జెర బైఠీయే… అని పదే పదే బీహార్ సీఎం నితిశ్‌ను తెలంగాణ సీఎం కేసీయార్ చేయి పట్టుకుని కూర్చోబెట్టడం… అరె, వాళ్ల ట్రాప్‌లో పడకయ్యా స్వామీ, ఇప్పటికే బోలెడు టైం తీసుకున్నాం, పద, లే, పోదాం అని నితిశ్ పదే పదే వారించడం… నిన్నంతా నవ్వు పుట్టించింది… దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసేసి, ఏదో విమర్శకు ప్రయత్నించింది గానీ అది పెద్దగా పేలలేదు… నిజానికి అందులో కేసీయార్‌ను రెండు భిన్నరకాల్లో చూడొచ్చు…
1) జర్నలిస్టులను వెక్కిరిస్తూ, హెచ్చరిస్తూ, మాటలతో దాడిచేస్తూ గంటల కొద్దీ ప్రెస్‌మీట్ పెట్టగలడు కేసీయార్… ఎక్కడ..? హైదరాబాదులో..! అదొక చోద్యం… చాలామంది అప్‌కంట్రీ జర్నలిస్టులు వెళ్లడమే మానేశారు… కానీ దీనికి భిన్నమైన కోణం వేరే… 2) ప్రధాని మోడీలాగా మీడియాను ఫేస్ చేయడానికి తను భయపడటం లేదు… మాట దాటవేస్తాడా, ఏదో అబద్ధం చెబుతాడా, ఇంకేదో చెప్పి విలేకరి నోరు మూయిస్తాడా అనేది వేరే సంగతి… కానీ ఎంతసేపయినా మీడియాను ఫేస్ చేస్తాడు… కానీ..?
బీజేపీ వాళ్లు చెప్పినట్టు ఇందులో కేసీయార్ ఇజ్జత్ పోయిందేమీ లేదు… మీడియా ఏదో అడుగుతోంది… చాలా కీలకప్రశ్నలే… ‘ప్రధానమంత్రి అభ్యర్థిగా నితిశ్‌ను ప్రకటిస్తారా..? రాహుల్-కాంగ్రెస్‌ను కలుపుకుపోతారా..? అవి జరగకుండా బీజేపీముక్త భారత్ సాధ్యమేనా..?’ మీడియా వైపు నుంచి అడగవల్సిన, అడగదగిన ప్రశ్నలే… నితిశ్‌కే కాదు, ఉత్తరాది లీడర్లు ఇలాంటి ప్రశ్నలు ఫేస్ చేయరు… కానీ కేసీయార్ ఏదో తనదైన జవాబు చెప్పడానికి ప్రయత్నించాడు…
Ads
ఉత్తరాది లీడర్లు మీడియాతో అంతసేపు మాట్లాడరు… తమను మీడియా మాటల ట్రాపులో పడేసి, ఏదేదో రాసేస్తుందని వాళ్ల భయం… పైగా వాళ్లకు ఓ అలవాటు… జస్ట్, తాము చెప్పాలనుకున్నది చెప్పేసి, వెళ్లిపోతారు… పెద్దగా మాటామంతీ, ప్రశ్న-జవాబుల ఎపిసోడ్లను ఎంకరేజ్ చేయరు… కానీ సౌత్ ఇండియా లీడర్లు, ప్రత్యేకించి కేసీయార్ వంటి నాయకులు అలా అవాయిడ్ చేయరు… (జగన్ దీనికి మినహాయింపు… తను మీడియాను ఫేస్ చేయలేడు, చేయలేదు… యెల్లో మీడియా ప్రశ్నలతో ఇరుకునపెట్టేసి ఆడుకుంటుందని భయసందేహాలు కావచ్చు…)
సేమ్, కేసీయార్ పగిడీ చుట్టిండు, తల్వార్ పట్టిండు… రాష్ట్రాన్ని బట్టి వేషం వేస్తాడని మోడీని పదే పదే వెక్కిరిస్తూ ఉంటడు కదా, మరి తను వేసిన వేషాల మాటేమిటి..? అనే విమర్శలు కూడా వచ్చినయ్ సోషల్ మీడియాలో… నిజమే, కేసీయార్‌ను వేరే మతవేషంలో చూడటం తొలిసారి… ఏమాత్రం నప్పలేదు కూడా… పైగా అదీ గులాబీ రంగే… దీనికితోడు ఆ టోపీ ఎందుకు పెట్టిండో అర్థం కాలేదు… పోనీలే, రాజకీయాలంటేనే రకరకాల వేషాలు… అది వదిలేస్తే… నిజానికి ఇజ్జత్ పోయింది కేసీయార్‌ది కాదు… ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులది… కేసీయార్ తమ రాష్ట్రానికి వచ్చి, తమ పరువుకే పరోక్షంగా పంక్చర్ కొడుతుంటే ఆ సోయి కూడా లేదు వాళ్లకు… ఎలాగంటే..?
