నిజానికి ఇది చాన్నాళ్ల క్రితం రాసిన కథనం… రెండేళ్లు దాటింది… ఇప్పుడు ఉజ్జయినిలోని మహాకాలుడి గుడి వార్తల్లోకి వచ్చింది కదా… అసలు ఏమిటీ ఈ గుడి విశిష్టత..? ఉంది… దేశంలో ఏ శివుడి గుడికీ లేని విశిష్టత ఉంది… సంపూర్ణంగా శివుడిలో ఐక్యం కావడం… కాస్త అనాగరికంగా కనిపించే పూజే అయినా, అఘోరా పూజలతో పోలిస్తే నథింగ్… ఐనా శివుడికి అట్టహాసాలు, ఆడంబరాలు పడవు… స్మశానాల్లో పాములు మెడలో వేసుకుని, చర్మపు పంచె ఒకటి అడ్డంగా కట్టి, రేయింబవళ్లూ తిరిగే లయకారుడు కదా…
అందుకే అభిషేకాల్ని ఇష్టపడతాడు… అంతే… ఇక నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు… చాలామంది గతంలో కాశికి వెళ్లి, అక్కడే చిన్న గదులు తీసుకుని, చనిపోయేదాకా అక్కడే ఉండి, మరణించాక ఘాట్‌లో దహనానికి ముందే డబ్బులు కట్టిపెడతారు… అలా ఐక్యం అయిపోతుంటారు… ఇప్పుడు చాలామంది యాభై దాటాక కాశికి వెళ్తున్నారు… 11 రోజులు… అక్కడే ఉండాలి… పొద్దున సాయంత్రం గుడి… మిగతా వేళల్లో ఫోన్లు ఆపేసి, ఏ ఒత్తిళ్లూ లేకుండా తిరగడం, ధ్యానం చేయడం… సాత్వికాహారం… ఇదొక ట్రెండ్ ఇప్పుడు…
మరి సంపూర్ణంగా శివుడిలో ఐక్యమైపోయే పద్ధతి ఏమిటి..? అది కాశీలో కాదు, ఉజ్జయినిలో… ఓపట్టాన నమ్మబుద్ది కాదు…
Ads
ఉజ్జయిని మహాకాళుడి గుడి కూడా జ్యోతిర్లింగం… అందుకే దానికి ఓ విశిష్టత… ఉజ్జయిని కాళేశ్వరంలో మూడు అంతస్థుల్లో వేర్వేరు లింగాలుంటయ్… దిగువన భూగర్భ గృహంలా కనిపించేది భస్మమందిరం… ఉదయం నాలుగు గంటలకు ఓ విశిష్ట హారతి శివుడికి… గోమయం పిడకల్ని విభూతిగా మార్చి, రెండు మూటల్లో నింపి, వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ, ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది…
నాగసాధువులు నిర్వర్తిస్తారు ఇది… మహిళల్ని అనుమతించేవాళ్లు కాదు… సంప్రదాయ దుస్తులతో కొందరినే రానిస్తున్నారు ఇప్పుడు… ఆ హారతి సందర్భంగా భేరీలు, మృదంగనాదాలు, కమ్ముకునే విభూతి, మంత్రాలు… అందరినీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకుపోతుంది…
ఇక్కడ ఓ విశేషం ఉంది… కొందరు ముందే ఏర్పాట్లు చేసుకుంటారు… మరణాన్ని అక్కడే ఉంటూ పదే పదే సంకల్పిస్తారు… శివుడిలో ఐక్యం కావాలని కోరిక… ప్రగాఢ వాంఛ… వాళ్ల శవాల్ని కాల్చేశాక, ఆ భస్మాన్ని కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఈ భస్మ హారతి సందర్భంగా లింగానికి సమర్పిస్తారు… దేవుడిలో పరిపూర్ణంగా ఐక్యం కావాలనుకునేవారి కోరిక అది… అయితే రోజుకు ఒకరికే ఆ అవకాశం… అసలు భస్మహారతి దర్శనానికి చాలారోజుల ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది… (ఇప్పుడు మానేశారని కొందరు, చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు…)
నిజానికి శివుడు లయకారుడు కదా… తన పూజలన్నీ స్మశానం, శవం, భస్మం తదితరాలతో కనిపిస్తాయి… అఘోరాలు, నాగసాధువుల పూజలు కూడా డిఫరెంటే… శివపూజలు ప్రధానంగా వైరాగ్య భావనలతో ఉంటయ్… సరే, ఇప్పుడు ఈ చర్చలోకి వద్దు గానీ… ఉజ్జయినిలో ఈ పూజలతో లింగం తరిగిపోతున్నదనే ఆందోళనల నడుమ సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసి, దాని నివేదికల ప్రకారం కొన్ని షరతులు పెట్టింది…
రివర్స్ ఆస్మాసిస్ ప్రక్రియలో శుద్ధిచేయబడిన అరలీటరు నీళ్లు మాత్రమే వాడాలి… పూజలు, అభిషేకాల వేళ వస్త్రాన్ని కప్పి ఉంచాలి… వాస్తవంగా ప్రతి జ్యోతిర్లింగం వద్ద అర్చనల్లో ప్రత్యేక రీతులుంటయ్… కోర్టులకు ఏం తెలుసు ఆగమశాస్త్రాలు అని అమాయకపు ప్రశ్న వేయకండి… వారిలో ఒక్కొక్కరు హిందూ అర్చన పద్దతుల్ని కాచివడబోసిన ఆదిశంకరాచార్యులు…!!
Share this Article