ఓహ్… దేశంలోకెల్లా టాప్ టెన్ పత్రికల్లో ఒకటిగా చెలామణీ… ఏళ్ల తరబడీ తెలుగువాడి గొంతుగా ప్రాభవం… రాసిందే వార్త, చెప్పిందే నిజం… ఇలా ఉద్దరించిన ఈనాడు తాజా ఏబీసీ ఆడిటింగులో పావువంతు సర్క్యులేషన్ కోల్పోయిన తీరును రీసెంటుగా ‘ముచ్చట’ తన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చెప్పింది… ఈనాడు పత్రికను పట్టించుకోవడం మానేసింది… డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టిపెట్టింది… కాలానికి అనుగుణంగా పరుగును, పయనం దిశను మార్చుకుంది…
అయితే పోటీపత్రికలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజుకూ అదే నెంబర్ వన్… దాన్ని ఇప్పుడు ఇలాగే వదిలేసినా ఇంకొన్నాళ్లు ఆ బ్రాండ్ అలా నడుస్తూనే ఉంటుంది… అంతగా తెలుగు సమాజంలో ఇంకిపోయింది అది… అలాంటిది గ్రేట్ ఆంధ్ర అనే వెబ్‌సైట్ ఏదో ఒక వార్తాంశానికి సంబంధించి ఈనాడుపై ‘‘గ్రేట్ఆంధ్రను కాపీ చేసి డప్పు కొట్టుకుంటున్న ఈనాడు!’’ అని తాజాగా విరుచుకుపడింది… అప్పుడెప్పుడో అక్టోబరులో అది పరిశోధనాత్మక కథనం రాసిందట… దాన్ని కాపీ చేసి, సొంత కథనంలా అచ్చేసుకుని, కనీసం ‘గ్రేట్ఆంధ్ర’కు క్రెడిట్ ఇవ్వలేదట… కనీసం ఓ వెబ్‌సైటులో కథనం వచ్చింది అని రాసి ఉంటే మర్యాదగా ఉండేదట…
ఇదంతా రాసుకుంటూ ఓ వితండవాదన చేసింది… ‘‘ఒక పత్రికలో కథనం వచ్చింది.. ఒక మీడియా సంస్థలో కథనం వచ్చింది.. అంటూ ఒక లైను రాయడం ద్వారా అది తమ సొంత పరిశోధన, ఎక్స్క్లూజివ్ కాదు అని సంకేతం ఇచ్చి.. సంస్కారం చూపిస్తాయి…’’ అంటోంది… కొన్ని అంశాలు… 1) వార్తల్లో ఎంగిలి వార్తలు అంటూ ఉండవు… 2) వార్త ప్రాధాన్యాన్ని బట్టి ఎవరైనా ఫాలోఅప్ చేయాలి, చేస్తారు, చేయకపోతేనే తప్పు… 3) రాజకీయ కారణాలతో ఈనాడుకు ఇప్పుడు దాని అవసరం వచ్చింది కాబట్టి పబ్లిష్ చేసుకుంది, దాని పోకడే అది కదా… 4) వార్త నిజమా కాదా అనేదే పాఠకుడికి కావాలి… ఎవరు ముందు రాశారు అనేది పాఠకుడికి అక్కర్లేదు… అవి ఆయా మీడియా సంస్థలు కొట్టుకునే డప్పులు మాత్రమే…
Ads
5) ఇది మా పరిశోధన కాదు అని ఎవరూ హింట్‌పూర్వకంగా కూడా చెప్పుకోరు, దానికి సంస్కారం వంటి పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు… 6) అనేకసార్లు వార్తల ప్రాధాన్యాన్ని బట్టి, వాల్యూ యాడిషన్ కూడా జరుగుతుంది… 7) ఈనాడు, గ్రేట్‌ఆంధ్ర ఎదురెదురు క్యాంపులు… గ్రేట్‌ఆంధ్రకు ఈనాడు క్రెడిట్ ఇస్తుందా..? 8) ఈనాడు తన స్టోరీని తన సొంత పరిశోధన అనో, తన రెక్కల కష్టమనో చెప్పలేదు… ప్లెయిన్‌గానే ప్రజెంట్ చేసింది… కాకపోతే జగన్‌కు వ్యతిరేకం కాబట్టి వ్యంగ్యం జతచేసింది… అది దాని జన్యువ్యాధి… దానికెవడూ ఏమీ చేయలేడు… జగన్ సహా…!
