఈ అంశాలపై ఎవరు నియంత్రించగలరు..?
Ads
ఒక చట్టం ఉంది… కానీ అది కర్నాటకలో మాత్రమే ఉంది… దాని పేరు Prevention and Eradication of Inhuman Evil Practices and Black Magic Act, 2017 …. సింపుల్‌గా Karnataka anti superstition Bill… సిద్ధరామయ్య ఎలాంటి నాయకుడనే చర్చ అనవసరం గానీ ఈ బిల్లు మీద మాత్రం మహా శ్రద్ధ చూపించాడు… ఒరిజినల్ డ్రాఫ్టు ప్రకారం అయితే ఈ చట్టం ప్రకారం హస్తసాముద్రికం, వాస్తు, జ్యోతిష్యం ఎట్సెట్రా చర్యలన్నీ నేరాలే అవుతాయి…
బీజేపీ వ్యతిరేకించింది… కర్నాటకలో నైతిక ఆధిపత్యం ఉన్న లింగాయత్ గ్రూపులు వ్యతిరేకించాయి… చివరకు 2017లో ఓ డైల్యూటెడ్ వెర్షన్‌ను ఆమోదించారు… దాన్ని 2020లో బీజేపీ ప్రభుత్వమే నోటిఫై చేసింది… చేతబడి వంటివే కాదు, సామాజికవర్గాలను కించపరిచే సంప్రదాయిక పద్ధతుల్ని కూడా ఈ చట్టం నిషేధిస్తోంది… ఉదాహరణకు… మడే స్నాన… అంటే బ్రాహ్మణులు తిని వదిలేసిన ఎంగిలి విస్తర్ల మీద దళితులు, ఇతర దిగువ సామాజిక వర్గాల ప్రజలు పొర్లుదండాలు పెట్టడం… ఇంకా ఈకాలంలో ఇదెంతవరకు కరెక్టు..?
దాదాపు 18 రకాల చర్యల్ని ఈ చట్టం ప్రకారం నిషేధించారు… ప్రోత్సహించడం, ప్రచారం చేయడం, ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెంచడం కూడా నేరమే… గొప్పలు చెప్పుకునే సీపీఎంకు కూడా కేరళ, బెంగాల్‌లలో ఇలాంటి చట్టాలు చేయడం చేతకాలేదు… (Subject to Correction)… మహారాష్ట్రలో the Anti-Superstition and Black Magic Act ఉంది… కర్నాటక మొదట్లో ప్రతిపాదించిన చట్టంతో పోలిస్తే కొంచెం లిబరల్… 2013 నుంచి 2019 వరకు దాదాపు 500 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి… మరి ఇతర రాష్ట్రాల్లో..? తెలియదు..!
ఇతర ఫ్యూడల్ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు చేస్తాయనే ఆశ కూడా లేదు… మరి ఈ పెడధోరణులు కొనసాగాల్సిందేనా..? పాలకులకు గనుక కడుపులో కాస్త రాజధర్మం మిగిలి ఉంటే… ఆ పదానికి అర్థం తెలిస్తే… ఏవో సెక్షన్లు దొరక్కపోవు… కానీ అధికారంలో ఉన్న పార్టీలకు అంత నిజాయితీ ఎక్కడుంది…!? అసలు జనానికి మంచి చేసే పనుల కోసం వాళ్లకు ఓపిక, తీరిక, టైం ఎక్కడున్నాయి..?!
Share this Article