నిజానికి కొన్ని పరిపాలనాంశాల కోణంలో, బతుకును కుదేలు చేస్తున్న ధరల కోణంలో, జనం గోసపట్టని పాలకస్వభావం కోణంలో, కార్పొరేట్ దాస్యం కోణంలో…. మోడీ అంటే నాకు గట్టిగానే వ్యతిరేకత ఉంది..! మనలాంటి వాళ్లు ఎందరున్నా సరే, వర్తమానంలో తనంత అదృష్టవంతుడైన, బలవంతుడైన రాజకీయ నాయకుడు లేడు… ప్రధానిగా ఫుల్ మెజారిటీతో, అంతర్గత చికాకులు కూడా లేకుండా రెండు టరమ్స్ పాలించడం గురించి కాదు… ప్రతిపక్షమంటూ గతి లేకుండా పోయింది కాబట్టి మోడీకి ఉపయుక్తమైంది… యూపీయే అవినీతిపాలన కూడా ఉపకరించింది… చాలా రీజన్స్ మోడీకి సహకరించాయి…
మనం చెప్పుకునేది అది కాదు… ఓ ఆధ్మాత్మిక సుడి… తను స్వతహాగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్, పెళ్లయిన బ్రహ్మచారి, సన్యాస జీవనం, దైవభక్తి ఉన్నవాడు… కొన్ని వేల మంది శ్రీరాముడి భక్తులు మరణించిన అయోధ్య ఉద్యమం తెలుసు కదా… ఇప్పుడు తాపీగా తను వెళ్లి భూమి పూజ చేశాడు… అదృష్టమే… హిస్టారిక్ టెంపుల్ కదా… బహుశా వచ్చే ఎన్నికలలోపు దర్శనాలకు అనుమతిస్తారా..? చూడాలి… మొదటి దశను ప్రారంభించినా సరే, మోడీకి మరో అదృష్టం దక్కబోతోంది…
వారణాసిలో తనే స్వయంగా పోటీచేశాడు… ఇంతకుముందు ఘాట్ల నుంచి ప్రధాన గుడి దగ్గరకు తొవ్వ సరిగ్గా ఉండేది కాదు… అరాచకం… వారణాసి కారిడార్ పేరిట చికాకు చిల్లర దుకాణాల్ని తీసేసి, వీథుల్ని వెడల్పు చేసి, భక్తగణానికి నచ్చే ఓ కారిడార్ నిర్మించాడు… అందులో సగం శ్రమ యోగిదే అయినా పేరు మోడీదే కదా… ఇక ఇప్పుడు ఉజ్జయిని… 856 కోట్ల ప్రాజెక్టు… 316 కోట్ల మొదటి దశను మోడీ నిన్న ప్రారంభించాడు… అందరూ ఫోటోలు వేస్తారు, రాస్తారు… లౌకిక పాతివ్రత్యానికి గజగజలాడే తెలుగు మీడియా తప్ప… మనం అసలు కథ చెప్పుకుందాం…
Ads
అయోధ్యను కాసేపు పక్కన పెట్టండి… దేశంలో జ్యోతిర్లింగాలు తెలుసు కదా… గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లిఖార్జునుదు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారనాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాశిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, దియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు...
సోమనాథుడి ఆలయాన్ని మనకు స్వాతంత్య్రం రాగానే భవ్య పునర్నిర్మాణం చేసేశారు… నెహ్రూ, గాంధీ ఎంత గింజుకున్నా ఆగలేదు… వారణాసి అయిపోయింది… ఇప్పుడు ఉజ్జయిని ఓ కళను సంతరించుకుంది…ఈ రెండింటి పుణ్యం మోడీ దక్కించుకున్నాడు… 6, 7 శతాబ్దాలలో ఈ ఉజ్జయినిలో అవంతిక అని ఓ కేంద్రం ఉండేది… అక్కడ హిందూ గ్రంథాలను అధ్యయనం చేయించేవాళ్లు… తరువాత బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు వంటి జ్యోతిష్కులు, గణికవేత్తలు కూడా ఈ నగరాన్నే తమ ఇంటిగా చేసుకున్నారు… ఇదే మధ్యప్రదేశ్, మందాతలో ఓంకారేశ్వరుడు ఉంటాడు, అదీ అభివృద్ధికి నోచుకోవాల్సి ఉంది… కేదారనాథుడు దగ్గర డెవలప్‌మెంట్ చాన్స్ తక్కువ… ఐనా కొంత చేయాల్సి ఉందంటారు…
మహారాష్ట్రలోనే రెండు ఆలయాలుంటాయి… ఒకటి భీమశంకరాలయం, మరొకటి త్రయంబకేశ్వరుడి గుడి… ఇది గోదావరి జన్మస్థలి… పితృకర్మలకు విశేషం… కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎమోషనల్ బాండేజీ ఉంది… కానీ అక్కడ ఒక్క పైసా కూడా పెట్టడం లేదు… సేమ్, దియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు కూడా ఎవరి పట్టింపూ లేక పెద్దగా అభివృద్ధికి నోచక, భక్తజనం అసంతృప్తికి కారణమవుతున్నారు… సరిగ్గా ప్లాన్ చేస్తే రామేశ్వరం పర్‌ఫెక్ట్ టెంపుల్ టూరిస్ట్ స్పాట్ అవుతుందేమో…
మీరు ఇవన్నీ చెప్పండి… ఏమయ్యా మీ ప్రధాని, మీ పార్టీకి గుళ్లు, మతం తప్ప మరో అభిమతం లేదా..? ఇదేనా ప్రాధాన్యం..? అని అడిగి చూడండి… అబ్బే, మన ప్రజాస్వామిక దేవాలయం పార్లమెంటు కారిడార్‌ను అద్భుతంగా డెవలప్ చేశాం కదా అంటారు బీజేపీ అధికార ప్రతినిధులు… దానిపై పెట్టిన అశోకుడి నాలుగు సింహాల మొహాలపైన కూడా మనవాళ్లు రచ్చ రచ్చ చేశారు తెలుసు కదా…
మొత్తానికి ఇవీ నేను జాతికి సమర్పించిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని చెప్పడానికి పెద్దగా ఏమీలేకపోయినా… సర్దార్ పటేల్ విగ్రహం, పార్లమెంట్ ఎట్సెట్రా చూపిస్తారు… పేరుకు జాతీయ ప్రాజెక్టు కదా… చంద్రబాబు చెర కూడా వీడింది కదా… మరి పోలవరం మాటేమిటో ఎప్పుడైనా ఒక్క మాటయినా మాట్లాడావా మోడీ..? ప్రాజెక్టులు అసలైన దేవాలయాలు…! రైతులు తరతరాలు చెప్పుకుంటారు, విగ్రహాలు పెట్టి పూజిస్తారు..!! ఉదాహరణ :: సర్, అర్ధర్ కాటన్…!!
Share this Article