9) పాత్రికేయంలో ఈనాడు కేరక్టర్ వేరు… పంథా వేరు… (సాక్షి, జ్యోతి కూడా)… వాటికి విస్తృతమైన న్యూస్ నెట్‌వర్క్ ఉంటుంది… టీవీల యంత్రాంగాలు… స్పాట్ వార్తలు దాదాపు అన్నీ కవర్ చేస్తాయి… అనేక రంగాల్ని టచ్ చేస్తాయి… వాటితో పోలిక ఏమిటసలు..? చెబుతూ పోతే ఇలాంటివి ఎన్నో… (ఇక్కడ నేను అసలు స్టోరీ లోతుపాతుల్లోకి వెళ్లడం లేదు… కేవలం గ్రేట్‌ఆంధ్రలో ఈనాడుపై ప్రచురితమైన కథనంలోని ఓ పేరాపై నా ఆసక్తి కేంద్రీకృతమైంది…)
తెలుగునాట తాము నెంబర్ వన్ దినపత్రిక అని చెప్పుకునే ఈనాడు.. ఇంటర్నెట్ రంగంలో ఆ హోదాను గ్రేట్ ఆంధ్ర ప్రభంజనానికి ఎన్నడో కోల్పోయింది. ఇంటర్నెట్ రంగంలో ఈనాడు ర్యాంకును అధిగమించి ‘గ్రేట్ ఆంధ్ర’ పైపైకి ఎగబాకడం చాలా నెలల కిందటే జరిగింది. ఇప్పటికీ కూడా గ్రేట్ ఆంధ్ర నెంబర్ వన్ తెలుగు వెబ్సైట్ గా అగ్రపథంలోనే కొనసాగుతూ ఉంది. అలాంటిది తమ నెంబర్ వన్ పోటీదారు ఇచ్చే కథనాలను కూడా తాము గమనించడం లేదు అని బుకాయిస్తున్నట్లుగా.. గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజులు ముందుగానే అందించిన పరిశోధనాత్మక కథనం ను కాపీ కొట్టి అంతా తమ సొంత పరిశోధన, తమ రెక్కల కష్టం లాగా డప్పు కొట్టుకోవడం ఈనాడుకు మాత్రమే చెల్లింది.
మా ప్రభంజనానికి ఈనాడు ఇంటర్నెట్ రంగంలో నెంబర్ వన్ అనే హోదాను ఎప్పుడో కోల్పోయింది… ఇప్పటికీ గ్రేట్ఆంధ్ర నెంబర్‌వన్… అంటోంది కదా, ఇప్పుడంతా యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్ల వార్తాలోకం కదా… ఈ నెంబర్ వన్ హోదా క్లెయిమ్ నిజమేనా..? ఓసారి చూద్దాం, ఈనాడును కిందకు తొక్కేసిన సైట్ అని మనమూ రాద్దాం అనిపించింది… గతంలో ఇవన్నీ చెక్ చేయడానికి అందరికీ అలెక్సా ర్యాంకింగ్ సైట్ అందుబాటులో ఉండేది… ఇప్పుడది లేదు… మరి గ్రేట్‌ఆంధ్ర ఈ నెంబర్ వన్ క్లెయిమ్ ఎలా చేసుకుంటోంది…? పోనీలే, మనం ఓసారి అలెక్సాకు ప్రతిగా చాలామంది పరిశీలనకు తీసుకుంటున్న సిమిలర్‌వెబ్ ర్యాంకింగ్ తీసుకుని చూద్దాం…
గ్రేట్‌ఆంధ్ర ఫీచర్స్ చూద్దాం… గ్లోబల్ ర్యాంకు 5353, కంట్రీ ర్యాంకు 2656 (అమెరికా), కేటగిరీ ర్యాంకు 202, 17 మిలియన్ వ్యూస్, 43.32 శాతం బౌన్స్ రేటు, 3.44 పేజెస్ పర్ విజిట్, 3.08 యావరేజీ విజిట్ డ్యురేషన్…. మరోవైపు ఈనాడు 1244 గ్లోబల్ ర్యాంకు, కంట్రీ ర్యాంకు 103 (ఇండియా), కేటగిరీ ర్యాంకు 22…, 45.5 మిలియన్ వ్యూస్, 11.08 యావరేజ్ విజిట్ డ్యురేషన్, 6.06 పేజెస్ పర్ విజిట్, 26.05 బౌన్స్ రేటు…. ఏరకంగా చూసినా ఈనాడు గ్రేట్‌ఆంధ్రకన్నా చాలా చాలా ముందంజలో పరుగు తీస్తోంది…
ఈనాడుది ఎంగిలిమంగలం సరే, కానీ ఈ అబద్ధాల డప్పుల గొప్పలేమిటి..? ఎస్, ఒకటి నిజం… నిన్న సాయిరెడ్డి కూడా అన్నట్టున్నాడు… ఈనాడును కౌంటర్ చేయడం సాక్షివల్ల కావడం లేదు… కాదు, అదెప్పుడో ఔట్ ఆఫ్ ట్రాక్… జగన్ ఫెయిల్ ప్రాజెక్టు… ఆ సాక్షికన్నా, ఆ ఆంధ్రజ్యోతికన్నా వ్యూస్ కోణంలో మాత్రం గ్రేట్ఆంధ్ర బెటర్… (నేనేమీ నెట్ ర్యాంకింగుల విశ్లేషణల్లో నిపుణుడిని కాను… రాసిన వివరాల్లో, వాదనలో అపరిపక్వత కనిపిస్తే దిద్దుకోవడానికి సిద్ధం…)
Share this Article