పార్ధసారధి పోట్లూరి ………. భారతదేశ విదేశాంగ విధానము – పాకిస్థాన్,అమెరికాల పాత్ర ! పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వచ్చిన సరుకు నిల్వచేసి ఉంటుంది. ఆ సరుకు తీసుకొచ్చినవాడు విలన్ అనుచరులతో మాట్లాడడు..తన టోపీ కింద ఉన్న సగం చింపిన 10 రూపాయల నోటు ని బయటికి తీస్తాడు దాంతో విలన్ అనుచరుడు ఒకడు తన టోపీ కింద ఉన్న మరో సగం చింపిన 10 రూపాయల నోటుని సరుకు తెచ్చిన వాడికి ఇస్తాడు. సదరు సరుకు తెచ్చిన వాడు తన దగ్గర ఉన్న సగం నోటు ముక్కతో విలన్ అనుచరుడు ఇచ్చిన మిగతా సగం నోటు ముక్కని కలిపి చూస్తాడు, సరిగ్గా రెండూ అతు క్కున్నట్లు అయిపోతుంది దాంతో తాను తెచ్చిన సరుకుని విలన్ అనుచరులకి ఇచ్చేసి షేక్ హాండ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతాడు !
ఎన్ని సినిమాలలో చూడలేదు ఇలాంటి దృశ్యాలని మార్చి మార్చి ? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే .. మన విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవలే ఒక వ్యాఖ్య చేశారు అమెరికా ని ఉద్దేశించి : మీరు పాకిస్థాన్ కి ఎందుకు సహాయం చేస్తున్నారో మాకు బాగా తెలుసు !
గత మూడు రోజుల క్రితం వారం రోజుల పర్యటన కోసం పాకిస్థాన్ సైనిక జెనెరల్ బజ్వా అమెరికాకి వెళ్ళాడు. అక్కడ బజ్వా కి ఘన స్వాగతం లభించింది ! ఒక దేశ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి అమెరికా పర్యటనకి వెళితే మహా అయితే అది మూడు రోజులకి మించదు కానీ పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ని కాకుండా కేవలం సైనిక అధ్యక్షుడిని అదీ వారం రోజుల షెడ్యూల్ ని ఎందుకు పెట్టినట్లు ?
Ads
సమాధానం చాలా సింపుల్ ! భారత్ లోకి ఉగ్రవాదులని ఎలా పంపాలి ? ఏదన్నా కొత్త వ్యూహం జెనెరల్ బజ్వా దగ్గర ఉన్నదేమో ! ఇలా భారత్ ని క్రాస్ బార్డర్ టెర్రరిజం ద్వారా ఇబ్బందులు పెట్టడానికి కొత్త వ్యూహ రచనకోసం బిడెన్ మంత్రాంగం బజ్వా ని వారం రోజుల పాటు అమెరికాలో ఉండడానికి ఆహ్వానించింది. దీని మీద మన జై శంకర్ చేసిన వ్యాఖ్య మాకు తెలుసు మీరు ఎందుకు జెనరల్ బాజ్వా ని పిలిచారో అని! సరుకుని మార్చుకోవడానికి చినిగిపోయిన నోటు కాకపోతే ఈ సారి ఏదో ఒక పాస్వర్డ్ చెప్పాలి సరుకు ఇచ్చేస్తారు. ఆ పాస్వర్డ్ పేరు క్రాస్ బార్డర్ టెర్రరిజం !
గత నెల చివరలో అమెరికా పాకిస్థాన్ కి F-16 పాకేజీ ని ప్రకటించింది. మొదట్లో అది పాకిస్థాన్ డాలర్లు పెట్టి కొంటున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ తరువాత ఆ పాకేజీ విలువ $450 డాలర్ల విలువ కల ఆర్ధిక సహాయం అని ప్రకటించింది అమెరికా. ఈ $450 మిలియన్ విలువ చేసే F-16 అప్గ్రేడేషన్ పాకేజీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదం మీద పోరు కోసం ఇస్తున్నట్లు తెలిపింది. 1980 వ దశకం మొదట్లో అమెరికా F-16 లని ఉచితంగా ఇచ్చింది పాకిస్థాన్ కి. ఆ తరువాత పాకిస్థాన్ కి అవసరం అయినప్పుడల్లా ఉగ్రవాదం మీద పోరు అనే నెపంతో బిలియన్ల కొద్దీ డాలర్లని ఇస్తూ వచ్చింది. మధ్య లో రెండు సార్లు పాక్ F-16 లకి అప్గ్రేడ్ కోసం నిధులు ఇచ్చింది అంటే ఎప్పటికప్పుడు స్పేర్ పార్ట్శ్ తో పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఆమెరికానే భరిస్తూ వచ్చింది. 2011 లో బిన్ లాడెన్ పాకిస్థాన్ లో పట్టుబడిన తరువాత ఆర్ధిక సహాయంలో కోత విధించింది అమెరికన్ కాంగ్రెస్. కానీ పూర్తిగా సహాయం నిలిపివేయలేదు.
