Gottimukkala Kamalakar................ తెలుగీకరించి, స్థానికీకరించి, వ్యక్తిగతీకరించిన ఆంగ్లజోకు:
*****
నున్ననైన, నా తళతళలాడే బట్టబుర్రని చూసి నా బట్టలందరూ “నీకు బట్టతలా…?” అని అడుగుతారు.
గుళ్లో కలిసి గుడికొచ్చావా…? ఇంటర్వెల్లో కలిసి సినిమాకొచ్చావా…? లైబ్రరీలో కలిసి చదూకోడానికొచ్చావా…? హాస్పిటల్లో కలిసి హెల్తు బాగోలేదా..? అనేవాళ్లకేం చెబుతాం…?
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే అంత స్పష్టంగా మెరుస్తూ గుండు కనిపిస్తుంటే, “నీకు బట్టతలా…?” అని అడిగితే లోపల్లోపల మండిపోవడం తప్ప ఏమంటాం..?
మొదట్లో చేయని హత్యానేరం మోపబడ్డ జేవీసోమయాజుల్లా గద్గద స్వరంతో లోలోతుల్లోకి కుంచించుకు పోయేవాణ్ని..!
ఆ తర్వాత హత్య చేయబోయే ముందు అమ్రీష్ పురీ లా కోపంగా చూసేవాణ్ని..!
ఆ తర్వాత్తర్వాత మనవడి వయసే ఉన్నా తాతామనవడు సినిమాలో తాత యస్వీరంగారావులా నిర్వేదపు నవ్వునవ్వడంతో సరిపెట్టేవాణ్ని..!
హెరిడిటీ, పొల్యూషనూ, టెస్టోస్టిరాన్ అధికప్రవాహం బట్టతలకి కారణాలని ఎక్కడో చదివాను. కన్విన్సింగ్ గా అనిపించింది.
మా మేనమామలకీ, వాళ్ల మేనమామకీ, మా నాన్నగారికీ బట్టతలలే…! మనమీద ఆ హెరిడిటీ డబలింపాక్టు చూయించింది. హైదరాబాద్ లో ముప్ఫయ్యేళ్లనుండి ఉంటున్నాను. పొల్యూషను జుట్టుకు సాంబ్రాణి వేయమంటే, పొగబెట్టేసింది. మూడో విషయం గురించి పబిలీగ్గా మాట్లాడటం సభ్యత కాదు..!
మొదట్లో జుట్టున్న మారాజులను చూస్తే అసూయ కలిగేది. దేవుళ్లకీ, ఋషులకీ, ఆడవాళ్లకీ, సినిమా వాళ్లకీ అంతంత జుట్టు ఎందుకుంటుందో అర్ధం కాక లేని జుట్టు పీక్కునేవాణ్ని…!
తర్వాత జుట్టంతా పోయి పిసరంత జ్ఞానం వచ్చిన తర్వాత అక్కినేనీ, అమిత్ షా, ఆంద్రేఅగస్సీ, జెఫ్ బెజోసూ, షాన్ కేనెరీ తదితర బట్టబుర్ర గాళ్ల పేరూ, పలుకుబడీ, పైసా చూసాక నా ఛాతి కూడా కూసింత సేపు యాభయ్యారంగుళాలు పొంగింది..!
తద్దరిమిలా కలిగిన శునకానందంలో జుట్టున్న కేశవరావుల్నీ, సుకేశినుల్నీ చూస్తే ” మీకూ నాకూ తేడా కేవలం బొచ్చులో బొచ్చే…! మీరు వెంట్రుకల్ని చూసుకుని ఆనందించే అల్పసంతోషులు..!” అనుకుంటూ బోడి ఆనందం పొందుతూ మౌనంగా మనసులో వెర్రి కేకలు వేసేవాణ్ని..!
“మీకు బట్టతల నప్పిందండీ..!” అని ఎవరైనా పొరపాటున అంటే, శివగామి ప్రేమను పొందిన కట్టప్పలా ఊగిపోయేవాణ్ని..!
