మొన్నొకసారి చంద్రముఖి హీరోయిన్ల గురించి రాస్తున్నప్పుడు… చంద్రముఖి సీక్వెల్‌కు ఆ పాత దర్శకుడు వాసు దర్శకత్వం వహిస్తున్నాడనీ, చీప్ టేస్టున్న సదరు దర్శకుడు ఈ సినిమాను ఏం చేస్తాడో పాపం అని అభిప్రాయపడ్డాను… అనుమానించినట్టే జరిగింది… ఓ చెత్తా సినిమాను వదిలాడు ప్రేక్షకుల మీదకు…
సీక్వెల్‌కూ స్పూఫ్‌కూ తేడా తెలియదు ఈ దర్శకుడికి… ఓ పాపులర్ కమర్షియల్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే మరీ ఆ ఒరిజినలే పదే పదే గుర్తొచ్చేలా (పాతదే నయం అని గుర్తొచ్చేలా… ఆ పాతదానికే స్పూఫ్ అని ఫీలయ్యేలా…) తీయడం ఓ బ్లండర్… అదే గది… కొత్తగా ఎవరో కొనడం… అడ్డంకులు, ఇబ్బందులు… అదే చంద్రముఖి…
నిజానికి పాత చంద్రముఖి తరహాలో ఆ బ్రాండ్‌ను, ఆ సక్సెస్‌ను తాము కూడా సొమ్ము చేసుకోవడానికి నాగవల్లి వంటి పిచ్చి, చెత్త ప్రయత్నాలు గతంలో జరిగాయి… ప్రేక్షకుడు అడ్డంగా తిరస్కరించాడు… వెంకటేశ్ ఉంటేనేం, ఎవరైతేనేం… సేమ్ ఇప్పుడూ అదే జరుగుతోంది… అంతటి నటి కంగనా రనౌత్ హీరోయిన్, ప్రధాన పాత్ర, అదే చంద్రముఖి పాత్ర… దెయ్యం సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ రాఘవ లారెన్స్… సో వాట్..?
Ads
ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి… తీరా సినిమా చూస్తుంటే ఆస్కార్ పొందిన సంగీత దర్శకుడేనా తను అనిపిస్తుంది… వెరీ పూర్ బీజీఎం… ఇలాంటి సినిమాలకు కొత్త తరహా బీజీఎం అయితేనే సినిమా ఎలివేటవుతుంది… కీరవాణి ఫ్లాప్… బహుశా తన అసిస్టెంట్లకు అప్పగించేసి ఉంటాడు… తను తమ ఫ్యామిలీ సినిమాలు, అనగా రాజమౌళి సినిమాలకు అయితేనే కష్టపడతాడేమో…
రజినీకాంత్‌ను అనుకరిస్తూ రాఘవ లారెన్స్ చిరాకెత్తించాడు… తనలో ఒరిజినల్ లారెన్స్ లేడు ఇప్పుడు… పైగా కథాకథనాలు పూర్… తనైనా ఏం చేయగలడు ఇక… రజినీ బూట్లలో తన చిన్న కాళ్లు పెట్టి అడ్డదిడ్డంగా నడిచేశాడు… కంగనా గురించి చెప్పుకోవడం దండుగ… అస్సలు ఆ పాత్రకు నప్పలేదు… ఆమెకు ఇప్పటివరకూ సౌత్ సినిమా ఏదీ సక్సెస్‌ను ఇవ్వలేదు… ఆ జాబితాలో ఇది మరొకటి… అందం, అభినయంలో జ్యోతికకు ఆమడ దూరంలో ఆగిపోయింది…
వడివేలు పేరుమోసిన కమెడియన్… ఇందులోనూ తనది ప్రధాన పాత్రే… కానీ ఇటీవల కమెడియన్ పాత్రల్ని గాకుండా మామన్నన్ వంటి కాస్త విభిన్నమైన పాత్రలు ట్రై చేస్తున్నాడు… చంద్రముఖి-2 సినిమా అంగీకరించకుండా ఉండాల్సింది… ఏమాత్రం ఇంప్రెసివ్ కాదు తను… నిజానికి ఈ దర్శకుడికి చంద్రముఖి కథే సరిగ్గా అర్థం కానట్టుంది… అది దెయ్యం, ఆత్మ సినిమా కాదు… అదొక మెంటల్ డిజార్డర్ ఉన్న యువతి కథ… ఓ పాత కథలోని పాత్రను తనలోకి ఆవాహన చేసుకుని, దానిలాగే ప్రవర్తిస్తుంటుంది… ఆ జబ్బుకు రజినీకాంత్ చికిత్స చేస్తాడు… ఆ భవనం నుంచి ఆ అనకొండ బయటికి వెళ్లిపోవడం అంటే దెయ్యం లేదా చంద్రముఖి ఆత్మ వెళ్లిపోవడం కాదు, ఆ విషమ జబ్బు జ్యోతిక మనస్సులో నుంచి వెళ్లిపోయిందని, ఆమె స్వస్థురాలైందనీ అర్థం…
దర్శకుడికే ఆ ఒరిజినల్ కథే అర్థం గాకుండా… సీక్వెల్‌ను ఓ దెయ్యం కథ చేయబోయాడు… మరి ఒరిజినల్ బాగానే తీశాడు కదా అంటారా..? మలయాళ, కన్నడ సినిమాల్లో అప్పటికే హిట్టయిన సీన్లను యథాతథంగా కాపీ కొట్టేశాడు… దానికి కొన్ని రజినీ-వడివేలు మార్క్ వెగటు సీన్లను కలిపాడు… సీక్వెల్ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్త అవసరం… పాత కధకు కొనసాగింపే అయినా సరే ఆ పాత వాసనలు రాకూడదు, అదే సమయంలో కనెక్టయ్యే కొత్తదనం ఉండాలి…
పాత చంద్రముఖిలో జ్యోతిక ఆ చంద్రముఖి అవశేషాలున్న గది తెరవడంతోనే సమస్యలు… చంద్రముఖి సినిమా ఎండింగ్‌లో ఇక ఆ గదికి ఇంపార్టెన్స్ పోయింది… మళ్లీ ఈ సీక్వెల్‌లో అదే గది, తాళం… దాన్ని తెరవడంతోనే మళ్లీ సమస్యలు… ఇక్కడే కథ దెబ్బతింది… నలుగురు స్టంట్ మాస్టర్లు దేనికి..? ఏమో దర్శకుడికే తెలియాలి… అది తెరవకు, దాని తెరువు వెళ్లకు టైపు డైలాగులే పదే పదే వినిపిస్తే అదే చంద్రముఖి సీక్వెలా..? ప్చ్… ఆ చంద్రముఖి బ్రాండ్ పేరు భ్రష్టుపట్టించే బదులు ఏ కాంచన ఏడో భాగమో తీసేస్తే బాగుండేది కదోయ్ రాఘవా…!! (ఓవర్సీస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
Share this Article