2014 లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ఉగ్రవాదం మీద పోరు నెపంతో పాకిస్థాన్ కి ఇస్తున్న ఆర్ధిక,మిలటరీ సహాయం మీద నిషేధం విధించాడు దాంతో కేవలం అమెరికా ఆర్ధిక సహాయం మీదనే ఆధారపడుతూ వచ్చిన పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి నేడు దయనీయమయిన స్థితిలోకి ఉన్న సంగతి తెలిసిందే !
ఆపరేషన్ అల్ జవహరీ!
బిన్ లాడెన్ మరణం తరువాత అల్ ఖైదా కి అల్ జవహరి నేతృత్వం వహిస్తూ వచ్చాడు దాంతో అల్ ఖైదా అంతం అయిపోయింది అనుకున్న అమెరికా ఖంగు తిని అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది కానీ బిన్ లాడెన్ లాగానే పాకిస్థాన్ అల్ జవహరి ని రహస్యంగా ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్థాన్ సరిహద్దుల్లోనే ఉంచి కాపాడుతూ వచ్చింది. సిఐఏ ఎంత ప్రయత్నించినా ఒక దశాబ్దం పాటు అల్ జవాహారి ఆనవాళ్ళని గుర్తించలేకపోయింది. కానీ సిఐఏ కి తెలుసు పాక్ ISI సహకారంతో బిన్ లాడెన్ ఎలా అయితే 11 ఏళ్లు రహస్య జీవితం గడిపాడో అలాగే అల్ జవాహరీ ని కూడా పాక్ ISI రహాస్య ప్రదేశంలో దాచి ఉంచింది అని. కానీ గద్దించి అడగలేదు అలా అని ఊరికే ఉండలేదు !
రహస్య ఒప్పందం !
అల్ జవహరినీ ని అప్ప చెపితే పాకిస్థాన్ మీద ఉన్న ఆంక్షలని తీసివేస్తాను అని అమెరికా అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఆశ పెట్టింది కానీ ISI మరో రెండు షరతులు పెట్టింది.1. స్పేర్ పార్ట్శ్ లేక సగానికి సగం F-16 లు మూడు సంవత్సరాల నుండి కదలకుండా అలా పడి ఉన్నాయి కాబట్టి మొత్తం 85 F -16 ఫ్లీట్ ని ఆధునీకరించే విధంగా సహాయం చేయాలి. 2. FATF లో పాకిస్థాన్ మీద ఉన్న GREY లిస్ట్ నుండి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళకుండా చూడాలి అలాగే గ్రే లిస్ట్ నుండి పాకిస్థాన్ ని తీసివేయించాలి. 10 రూపాయల చినిగిన నోటు అతుక్కుంది ! అల్ జవహరి ఆచూకీ పిన్ పాయింట్ యాక్యూరేట్ గా జిపిఎస్ వివరాలతో అమెరికా కి ఇచ్చింది పాకిస్థాన్. అల్ జవహరి ని హత్య చేసింది అమెరికా! చనిపోయింది ఆఫ్ఘనిస్తాన్ లో కాబట్టి పాకిస్థాన్ చేతికి తడి అంటలేదు! నిజానికి అల్ జవహరి ని కాబూల్ లో సురక్షిత ప్రదేశంలో ఉంటేనే మేలు అని చెప్పి సరిహద్దుల నుండి కాబూల్ కి ప్రయాణం అయ్యేలా చూసింది ISI. ISI మాట నమ్మి అల్ జవహరి కాబూల్ వెళ్ళి హతమయ్యాడు! అమెరికా పని పాకిస్థాన్ చేసిపెట్టింది ! ఇక మిగిలింది అమెరికా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే!
