మహారాజా… ఖజానా వట్టిపోయినది, నాలుగు తన్ని వసూలు చేద్దామనిన ప్రజలు సైతం దివాలా తీశారు, మా జీతములూ ఆలస్యమవుతున్నవి, ఏం చేయమంటారు ప్రభూ……? అవును, మంత్రివర్యా, కర్తవ్యం బోధపడకుండా ఉన్నది… రాత్రి పొద్దుబోయాక గమనించాను, కోటలో ఎక్కడా దీపాల్లేవు, అడిగితే చమురు కొండెక్కినది ప్రభూ అని సమాధానం వచ్చినది… ముందయితే నా పట్టపుటేనుగుల్ని, స్వారీ గుర్రాల్ని అమ్మేయండి, వేటకుక్కల్ని కూడా…… అలాగే ప్రభూ…..
నవ్వొచ్చిందా..? అంతేమరి… ఖజానాలో చమురు ఆదా చేసుకోవాలి, అసలే కష్టకాలం… పొదుపు చేయకపోతే రాజుగారి భోజనంలో మటన్ పీసులూ మాయమవుతాయి… పాకిస్థాన్‌లో ఆ దుర్గతే ఇప్పుడు… ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా పెరిగిపోయింది… డాలర్‌తో పాకిస్థానీ రూపాయి మారకం రేటు పాపం పెరిగినట్టు పెరిగిపోతోంది… నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి… ఎంత దారుణంగా ఉందంటే… బాబ్బాబు, కాస్త చాయ్ తాగడాన్ని తగ్గించండర్రా… అని దేశం తన ప్రజల్ని బతిమిలాడుతోంది… ఇదీ ఉదాహరణ…
భారత ఉపఖండం అత్యంత ఇష్టంగా సేవించే పానీయం చాయ్… దాన్ని కూడా తగ్గించమంటోంది దేశం… ఎందుకు..? ఎక్కువ తేయాకు పొడిని కెన్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది పాకిస్థాన్… 2020లో 646 మిలియన్ డాలర్ల తేయాకును దిగుమతి చేసుకుంది… డబ్బులు డాలర్లలో కట్టాలి… విదేశీమారకద్రవ్యం అడుగంటింది… అదీ దుర్గతి…
Ads
మరీ ఘోరం ఏమిటంటే… జంతుప్రదర్శనశాలల్లో ఖరీదైన జంతువులను కూడా అమ్మేస్తోంది… మన తిండికే దిక్కులేదు… ఇక సింహాలకు, పులులకు మాంసం ఎలా పెట్టేది..? ఇప్పుడదీ పాకిస్థాన్ ఆందోళన… లాహోర్‌లోని జంతుప్రదర్శనశాల ప్రస్తుతం సింహాలు, పులులు, చిరుతలను అమ్మకానికి పెట్టింది… బహిరంగవేలం వేస్తామని ప్రకటించింది…
ఇక్కడ సమస్య వాటి అమ్మకంతో ఎంత ఆదాయం వస్తుందనేది కాదు… వాటిపై ఖర్చు ఎంత మిగులుతుందీ అని…! అన్నీ బాగున్నప్పుడు జూలో అవి ఉంటే బాగానే ఉంటుంది… కానీ అసలు మన తిండికే కటకట ఉంటే, వాటికేం పెట్టాలి..? ఆ జూలో 29 సింహాలున్నాయి… ఆగస్టు 11న అందులో 12 వేల వేస్తున్నారు… వాటితోపాటు 8 చిరుతలు కూడా… యానిమల్ యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గానీ ప్రభుత్వానికి వేరే దిక్కులేదు మరి… అసలే ఆ దేశంలో జిల్లేడు చెట్లు ఉండవు, నల్ల బల్లితోకలు దొరకవు…
ఒక్కో సింహానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర 700 డాలర్లు… ఏమో, ఒక్కో సింహానికి గరిష్టంగా 20 లక్షలైనా రాకపోవు అని ప్రభుత్వం ఆశ… ఇలా ఏమేం అమ్మేస్తే, ఖర్చు తగ్గించుకోవచ్చో సీరియస్‌గా ఆలోచిస్తోంది ఆ దేశ ప్రణాళిక శాఖ… మరి కొంపదీసి ఇండియా యుద్ధానికి దిగితే పరిస్థితి ఏమిటి..? ఏముంది… జిన్‌పింగ్ కాళ్లు…! అర్జెంటుగా రెండు లక్షల తూటాలు, లక్ష లీటర్ల చమురు అప్పివ్వండి ప్రభూ అని బతిమిలాడుకోవడమే… పోనీ, దావూద్, మసూద్ అజహర్ వంటి పదిమంది ఉగ్రసింహాల్ని ఏదో ఒక రేటుకు ఇండియాకు అప్పగిస్తే..?!
మొన్న ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టు చేయకుండా… తదుపరి ఐఎంఎఫ్ అప్పుల కోసం… అల్ జవహరి ఆపరేషన్‌లో అమెరికాకు సాయం చేసినట్టే… వీళ్ల జాడలు చెబితే చాలు, ఇండియా సైలెంటుగా వచ్చి ఏ డ్రోన్ నుంచో ఏ నింజా బాంబులో వేసి పోతుంది..! నో, నో, అడుక్కు తినైనా బతుకుతుంది గానీ, ఇండియాను తుకాపెకా ద్వేషించే దాని ఆత్మ అస్సలు అంగీకరించదు..!! ఇదే అదునుగా పీవోకేపై మీద మోడీ సైనికచర్యకు దిగుతాడా..? అబ్బే, అంత దృశ్యము లేదు…!! జుత్తు మీద, గడ్డం మీద జీఎస్టీ ఏ స్లాబులో వేయాలో ముందు తేలనివ్వండి…!!
Share this Article