అసలే అది మహా దేశముదురు పిండం… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద పెద్దోళ్లే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి జోలికి వెళ్లడానికి సందేహిస్తారు… స్వామి అనగానే చాలు, ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో పరుచూరి తనే స్వయంగా పలికిన ఓ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది… ‘‘చెప్పుతో కొడితే చెమ్డాలే ఊడతాయిరా… సెక్షన్లతో పెట్టుకుంటే చెడ్డీలు ఊడదీసేసి చెడుగుడు ఆడుకుంటాం’’… ఇదీ ఆ డైలాగ్…
సరిగ్గా ఓ పాయింట్ పట్టుకుని స్వామి కోర్టుకు ఎక్కాడంటే అదొక రచ్చే… సరే, విషయానికొస్తే… స్వామికి ఇప్పుడు ఓ బాలీవుడ్ పాపులర్ హీరో మీద మస్తు కోపమొచ్చేసింది… ఎవరో కాదు… అక్షయ్ కుమార్… తనను అరెస్టు చేయించి, నష్టపరిహారం వసూలు చేసి, కెనడాకు పంపించేస్తాను అంటున్నాడు స్వామి… ఆయన కోపానికి కారణమేంటయ్యా అంటే… అక్షయ్‌కుమార్ తీసిన రామసేతు అనే సినిమా…
ఫాఫం, దర్శకుడు అభిషేక్ శర్మ 2007 నుంచీ ఈ కథపై, ఈ సినిమాపై కుస్తీలు పడుతున్నాడు… మొత్తానికి ఎలాగోలా కరోనాకు ముందే స్టార్ట్ చేశారు… అక్షయ్ కుమారే డబ్బులు పెడుతున్నాడు ఈ సినిమాకు… ఈమధ్య ఈ ట్రెండ్ కూడా నడుస్తోంది కదా… పైగా అక్షయ్ కాస్త రైటిస్టు… రామసేతు కథకు బాగా కనెక్టయినట్టున్నాడు… ఇదీ ఈ సినిమా పూర్వరంగం… షూటింగ్ పూర్తి కావడానికి టీం పలుచోట్లకు టూర్లు వేస్తూ నానా ప్రయాసపడింది…
Ads
ఇప్పుడు ఆ సినిమా మీద స్వామి కన్ను పడింది… కస్సుమంటున్నాడు… అసలు రామసేతు కథలో ఈ స్వామి పాత్ర ఏమిటనేది దిగువన ఉన్న లింకు చదివితే కొంతవరకూ అర్థమవుతుంది…
అక్షయ్ కుమార్ ఏం చేశాడంటే..? ఆమధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు… అందులో స్వామి తాలూకు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ ఆర్డర్ కాపీని యథాతథంగా పెట్టేశాడు… దాంతో మండింది స్వామికి… అసలే కేసు కోర్టులో ఉంది… దానిపై ఏం మాట్లాడినా, బహిరంగంగా ఏం చర్చించినా సబ్ జుడీస్ అవుతుంది… ఈ అక్షయ్ ఏకంగా సినిమాలోనే వాడేసుకుంటున్నాడు అనేది తన కోపం…
పైగా సినిమా కథ గురించో, వివాదం గురించో తననేమీ ఎవరూ అడగలేదు… దాంతో అసలు ఆ రామసేతు సినిమా కథ మొత్తం నిజాల నుంచి జనాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని తెలుస్తోందనే ఆరోపణలో కేసు వేయబోతున్నాడు… ఈ కేసు వాదించేందుకు సత్య సభర్వాల్ అనే అడ్వొకేటుకు బాధ్యతలు అప్పగించేశాడు…
నిజానికి ఇది సున్నితమైన సబ్జెక్టు… ఈ వారధి మానవనిర్మితమా..? ప్రకృతిసహజమా..? భ్రమా..? సత్యమా..? అనే ప్రశ్నలపై కొన్ని దశాబ్దాలుగా బోలెడంత చర్చ, అధ్యయనం సాగుతూనే ఉంది… అదెప్పుడూ తేలదు… ఓ కంక్లూజన్ రాదు… ఈ స్థితిలో అక్షయ్‌కుమార్ సినిమాలో అంతిమంగా ఏం చెబుతాడు..? ఇది ఇంట్రస్టింగ్ ప్రశ్నే…
అయితే అక్షయ్ కోర్టులో ఉన్న ప్రతిపాదిత ‘‘రామసేతు ప్రాజెక్టు’’ జోలికి వెళ్లకపోయినా సరే… కమర్షియల్ విలువలకు మాత్రమే కట్టుబడి వ్యవహరించే బాలీవుడ్ కల్చర్ ఈ సబ్జెక్టును కూడా భ్రష్టుపట్టిస్తుందేమో అనే సందేహం చాలామందిలో ఉంది… ఈ పోస్టర్ రిలీజ్ సమయంలోనే నెటిజనం ఇలాగే రియాక్టయ్యారు… అసలే ఆర్ఆర్ఆర్‌లో క్రియేటివ్ ఫ్రీడం పేరిట చరిత్రను ఎంత దారుణంగా వక్రీకరించారో చూశాం కదా… ఇదేమో కోట్లాది మందికి స్పిరిట్యుయల్‌గా లింకైన అంశం… ఎలా తీశాడో, ఏం తీశాడో తెరపై చూడాల్సిందే… కానీ అప్పటిదాకా స్వామి ఆగేట్టు లేడు… అలా ఆగితే తనను స్వామి అని ఎందుకంటారు..?!
Share this Article