కేంద్ర విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమం అనేది అంతిమంగా దేశాన్ని పాతరాతియుగంలోకి తీసుకెళ్లడమే… ఈ పెడపోకడలు ఇంకా పెరిగితే దేశం ఎలా నష్టపోతుందనేది పెద్ద చర్చ… కొన్ని తరాలుగా మనవాళ్లు ఇంగ్లిషు ఆసరాగా, సాంకేతిక, వైద్య విద్యలను ఒడిసిపట్టుకుని, దేశదేశాలు వెళ్లి పొట్టపోసుకుంటున్నారు… మనవాళ్లు ప్రపంచమానవులు ఇప్పుడు… ఇప్పుడు ఆ వాతావరణాన్ని మెరుగుపరచాల్సింది పోయి, దాన్ని కూడా భ్రష్టుపట్టించబోతున్నారు… ఈవిషయంలో అమిత్ షా కమిటీ రిపోర్టు మన సమాజాన్ని వెనక్కి నడిపించేది…
ఇలాంటప్పుడే జనం గొంతువిప్పాలి… ఒరేయ్, మంచి చేయకపోయినా పర్లేదు, చెడగొట్టకండిరా అని…! హిందీ భాష రుద్దుడు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అనే తేడా ఏమీ ఉండదు… ఉత్తరాది పెత్తనం, పొగరు అది… కాకపోతే బీజేపీ దూకుడు ఎక్కువగా ఉంటోంది ఈమధ్య… మరీ సీతారాం ఏచూరి భాషలో ‘‘హిందీ, హిందూ, హిందుస్థాన్’’ అనే ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తిలో భాగమేనని నిందించలేం… హిందీ వేరు, హిందూ వేరు… అది భాష, ఇది మతం… అలాగైతే హిందీయేతరులు హిందూయేతరులేనా..? అబ్సర్డ్… అదే నిజమైతే, హిందువుగా బతకాలంటే హిందీ నేర్చుకుతీరాలి అంటారా రేప్పొద్దున కొంపదీసి…
స్టాలిన్, కేటీయార్, పినరై, ఈశాన్య రాష్ట్రాలతోపాటు ప్రతి నాన్-హిందీ గొంతు బీజేపీ ఆలోచన ధోరణి మీద దుమ్మెత్తిపోస్తున్నది… అవసరం కూడా… ఏ జాతీయ సోయీ లేని బటన్ల జగన్ ఇక్కడ కూడా సైలెంటే… దీన్ని పార్టీ కోణంలో గాకుండా దేశభవిష్యత్తు కోణంలో చూడాలి… భాష అనేది పాకిస్థాన్ అనే దేశాన్నే చీల్చింది… భాషతో చెలగాటం అంత ప్రమాదకరం… అది బీజేపీకి ఎలా సంకటం కాబోతుందో రాబోయేకాలంలో చూద్దాం… ఈ దేశం ఖర్మ ఏమిటంటే… మరో బలమైన ఆల్టర్నేట్ పార్టీ, లీడర్ దిక్కు లేకపోవడం…
Ads
ఇంగ్లిషు ప్రపంచ భాష… అందులో నైపుణ్యం, ఆ మాధ్యమంలో సాంకేతిక, ఆధునిక విద్య మనకు ప్రధానంగా బాసట… అంగీకరించి, అనుసరించడంలో తప్పులేదు… విస్తారమైన సబ్జెక్టు, అసంఖ్యాకంగా రెఫరెన్స్ పుస్తకాలు ఇంగ్లిషు సొంతం… ఒకవైపు సమాజం చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇంగ్లిషు బాటలో నడిపించాలని తాపత్రయపడుతుంటే… చివరకు కేంద్ర విద్యాసంస్థల్లోనూ హిందీ రుద్దుతామనే ప్రభుత్వ ధోరణి సింప్లీ తిరోగమనచర్య…
ఈ విషాదంలోనూ కాస్త నవ్వొచ్చే వ్యాఖ్య ఏమిటంటే… ‘‘ఐనా రాజులెవరుంటే వాళ్ల భాషే రాజభాష… ఎంచక్కా గుజరాతీనే రాజభాషగా ప్రకటిస్తే సరిపోదా..? అమిత్ షాకు ఆ సోయి కూడా లేదా..? ఇప్పుడు ఇండియా అంటే గుజరాతే కదా…’’ సరే, ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఓ డిబేట్… వై నాట్ తెలుగు..? ఎస్, తెలుగు దేశ భాష, జాతీయ భాష ఎందుకు కాకూడదు..? నవ్వొస్తుందా..? హిందీకున్న అర్హత ఏమిటి..? తెలుగుకు లేనిదేముంది..? జస్ట్, ఒక్కసారి ఇంకాస్త డీప్‌గా వెళ్తే… కేంద్రం స్థానిక భాష అనే పేరిట హిందీని రుద్దే ప్రయత్నానికి ఒడిగడుతోంది కదా… అయితే ఏది స్థానిక భాష..? అది హిందీ మాత్రమే ఎందుకు అవుతుంది..? కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్థానిక భాష…