రెండు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ అప్పుకోసం పాకిస్థాన్ అధికారులు సంప్రదించారు కానీ FATF గ్రే లిస్ట్ లో ఉన్నా ఐఎంఎఫ్ అప్పు ఇవ్వడానికి సిద్ధపడ్డది ! ఆఫ్కోర్స్ ఐఎంఎఫ్ లో అమెరికా జర్మనీ ల మాట చెల్లుబాటు అవుతుంది అన్నది అందరికీ తెలిసిందే ! కానీ అప్పు ఇవ్వడానికి పన్నులు పెంచాలి అని షరతు విధించింది ఐఎంఎఫ్ ! పాక్ ప్రభుత్వం పన్నులు పెంచక తప్పలేదు. ఇక గత నెల చివరలో పాత ఆర్ధిక సహాయాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరీ $450 మిలియన్ డాలర్ల F-16 అప్ గ్రేడ్ పాకేజీ ని ప్రకటించింది అమెరికా ! ఇప్పుడు సైనిక జెనెరల్ బజ్వా అమెరికా పర్యటనలో ఉన్నాడు.
భారత్ వైఖరి ఏమిటి ?
మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు అమెరికా ముఖం మీదనే చెప్పేశారు. పాకిస్థాన్ కి $450 మిలియన్ F-16 పాకేజీ ఎందుకు ఇస్తున్నదో మాకు బాగా తెలుసు అంటూ. ఒక పక్క చైనా కి వ్యతిరేకంగా QUAD అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే మరో వైపు పాకిస్థాన్ కి ఆర్ధిక సహాయంతో పాటు FATF గ్రే లిస్ట్ నుండి తొలగించడానికి దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తున్న సంగతి భారత్ చాలా ముందుగానే పసిగట్టింది ! ఇంతకీ EULA [End User License Agriment] ప్రకారం పాకిస్థాన్ F-16 లని కేవలం ఉగ్రవాదం పోరు కోసమే ఉపయోగించాల్సి ఉంటుంది కానీ పాకిస్థాన్ మొదటి నుండి భారత్ మీద ప్రయోగించడానికే అన్నట్లు ప్రవర్తిస్తూ వచ్చింది.
ఇంతకీ అమెరికా పాక్ కి ఇస్తున్న F-16 అప్గ్రేడ్ పాకేజీ వల్ల భారత్ కి ఉన్న ఇబ్బంది ఏమిటి ? ప్రస్తుతానికి ఏమీ ఉండబోదు కాకపోతే ఇప్పటి వరకు ఉన్న పై చేయి అనే భరోసా ఇక మీదట ఉండబోదు. మన దగ్గర ఉన్న రాఫెల్ ఏక కాలంలో రెండు F-16 లకి సమాధానం చెప్పగలదు. కాకపోతే మన దగ్గర ఉన్నది రాఫెల్ ఫైటర్స్ రెండు స్క్వాడ్రన్లు మాత్రమే ! ఇప్పుడు మరో రెండు స్క్వాడ్రన్లు లని సమకూర్చుకుంటే చాలు !
ఇంతకీ అమెరికా – పాకిస్థాన్ కొత్త దోస్తీ ఎంతవరకు ఉంటుంది ?
వెల్! పాకిస్థాన్ అమరికా కి మరో పని చేసిపెట్టాలి : అది అమెరికా కి వ్యతిరేకంగా పనిచేస్తున్న హక్కానీ నెట్ వర్క్ ని తుద ముట్టించాల్సి ఉంటుంది కానీ పాకిస్థాన్ ISI ఇదంత తేలికయిన పని కాదు. ఎందుకంటే అలా చేస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద ఐఎస్ఐ కి ఉన్న పట్టు పూర్తిగా పోతుంది దాంతో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం మీద కూడా కంట్రోల్ ఉండదు. కానీ ఒప్పందం ప్రకారం హక్కానీ నెట్ వర్క్ ని నాశనం చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ఆత్మహత్య తో సమానం అవుతుంది ISI కి .
ఇప్పటికే అల్ జవహరి విషయం లో మమ్మల్ని ఐఎస్ఐ మోసం చేసింది అని తాలిబన్లు బలంగా విశ్వసిస్తున్నారు! కానీ హక్కానీ నెట్ వర్క్ విషయం లో తాలిబన్లు సుముఖంగా ఉంటారు ఎందుకంటే హక్కానీ నెట్ వర్క్ అంటే తాలిబన్ల కి కూడా పడట్లేదు పైగా పరోక్షంగా పాకిస్థాన్ చేతిలో తాము కీలు బొమ్మ లాగా పనిచేయాల్సి వస్తున్నది హక్కానీ వల్ల అని కోపంగా కూడా ఉన్నారు తాలిబన్లు. కానీ హక్కానీ నెట్ వర్క్ ని నాశనం చేస్తే అది పరోక్షంగా పాక్ లో ఉన్న ఇతర ఉగ్ర గ్రూపులకి ఆగ్రహం తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఇతర ఉగ్ర గ్రూపులు ఇమ్రాన్ ఖాన్ చాల బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారు. దానికి సంకేతంగా పాక్ పంజాబ్ లో ఇమ్రాన్ ఖాన్ కి మద్దతుగా ఉగ్ర గ్రూపులు బహిరంగంగానే మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీలు తీస్తున్నారు. ఇది ఐఎస్ఐ కి మింగుడు పడట్లేదు !