పంజాబ్ రైతులు కొందరు ఢిల్లీ ముట్టడి సమయంలో చనిపోయారు… ఆ సంఖ్య, వాస్తవ కారణాలు, నిర్దారణ ఏమీ లేదు… కేసీయార్ వెళ్లి పరిహారాలు ఇచ్చివచ్చాడు… (ఇక్కడ ప్రభుత్వ సాయం కోసం బోలెడు మంది బాధితులు, వాళ్ల గోస పట్టదు గానీ ఎక్కడెక్కడో, ఎవరెవరో చనిపోతే, వాళ్ల కన్నీళ్లు తుడిచిరావడం ఏ రాజనీతి..?)
కేజ్రీవాల్ తను మద్దతు ఇచ్చాడు రైతు ఆందోళనలకు, దాని ప్రతిఫలం కూడా తీసుకుని, పంజాబ్‌లో గెలిచాడు, ప్రభుత్వం ఏర్పడింది… మరి ఏదో దూరప్రాంత ముఖ్యమంత్రి వచ్చి, పరిహారాలు ఇస్తుంటే తన ఇజ్జత్ పోయినట్టు ఫీల్ కావల్సింది కేజ్రీవాల్… తనకెందుకు చేతకాలేదు..? ప్రజల్లో కూడా ఈ ఆలోచన వస్తుంది కదా… పైగా దగ్గరుండి, అదేదో ఘనకార్యం అన్నట్టుగా చెక్కులు పంపిణీ చేయించాడు… గల్వాన్ మృతుల పరిహారాలకు సంబంధించి బీహార్‌లో పరిహారాలు ఇస్తుంటే మరి మాకెందుకు చేతకాలేదు అని నితిశ్ కదా ఇజ్జత్ పోయినట్టు ఫీల్ కావల్సింది…
సేమ్, గల్వాన్ మృతులకు సంబంధించిన పరిహారాలు… అసలు ఎక్కడెక్కడి సైనికులో వాళ్లు..? వాళ్ల కుటుంబాలకు ఓ రాష్ట్రం పరిహారం ఇవ్వడం ఏమిటి..? కేసీయార్ అన్నిరకాల రాజనీతులను వెక్కిరించి, పకపకా నవ్వగలడు… ఇది అదే… రేప్పొద్దున ఎక్కడ ఏ సైనికుడు మరణించినా తెలంగాణ ప్రజలు తమ సొత్తు నుంచి పరిహారాలు ఇవ్వాలా..? సాధ్యమేనా..?
కల్నల్ సంతోష్‌బాబు మరణిస్తే, సోషల్ మీడియా పెద్దపెట్టున విరుచుకుపడితే తప్ప కేసీయార్‌కు మెలకువ రాలేదు… అలాంటిది గల్వాన్ మృతుల మీద ఇంత సానుభూతా..? అంతా జాతీయ రాజకీయాల దిశలో కేసీయార్ వేసే అడుగులు… పగిడీలు, ఈ పరిహారాలతో జాతీయ రాజకీయాల్లోకి దూసుకుపోతాను అని గనుక అనుకుంటే, అదీ అసలు ఇజ్జత్ పోయే వ్యవహారం అవుతుంది… అయితే కేసీయార్ ఇవన్నీ తెలియనివాడు కాదు..!!
Share this Article