కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ మాట అటుంచితే… ఇప్పటికీ ఒమిక్రాన్ వెరయిటీ వదలడం లేదు… సోకిందని సందేహమొస్తే చాలు, రోగి మెడికల్ షాపు వద్దకు వెళ్తున్నాడు… నాలుగు డోలో-650 తెచ్చుకుంటున్నాడు… వేసుకుంటున్నాడు… నమ్మినా నమ్మకపోయినా రియాలిటీ అదే… మార్కెట్‌లో బోలెడు పారాసెటిమాల్ టాబ్లెట్లు దొరుకుతాయి… మరి డోలో-650 మీదే ఎందుకు నమ్మకం పెరిగింది..? హైడోస్ అనేనా..?
నిజానికి డోలో-650 ప్రిస్క్రయిబ్ చేయాలని సదరు కంపెనీ భారీ ఎత్తున డాక్టర్లకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదేమో… ఎందుకంటే..? వద్దంటే సేల్స్… ఒకే సంవత్సరం 350 కోట్ల టర్నోవర్ చేసింది… 2021లో 400 కోట్లు… ఇప్పుడు వివాదం ఏమిటంటే..? డోలో-650 సిఫారసు చేయడం కోసం డాక్టర్లకు సదరు కంపెనీ 1000 కోట్ల కానుకలు ఇచ్చిందని భారత మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ల సమాఖ్య ఆరోపించింది… సుప్రీంలో ఓ పిల్ వేసింది… వెంటనే సుప్రీం కేసు విచారణకు తీసుకుంది…
దీనికిముందు సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు) ఈ డోలో-650 ట్యాబ్లెట్ల తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ మీద 9 రాష్ట్రాల్లోని 36 కేంద్రాల మీద దాడులు చేసింది… పన్ను ఉల్లంఘనలు, డాక్టర్లకు అనైతిక కానుకలు గట్రా కనిపెట్టినట్టు చెప్పింది… హఠాత్తుగా సదరు రిప్రజెంటేటివ్స్ ఫెడరేషన్ పిల్ వేసింది… నిజానికి ఏ కంపెనీ డ్రగ్ అయినా సరే, డాక్టర్లకు తాయిలాలు, అడ్డగోలు కానుకలు ఆఫర్ చేసి, లోబరుచుకునేది ఈ రిప్రజెంటేటివ్సే… వాళ్లే ప్రత్యేకించి ఒక్క ట్యాబ్లెట్ మీద ఆరోపణలు చేయడం ఏమిటో…
Ads
ఈనేపథ్యంలో సదరు కంపెనీ స్పందించి… మా టర్నోవరే 350, 400 కోట్లు ఉంటే, 1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం ఏమిటంటోంది..? సరే, వివాదం సుప్రీంలో ఉంది కాబట్టి డోలోను వదిలేద్దాం… కానీ సుప్రీం ఈ దేశ ప్రజానీకానికి మంచి జరగాలంటే, న్యాయం దక్కాలంటే ఈ పిల్ విచారణ పరిధిని విస్తృతం చేస్తే మంచిదేమో… కరోనా కాలంలో రెమ్‌డెసివర్ వంటి మందుల అమ్మకాలు పెద్ద స్కామ్… వేక్సిన్ ధరలు పెద్ద సందేహం… మెడికల్ డయాగ్నసిస్ పరీక్షల్లో డాక్టర్లకు కమీషన్లు, మందులు రాయడంలో తాయిలాలు… మొత్తం ఈ మొత్తం యవ్వారాలపై సుప్రీం దృష్టి పెడితే కోట్ల మంది రోగులకు న్యాయం చేసినవారవుతారు… ప్రభుత్వానికి ఎలాగూ చేతకాదు…
కార్పొరేట్ హాస్పిటళ్ల రేట్లు ఈ దేశ ప్రజానీకానికి మరో శాపం… ఎవడికైనా కాస్త ఎక్స్‌పెన్సివ్ రోగం వస్తే చాలు, ఇల్లు గుల్ల, ఒళ్లు గుల్ల… కరోనా కాలంలో ప్రతి డ్రగ్ కంపెనీ అడ్డగోలుగా రేట్లు పెంచేసుకుంది… ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారు… అసలు ఎవరికైనా నియంత్రణ ఉందా..? మోడీ ప్రభుత్వ వైఫల్యాలలో ఇదీ ఒకటి… సుప్రీం ఈ డోలో పిల్ విచారణను అవసరం మేరకు విస్తరిస్తే నిజంగా ఈ దేశప్రజానీకానికి అనేక రకాలుగా మేలు… ప్లీజ్, యువరానర్…!
Share this Article