పైన చార్జును జూమ్ చేసి చదవండి… నిజానికి రియల్ హిందీ ప్రాంతాలు ఏమిటో అర్థమవుతాయి… 1) Assamese, (2) Bengali, (3) Gujarati, (4) Hindi, (5) Kannada, (6) Kashmiri, (7) Konkani, (8) Malayalam, (9) Manipuri, (10) Marathi, (11) Nepali, (12) Oriya, (13) Punjabi, (14) Sanskrit, (15) Sindhi, (16) Tamil, (17) Telugu, (18) Urdu (19) Bodo, (20) Santhali, (21) Maithili (22) Dogri… మన అధికార భాషలు ఇవన్నీ… మరి ఈ జాబితాల్లోకి రాని ప్రముఖ స్థానిక భాషల మాటేమిటి…?
పశ్చిమం మొత్తం మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ… దక్షిణం మొత్తం మలయాళం, తమిళం, కన్నడం, తెలుగు… తూర్పు మొత్తం బెంగాలీ, ఒడియా, అస్సామీ…. మధ్యలో మిగిలిన కాసింత బెల్ట్ హిందీ… బ్రజ్ భాష, బుందేలీ, అవధి, భోజ్‌పురి, శాద్రి, బాఘెలి, మైథిలి, మాల్వి సహా బోలెడు భాషల్ని హిందీ ఖాతాలోకి తోసేస్తున్నారు… బోలెడు స్థానిక భాషలు… అసలు ఏ భాష ఎందరు మాట్లాడుతున్నారో సరైన లెక్కలు తీసిందెక్కడ..? సరిగ్గా లెక్కలు తీస్తే… రెండు సాలిడ్ స్టేట్స్‌తోపాటు, ఒరిస్సా, తమిళనాడు, కర్నాటక, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్లస్ ఢిల్లీ, గుజరాత్‌లోని వేల కుటుంబాలు… బహుశా తెలుగు నంబర్ వన్‌గా తేలినా ఆశ్చర్యపోనక్కర్లేదు… లేదా బంగ్లాదేశ్ అక్రమ వలసల పుణ్యమాని బెంగాలీ కూడా ప్రథమ స్థానంలోకి రావచ్చు కూడా…
మరి అధిక సంఖ్యలో జనం మాట్లాడే భాషకు రాజభాషగా పట్టం కడితే తప్పేముంది..? తెలుగుకు తక్కువేముంది..? పైగా చాలా ఫ్లెక్సిబుల్… ఇతర భాషల్లో కలిసిపోగలదు, ఇతర భాషల్ని కలిపేసుకోగలదు… సో, ఇదంతా ఫూలిష్‌గా కనిపించినా సరే… ఓ డిబేట్ తప్పేముంది… నిజానికి హిందీ జాతీయ భాష కావడంకన్నా, నిర్బంధంగా రుద్దడంకన్నా ఇంకేదీ ఫూలిష్‌నెస్ కాదు కదా… కేంద్ర విద్యాసంస్థల్ని హిందీకరించడంకన్నా సెన్స్‌లెస్ ఏముంటుంది..? అందుకని..!!
ఎవరి భాషను వాళ్లు సంరక్షించుకుంటూనే, ఇంగ్లిషు మాధ్యమానికి మరింత పట్టం కట్టి, ప్రపంచవ్యాప్త అవకాశాల్ని ఒడిసిపట్టడం నేటి అవసరం… మనల్ని తుగ్లక్కులు వెంట తీసుకుని వెళ్లే బాట దీనికి పూర్తి వ్యతిరేకం… ప్చ్, ఓ మంచి లీడర్ లేకపోవడం దేశానికి ఎంత అరిష్టమో…!! చివరగా :: జాతీయవాదం అంటే చివరకు భాష పేరిట కూడా పంచాయితీలు పెట్టి, మంటలు రేపడం మాత్రం కాదు…!!
Share this Article