చంపు… లేదా చచ్చిపో… యుద్ధరంగంలో శత్రువుతో ముఖాముఖి యుద్ధం జరుగుతున్నప్పుడు అదొక్కటే స్థితి… అనివార్యత… శత్రువును చంపితేనే నీకు బతుకు… లేదంటే శత్రువు చంపేస్తాడు… రెండేళ్ల క్రితం లఢఖ్ గల్వాన్ లోయలో చైనా, ఇండియా సైనికుల నడుమ జరిగింది యుద్ధమే… తుపాకులతో కాదు, ఇనుపకర్రలతో…
అక్కడ గాయపడిన మన సైనికులకు చికిత్స చేస్తున్నాడు ఓ ఆర్మీ వైద్యుడు… తన డ్యూటీయే అది… చైనా సైనికుల అనూహ్య దాడిలో గాయపడిన మనవాళ్లకు చికిత్స చేస్తున్నాడు… మనవాళ్లు కోపంతో ఎదురుదాడి చేశారు, చితకబాదారు, కొందరు అక్కడికక్కడే చచ్చిపోయారు… మన సైనికులకు చికిత్స చేస్తున్న మన ఆర్మీ వైద్యుడే శత్రుసైనికుల్లో గాయపడినవాళ్లకూ చికిత్స చేశాడు… కాపాడాడు…
ఇక్కడ ఓ ధర్మసందేహం… శత్రువును మనవాళ్లే హతమారుస్తుంటే, మన ఆర్మీ వైద్యుడే వాళ్లను కాపాడటం కరెక్టేనా..? తను సైనికుడా..? మనిషా..? ముందు మనిషి, తరువాతే సైనికుడు అంటూ సదరు ఆర్మీ వైద్యుడి మానవీయతకు చప్పట్లు కొట్టాలా..? శత్రువుకు ప్రాణాలు పోసినందుకు తప్పుపట్టాలా..? తను చేసింది రైటా..? రాంగా..? ఆలోచనల్ని కుదిపేసే ప్రశ్న… జవాబు కష్టం…
Ads
అబ్బే, ఇందులో పెద్ద కష్టమేముంది..? తను మనిషి, తను వైద్యుడు, ప్రాణాలు పోయడమే పని… తను చేసింది కరెక్టు అంటారా..? కానీ సదరు చైనా సైన్యం అలా అనుకోలేదు… వాళ్ల నెత్తుటిలోనే విశ్వాసరాహిత్యం, క్రౌర్యం ఉంటాయి… తనను అడ్డగించి, తీసుకుపోయి, గాయపడిన తమ సైనికులందరికీ చికిత్సలు చేయించి, అక్కడికక్కడే హతమార్చారు ఆ వైద్యుడిని..! ఇప్పుడు చెప్పండి, సదరు వైద్యుడి ధోరణి కరెక్టా..? రాంగా..?
- తన డ్యూటీ శత్రువుకు వైద్యం చేయడం కాదు, తను రెడ్ క్రాస్ వైద్యుడు కాదు… ఇండియన్ ఆర్మీ డాక్టర్… వీలైతే సరిహద్దు రక్షణకు శత్రువును చంపెయ్, లేదా చచ్చిపో అనే మైండ్ సెట్‌తో కదా ఉండాల్సింది… శత్రువు ప్రాణాలు కాపాడేందుకా ఈ దేశం నిన్ను ఆర్మీలో చేర్చుకున్నది..?
- పోనీ, వాడేమైనా మామూలు శత్రువులా..? నిలువెత్తు పిశాచరూపాలు… చివరకు జరిగింది అదే కదా… కాపాడిన వైద్యుడినే అమాంతం మింగేశారు… సో, యుద్ధంలో శత్రువు ఎప్పుడూ శత్రువే అనే ధోరణే కరెక్టు కాదా..?
- అప్పట్లో మా చైనా మా చైనా అని చంకనెక్కితే, నెహ్రూ బట్టతల మీద జెల్ల కొట్టి వేల చదరపు మైళ్లను ఆక్రమించేసింది చైనా… యుద్ధంలో ఓడించింది… మా జిన్‌పింగ్, నా దోస్త్ అని మోడీ కూడా సంబరపడితే… మోడీకి జెల్ల కొట్టి గాల్వాన్‌లో మనవాళ్లనే కొట్టిచంపింది చైనా… వాళ్ల పట్ల మానవత్వం ప్రదర్శించడం కరెక్టేనా..?
