‘‘ఏమోయ్ మోడీ… చంద్రబాబు నిన్ను వెన్నుపోటు పొడిచి ఉండవచ్చుగాక… యూపీయే ప్రభుత్వంలోకి వస్తుందనే భ్రమల్లో పడి, నీ దోస్తీని తెంచుకుని, సోనియాకు ఆర్థికసాయం చేసి, ఇతర పార్టీలనూ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చుగాక… తరువాత బొక్కబోర్లాపడి, తన సొంత రాష్ట్రంలోనే 23 సీట్లకు పరిమితమై మూతిపళ్లు రాలిపోయి ఉండవచ్చుగాక… అంతకుముందే మోడీని తీవ్రంగా వ్యతిరేకించి, రాజకీయ కారణాలతో అంతకుముందు నీతో మళ్లీ దోస్తీ చేసి ఉండవచ్చుగాక… ఐనాసరే, మళ్లీ నీకు చంద్రబాబే శరణ్యం… వెంటనే తనతో దోస్తీ చేసుకో, లేకపోతే చెడిపోతవ్, నష్టపోతవ్, ఆలోచించుకో…
తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నవ్, చంద్రబాబుతో చేతులు కలుపు, కేసీయార్ తాటతీద్దాం… అటు ఏపీలోనూ జగన్ తోలు వలుద్దాం… ఇంకా నీకు అర్థం కావడం లేదు, తెలంగాణలో ఆంధ్రుల వోట్లే నిర్ణయాత్మకం, అందులోనూ కమ్మ వోట్లే కీలకం… వాళ్లు ఎటువైపు ఉంటే వాళ్లదే అధికారం… సో, అవసరం నీది, చంద్రబాబు చేతులు చాచి, ఆహ్వానిస్తున్నాడు, అందుకో… లేకపోతే భ్రష్టుపట్టిపోతవ్…’’… దాదాపుగా ఆ క్యాంపు ప్రచారం అలాగే ఉంది… భలే మార్కెటింగ్…
ఆంధ్రజ్యోతిలో ఏబీఎన్ ఆస్థాన డిబేట్ కోఆర్డినేటర్ పర్వతనేని వెంకటకృష్ణ రాసిన వ్యాసం ఇలాగే ఉంది… అంతేకాదు, నిజంగానే ఆ కోణంలోనే మళ్లీ చంద్రబాబు-మోడీ దోస్తీ కోసం విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి… మోడీ నమ్ముతాడా..? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే ముదురు సమీకరణం తెలిసినవాడు కాబట్టి మళ్లీ చంద్రబాబుతో చేతులు కలుపుతాడా..? గతంలో చంద్రబాబు పొడిచిన వెన్నుపోటును మరిచిపోతాడా..? చంద్రబాబు గుణమే అది, నేనే జాగ్రత్తగా ఉంటే సరి అనుకుని మళ్లీ సర్దుబాటు చేసుకుంటాడా..? చంద్రబాబు గోళ్లను, చేతుల్ని జాగ్రత్తగా గమనిస్తూ కౌగిలించుకుంటాడా..?
Ads
ఎలాగూ వెంకయ్యనాయుడికి ఇప్పుడు పనిలేదు… మళ్లీ చంద్రబాబు క్యాంపు కోసం పనిచేస్తుంటాడా..? ఎలాగూ తను చంద్రబాబు కవలసోదరుల్లాగా పనిచేసినవాళ్లే కదా… మళ్లీ చక్రం తిప్పుతున్నాడా..? అందుకేనా సుజనా చౌదరి పూనుకుని, రామోజీరావుకు అమిత్ షాకు నడుమ భేటీ ఏర్పాటు చేశాడా..? మునుగోడు మీటింగుకు వచ్చే అమిత్ షా ఈ ‘‘తెలుగుదేశంతో పునఃసయోధ్య’’ ప్రయత్నాలకు వోకే అంటాడా..? మధ్యవర్తిగా రామోజీ మళ్లీ యాక్టివ్ పాత్ర పోషించబోతున్నాడా..?
రామోజీ ఫిలిమ్ సిటీలో అమిత్ షా రహస్యంగా చంద్రబాబును కూడా కలవబోతున్నాడా..? ఏపీలో, తెలంగాణలో కలిసి పనిచేద్దామనే ప్రతిపాదన మీద మళ్లీ సీరియస్ చర్చలు సాగుబోతున్నాయా..? తరువాత నోవాటెల్ హోటల్‌లో ఈ దిశలో అమిత్ షా కొందరు కీలక నేతల్ని కలవనున్నాడా..? నిజంగానే పవన్ కల్యాణ్‌ను బంగాళాఖాతంలో ముంచేసి, చంద్రబాబుతో చేతులు కలిపేసి, జగన్‌తో దోస్తీకి కత్తెర వేసేసి, తెలంగాణలో తమ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో బీజేపీ వెంపర్లాడుతుందా..?
తెలంగాణ కమ్మ సెటిలర్ల కోసమేనా ఏపీ బీజేపీని అమరావతి పాదయాత్రల కోసం బీజేపీ హైకమాండ్ ఆదేశించిందా..? ఇవన్నీ ప్రస్తుతానికి అధికారికంగా, బాహాటంగా జవాబులు దొరకని ప్రశ్నలు… న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన ఓ ఫస్ట్ పేజీ స్టోరీ ఆసక్తికరంగా ఉంది… అది ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది…
ఇవన్నీ కాసేపు పక్కనపెడితే… ఓ న్యూట్రల్ కోణంలో పరిశీలిస్తే…. చంద్రబాబు మళ్లీ మోడీతో చేతులు కలపడానికి డెస్పరేటుగా ఉన్నాడు, అదే సమయంలో, అదే కోణంలో నానా ప్రయత్నాలూ చేస్తున్నాడనేది వాస్తవం… మోడీ షా మాత్రం చంద్రబాబును నమ్మలేక, తిరిగి చేతులు కలపలేక, కలపడానికి మనస్సు రాక ఆలోచనల్లో పడిందనేది నిజం… బీజేపీకి ఏపీలో ఏ ప్రయోజనాలూ లేవు ఇప్పుడు… స్థూలంగా దానికి జగన్ అయినా ఒకటే, చంద్రబాబు ఐనా ఒకటే… కాకపోతే చంద్రబాబు వెనుక నిలబడితే ఓ భయం… మళ్లీ ఎప్పుడు వెన్నులో లోతుగా ఏం దిగబడుతుందో తెలియదు…
ఈ నేపథ్యంలో రామోజీరావు మళ్లీ యాక్టివ్‌గా మధ్యవర్తిత్వానికి రెడీ అయిపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు… చంద్రబాబు కోసం తను ఏమైనా చేస్తాడు..? దత్తపుత్రుడు…! వెంకయ్యనాయుడు సరేసరి… ఇదంతా సరే, కమ్మ సెక్షన్ గనుక ఖమ్మం, నిజామాబాద్ సహా ఇతర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని సీట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటే, తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో అధికారానికి బాటలు పరిచే పరిస్థితే ఉంటే కేసీయార్ ఊరుకుంటాడా..? నిజంగా తెలంగాణ కమ్మ సెక్షన్ చంద్రబాబు పట్ల విధేయంగా ఉందా..? అది పెద్ద ప్రశ్న… దీనికి జవాబు ఇప్పట్లో కష్టం… తుమ్మల, మండవ తదితరులు చెప్పాలి…!!
Share this Article