So ! ఇవాళ కాకపోతే ఇంకో నెలలోనో ఇమ్రాన్ ఖాన్ ని హత్య చేయిస్తుంది ISI! ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ! ఇమ్రాన్ ఖాన్ ని అడ్డు తొలగించుకోలేకపోతే హక్కానీ నెట్ వర్క్ విషయంలో ముందుకు పోలేదు ఐఎస్ఐ ! ఇమ్రాన్ ఖాన్ ని చంపితే హింస చెలరేగుతుంది కానీ ఇతర ఉగ్ర గ్రూపులు మరో నాయకుడిని వెతుక్కునే లోపు హక్కానీ నెట్ వర్క్ ని అంతం చేయవచ్చు !
రష్యా దగ్గర భారత్ క్రూడ్ ఆయిల్ కొనడం ఇష్టం లేదు అమెరికాకి!
భారత్ ద్వారా కూడా రష్యా మీద ఆంక్షలు విధింపజేసి మరింత ఇబ్బందులకి గురిచేయాలి అని అమెరికా, నాటో దేశాల కోరిక ! అలా చేస్తే పుతిన్ కి తొందరగా చెక్ పెట్టవచ్చు. కానీ మోడీ అలా చేయలేదు. సమస్యకి దూరంగా లేరు అలా అని దగ్గరగా లేరు. సమ దూరం పాటిస్తున్నారు మోడీ ! భారత్ కనుక రష్యా మీద ఆంక్షలు విధిస్తే సౌదీ అరేబియా కూడా అదే పని చేస్తుంది కానీ రెండు దేశాలూ రష్యా తో సత్సంబంధాలే కోరుకుంటున్నాయి ! క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెంచమని జో బిడెన్ ఇటీవల చేసిన విజ్ఞప్తిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా సౌదీ అరేబియా రోజువారీ ఉత్పత్తిని తగ్గిస్తూన్నట్లు ప్రకటించింది మూడు రోజుల క్రితం !
కానీ ఆసియా దేశాలకి మాత్రం సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూస్తానని హామీ ఇచ్చాడు సౌదీ రాజు ! అంటే దీనర్ధం ఏమిటి ? ప్రస్తుతం సంక్షోభం లు ఉన్న యూరోపు కి ఆయిల్ సరఫరా లో కోత పడుతుంది లేదా ఇప్పుడు ఉన్న ధర కంటే ఎక్కువ ధరకి కొనాల్సి ఉంటుంది ! సరిగ్గా శీతాకాలం మొదలయ్యే సమయంలో క్రూడ్ ఉత్పత్తిని తగ్గిస్తూన్నట్లు ప్రకటించడం సౌదీ అరేబియా అమెరికా,యూరోపు పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉందో చెప్పకనే చెప్తున్నట్లు గా లేదు ? అదే వెస్ట్రన్ దేశాల పాలసీ ! ఉత్పత్తి తగ్గించు డిమాండు పెంచు దానితో పాటు ధరలు కూడా పెంచు !
కాబట్టి మళ్ళీ పాకిస్థాన్ ని దగర చేరదీసి పరోక్షంగా భారత్ ని ఇబ్బందులు పాలు చేయాలి ! అదే పాత పాలసీ ! కొంచెం కొత్తగా ఆలోచించాలి కదా ? జై శంకర్ అన్నది అదే ! ఇదంతా చూస్తుంటే తాలిబన్లు ఏం అనుకుంటున్నారు ? వేరే దారి లేదు తాలిబన్లకి ! భారత్ తమ స్వంత విషయాలలో వేలు పెట్టకుండా సహాయం చేస్తున్నది అనే భావన తాలిబన్లలో బలంగా నాటుకుపోయింది. అమెరికా ఎటూ సహాయం చేయదు పాకిస్థాన్ కి వ్యతిరేకంగా కాబట్టి భారత్ తో స్నేహంగా ఉండడమే మంచిది అన్న అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేశారు తాలిబన్లు !
Share this Article