భారత ప్రభుత్వం మాత్రం ఇవన్నీ ఆలోచించలేదు… ఆ సమయంలో అనేకమందికి ప్రాణాలు పోశాడనే భావనతో ‘‘మరణానంతర వీరచక్ర’’ బహూకరించింది… మరణించిన ఆ వైద్యుడు నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖను చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణకు చేర్పించింది… 2023లో ఆమె లెఫ్టినెంట్ కాబోతోంది…
సదరు వైద్యుడి ప్రాణత్యాగం పట్ల ఈ దేశం సెల్యూట్ చేస్తోంది… అయితే ఒక డిబేట్ మాత్రం జరుగుతూ ఉంటుంది… ఈ ప్రస్తావన, ఈ చర్చ, ఈ ధర్మసందేహం ఎందుకు వస్తున్నాయంటే… హిందుస్థాన్ టైమ్స్‌కు చెందిన రాహుల్ సింగ్, ఇండియాటుడే టీవీకి చెంిన శివ అరూర్ కలిసి ఓ పుస్తకం రాశారు… India’s Most Fearless 3 దాని పేరు… గల్వాన్ యుద్ధదృశ్యాలను, మనవాళ్ల సాహసాలు, త్యాగాలు, చైనా సైనికుల ( People’s Liberation Army (PLA) దుష్కృత్యాలను వివరించే పుస్తకం… త్వరలో రిలీజ్ కాబోతోంది…
మన తెలంగాణ జవాను కల్నల్ సంతోష్ మరణించింది ఆ గల్వాన్ ఘర్షణల్లోనే… తనతోపాటు 22 మంది ప్రాణాలు కోల్పోయారు… 40, 50 మంది వరకూ చైనా తన జవాన్లను కోల్పోయినా… కేవలం నలుగురే అని చెబుతుంది ఇప్పటికీ… ఆ ప్రకటనలకు, ఆ అబద్ధాలకు కూడా ఈ పుస్తకం సవాళ్లు విసరబోతోంది… అప్పటి యుద్ధంలో పాల్గొన్న వాళ్లతో మాట్లాడి, రాసిన పుస్తకం అది… అందులో మనస్సును కుదిపేసేది ఆర్మీ వైద్యుడి పట్ల చైనా జవాన్ల క్రౌర్యం..!
కల్నల్ సంతోష్ మరణించాక ఆ బిహార్16 దళానికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన కల్నల్ రవికాంత్ ఏమంటాడంటే… ‘‘మనవైపు ఎందుకు సైనికుల ప్రాణాలు దీపక్ కాపాడాడో మనకు తెలుసు… చైనా వైపు ఎందరిని కాపాడాడో సంఖ్య తెలియదు… మా దాడిలో గాయపడి చావుబతుకుల్లో ఉన్న బోలెడు మంది తమ జవాన్లను చైనా సైన్యం అలాగే వదిలేసి పారిపోయింది… వాళ్లకు వైద్యం చేస్తూ దీపక్ ఏమన్నాడో తెలుసా..? ‘‘అవును, దేశరక్షణకు శత్రువు ప్రాణాలు తీసే శిక్షణను పొందాం… కానీ ప్రాణాలు పోయడంకన్నా ఉన్నత విలువ ఏముంటుంది..?’’
భారతీయ సైనిక వైద్యుడిగా… తన విధిని, తన కర్తవ్యాన్ని గాకుండా… ఒక మనిషిగా, ఒక నిజవైద్యుడిగా చైనా జవాన్లకు ఊపిరిపోసిన తనకు దక్కింది ఏమిటి..? తన చేతుల్లో కోలుకున్నవాళ్లే తనను కొట్టిచంపేశారు… ‘‘ఒకవైపు తను వాళ్ల జవాన్లకే చికిత్సలు చేస్తుంటే ఓ గుట్ట చాటు నుంచి రాళ్లతో దాడి చేశారు ఆ వైద్యుడి మీద… మన జవాన్లు కావాలనే చెల్లాచెదురుగా చైనా జవాన్ల శవాలు, గాయపడిన శరీరాలు పడి ఉన్న స్థలానికి దూరంగా ఉన్నారు… ఆ స్థితిలో మన దీపక్ మీద దాడి చేశారు… తన వీపు మీద, నుదురు మీద గాయాలయ్యాయి… ఓ ఇండియన్ మేజర్ మెగాఫోన్‌లో అరుస్తూ చెబుతూనే ఉన్నాడు… ‘‘ఒరేయ్, మీ జవాన్లకే చికిత్స చేస్తున్నాడురా’’ అంటూ… ఐనా దీపక్ చికిత్సలు ఆపలేదు… కానీ గాయపడిన తనను పట్టుకుపోయి, చికిత్సలు చేయించుకుని తరువాత ప్రాణాలు తీశారు… అదీ చైనా జవాన్ల తత్వం…
‘‘వాళ్లు ఎంత సిద్ధమై వచ్చారంటే… రక్షణకు తగిన దుస్తులు, హెల్మెట్లు… ఒకేసారి లైట్లు వెలిగించి, తాత్కాలికంగా మన కళ్లను టార్గెట్ చేసే ఎల్‌ఈడీ పొదిగిన లాఠీలు… మొదట మనకు నష్టం జరిగింది… తరువాత మనవాళ్లు రెచ్చిపోయారు…’’ అంటున్నాడు హవల్దార్ ధరమ్‌వీర్… ఈరోజుకూ గల్వాన్‌లో ఉద్రిక్తతలు సడలలేదు… ఇరువైపులా పూర్తి స్థాయి యుద్ధానికి సరిపోయేట్టు ఆయుధాలు, సైనిక పటాలాల మొహరింపు కొనసాగుతోంది… సో, పుస్తకంలో కంటెంట్ ఆసక్తికరమే… కల్పనాత్మక రచన కాదు… రిపోర్టింగ్…! వార్ రిపోర్టింగ్…!!
Share this Article