****
“ఒరే, బాబు గారి వీడియో కాన్ఫరెన్సులా ఏం చెబుతానని చెప్పి, ఏం చెబుతున్నావు రా…? జోకేది..? నీ సొంత జోకుడేంటి…? అనుకుంటున్నారా…??” ఇదిగో జోకు.
****
ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఓ సారి ప్రయాణం చేస్తుంటే ఎదురుగా ఓ సర్దార్జీ కూర్చున్నాడు. నాంపల్లి స్టేషన్ నుండి సికింద్రాబాద్ వెళ్లే లోగా పరిచయమై పోయాం. గంటలో మా గురించీ, మా కులాల గురించీ, మా పార్టీల గురించీ, మా సంసారాల గురించీ, మా సమస్తాల గురించీ మాటాడేసుకుని, ఆ తర్వాత మాట్లాడేకోవడానికి ఏవీ లేక ఓ రెండున్నర నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని చాలా బోరు ఫీలయ్యాం..!
ఆ తర్వాత ఏదో ఒహటి మాట్లాడుకోకపోతే, చచ్చిపోతామని మా ఇద్దరికీ అర్ధవయ్యింది..! అప్పుడు భారత స్వతంత్ర్య సంగ్రామంలో మా మా రాష్ట్రాల పాత్ర మాట్లాడుకుందామని సర్దార్జీ ప్రతిపాదించాడు. నేన్సరే అన్నాను. కాసేపు మేం గొప్ప అంటే మేం గొప్ప అని వాదులాడేసుకున్నాం…!
అప్పుడు మా రాష్ట్రం స్వతంత్ర్య సంగ్రామ యోధుడి పేరు చెప్పినప్పుడు నేను నీదో వెంట్రుక పీకుతాను; నీ రాష్ట్ర స్వతంత్ర్య సంగ్రామ యోధుడి పేరు చెప్పినప్పుడు నువ్వు నాదో వెంట్రుక పీకు…! అని పందెం కాసుకుని ఆట మొదలెట్టాం..!
“లాలా లజపత్ రాయ్” సర్దార్ నాది ఒక వెంట్రుక పీకాడు..!
“టంగుటూరి వీరేహం పెకాహం పంతులు” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
“భగత్ సింగ్” సర్దార్ నాది ఒక వెంట్రుక పీకాడు..!
“అయ్యదేవర కాళేశ్వరరావు” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
“ఉధమ్ సింగ్” సర్దార్ నాది ఒక వెంట్రుక పీకాడు..!
“సురవరం ప్రతాపరెడ్డి” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
“సుఖ్ దేవ్” సర్దార్ నాది ఒక వెంట్రుక పీకాడు..!
****
నాకింకో తెలుగు పేరు గుర్తుకు రావడం లేదు. అక్కడ నాకున్న తెలివితో, సర్దార్ తెలివి మీద నమ్మకంతో తొండాట మొదలెట్టాను.
“అధరాపురపు మురళీకృష్ణ” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“వృద్ధుల కళ్యాణరామారావు” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“కొచ్చెర్లకోట జగదీష్” నేను సర్దార్ దిఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“భండారు శ్రీనివాసరావు” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“సత్యానంద్ పైడిపల్లి” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“బుద్ధా మురళీ” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
భరద్వాజ రంగావజ్ఝల” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“శ్రీనివాసరావు మంచాల” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
” రాచెర్ల శివ” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడు తెల్లమొహం వేసాడు.
“గొట్టిముక్కల కమలాకర్” నేను సర్దార్ ది ఒక వెంట్రుక పీకాను..!
వాడి జుట్టు పల్చబడుతోంది. పాపం బిక్కమొహంతో ఆలోచించడం మొదలెట్టాడు. నా ఖర్మ కాలి, నా దరిద్రం పండి, నా జుట్టుకు పోగాలం దాపురించి వాడికో ఐడియా వచ్చింది. అలా “ఒక ఐడియా నా జీవితాన్ని మార్చేసింది…!
వాడు రెండు చేతుల్తో నా జుట్టంతా ఘాటిగా పట్టేసుకుని "జలియన్ వాలా బాగ్" అంటూ చివరి వెంట్రుక ముక్కతో సహా మొత్తం పీకేసాడు..!
Share this Article