Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవిత్రమైతేనేం… జీఎస్టీకి అర్హమే… ఎన్నికలయ్యేదాకా ఆగి కుమ్మేయడమే…

October 15, 2023 by M S R

Ganga GST:
“కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన”

గంగాసాగర సంగమంలాంటి పవిత్రమయిన చోట్ల స్నానాలు చేసినా; నోములు, వ్రతాలు చేసినా; దాన ధర్మాలు చేసినా…జ్ఞానం సంపాదించకపోతే…ఎన్ని జన్మలెత్తినా ముక్తిని మాత్రం పొందలేడు.

“భగవద్గీతా కించిదధీతా
గంగాజల-లవకణికా పీతా
సకృదపి యేన మురారిసమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా”

Ads

భగవద్గీతను కొంచెమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కయినా తాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా పూజించినవారు- యముడికి భయపడాల్సిన పనిలేదు. యముడితో చర్చే ఉండదు అంటే మృత్యుభయం పోతుంది అని అర్థం.

శంకరాచార్యుల భజగోవింద శ్లోకాలివి. మొదటిది పదిహేడవ శ్లోకం; తరువాతిది ఇరవైయవ శ్లోకం. ఒకే స్తోత్రంలో ఒకే విషయం మీద కొంత వైరుధ్యం ఉన్నట్లు కొందరు పండితులు తలలుకూడా బాదుకున్నారు. ముందేమో గంగాసంగమ స్నానాలెన్ని చేసినా జ్ఞానమే ముఖ్యం అని- వెంటనే రెండు శ్లోకాల వ్యవధిలో ఒక చుక్క గంగాజలం తాగితే చాలు…యముడు చర్చకు వస్తానన్నా సమయం లేదు పో పోవయ్యా! అని ధీమాగా అనవచ్చు అని అంతటి శంకరుడు ఎలా అన్నాడుస్మీ! అని ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది.

సైకాలజీలో మెదడు శక్తిని నిర్వచించేప్పుడు చివర విన్నదాన్నే మెదడు ఎక్కువగా గుర్తుపెట్టుకుని టక్కున చెప్పగలుగుతుందని…ముందు విన్నదాన్ని గాలికి వదిలేస్తుందని శాస్త్రీయ సిద్ధాంతం కూడా ఉంది. ఆ కోణంలో ముందు శ్లోకాన్ని మనం గాలికి వదిలేసి…తరువాత శ్లోకాన్ని గట్టిగా పట్టుకున్నాం. పూజలు, వ్రతాల్లాంటి కర్మలతో మొదలైన భక్తి జ్ఞాన మార్గంలోకి వెళ్లాలి అన్నది సూత్రం. భక్తి తత్వాన్ని జీర్ణించుకోకుండా; భక్తి అంతిమ లక్ష్యాన్ని అర్థం చేసుకోకుండా…ధూప, దీప, నైవేద్యాలు, తీర్థ ప్రసాదాల దగ్గరే ఆగిపోయే భక్తి భక్తి కాదా? అంటే…కాకుండా పోదు. ఆ కోణంలో ఒక చుక్క గంగా జలం తాగినా పుణ్యమే అని తీర్మానించాడు శంకరుడు.

అలా ఒక చుక్క గంగాజలం తాగి సకల పాపాలనుండి విముక్తి పొందడానికి ఇండియా దటీజ్ భారత్ లో కోట్ల మంది ఉబలాటపడుతూ ఉంటారు. దేనికి విపరీతమయిన డిమాండు ఉంటుందో అది వ్యాపారం అవుతుంది. ఎక్కడ వ్యాపారం ఉంటుందో అక్కడ జి ఎస్ టీ ఉంటుంది. సాక్షాత్తు కాశీ విశ్వనాథుడయినా ఒక లోటాడు గంగ మంచి నీళ్లు తాగాలంటే పద్దెనిమిది పర్సెంట్ జి ఎస్ టీ చెల్లించి… అన్నపూర్ణమ్మ తల్లిని బయట నుండి తెమ్మని అడగాల్సిన పరిస్థితి దాదాపుగా వచ్చింది. ఈలోపు హిందూ ఓటర్లలో వ్యతిరేకత వెల్లువెత్తడంతో గంగా జలం మీద జి ఎస్ టీ విధింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అసలే ఎన్నికల వేళ కాబట్టి వెంటనే ఉపసంహరణ నిర్ణయం వెలువడింది.

ఎప్పుడో పన్నెండు వందల ఏళ్ల కిందట కాలినడకన ఆసేతు హిమాచలం నాలుగు సార్లు తిరిగినవాడు కాబట్టి శంకరుడు అప్పటి అనుభవంతో చుక్క గంగనయినా తాగి పుణ్యం మూటకట్టుకుని బతికిపొండి అని భజగోవింద శ్లోకాల్లో అన్నాడు. పద్దెనిమిది శాతం జి ఎస్ టీ పరమ పవిత్ర గంగ వెంట కూడా పడుతుందని ఊహించి ఉంటే…అలా చెప్పి ఉండేవాడు కాదేమో!

బహుశా అందుకేనేమో తరువాత ఎవరో “గంగ గంగ గంగ” అని మూడుసార్లు స్మరించినా చాలు గంగలో మునిగిన పుణ్యం దక్కుతుందని…మరింత మినహాయింపు ఇచ్చారు. రేపు ఎన్నికలయ్యాక గంగ మీద జి ఎస్ టీ పడితే…నిజంగానే ముమ్మారు స్మరించడం తప్ప సనాతనధర్మ పేదలు చేయగలిగింది లేదు. స్మరణకు ఇప్పటికయితే జి ఎస్ టీ అప్లికబుల్ కాదు! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions